శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలను కలుపుకుని పోరుబాట సాగిస్తామని ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు కొయ్య మోషేన్‌రాజు తెలిపారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 38 మండలాలకు సంబంధించి పార్టీ యువజన, రైతు, మహిళా, విద్యార్థి విభాగాల కమిటీలను ఎన్నుకుని పార్టీని గ్రామస్థాయి నుంచి మరింతగా బలోపేతం చేయనున్నామన్నారు. టీడీపీ అరాచకాలను, అన్యాయాలను ప్రజలకు వివరించడానికే మండలాల వారీగా పార్టీ అనుబంధ విభాగాల కమిటీల ఎంపిక ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు.
పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. మండల కమిటీలో పనిచేసేందుకు కార్యకర్తలకు ఇదొక గొప్ప అవకాశమన్నారు. పార్టీ అధికారంలోకి వస్తేనే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణపాలన సాధ్యమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకే పార్టీ అనుబంధ విభాగాల మండల కమిటీ ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. పార్టీ యువజన, రైతు, మహిళా, విద్యార్థి విభాగాలకు కమిటీలు ఎంపిక చేసిన అనుబంధ విభాగాలను మరింత పటిష్టం చేయనున్నామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాగి దుర్గాప్రసాదరాజు, పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట
Published Tue, Feb 28 2017 12:10 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
Advertisement