హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధరా చేస్తున్న సీపీఐ నాయకులు
-
సీపీఐ నాయకులు శ్రీనివాస్‌రావు, వెంకట్రాములు
-
ఆర్‌డీఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు
హన్మకొండ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.వెంకట్రాములు ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆర్‌డీఓ కార్యాలయాల ఎదుట బుధవారం ధర్నా చేశారు. అలాగే, హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో శ్రీనివాస్‌రావు, వెంకట్రాములు మాట్లాడుతూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడంతో పాటు అధిక ధరలను నియంత్రించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు.
వంద రోజుల్లో ధరలను నియంత్రిస్తామని చెప్పిన నరేంద్రమోదీ అధికారంలోని వచ్చి రెండేళ్లు దాటుతున్నా అలా చేయలేకపోయారన్నారు. నిరంతరం స్వదేశీ జపం చేస్తూ విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ దేశ సంపదను కొల్లగొడతున్నారని ధ్వజమెత్తారు. లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, చివరకు రక్షణ రంగంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను యథేచ్ఛగా ఆహ్వానించడం సిగ్గుచేటని అన్నారు. మోదీ విధానాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అవలంబిస్తున్నారని వారు దుయ్యబట్టారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కాలయాపన చేస్తూ ప్రజల దృష్టిని మరలిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్థవ్యస్తంగా మారిందని, పేదలకు రేషన్ సరుకులు సక్రమంగా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా రెవెన్యూ అధికారి శోభకు వినతిపత్రం అందించారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, సీపీఐ నాయకులు సిరబోయిన కరుణాకర్, గోలి రాజిరెడ్డి, ఎన్.అశోక్‌స్టాలిన్, వి.సదానందం, బుస్స రవీందర్, ఎ.శ్రీనివాస్, ఎం.సాగర్, అలుపూర్తి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.