టెక్కలి:అధికారంలోకి రాక ముందు ఒక మాట...అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట ఆడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలపై ఉద్యమానికి సమాయత్తం కావాలని సీపీఎంకు చెందిన పలువురు రాష్ట్ర కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు జరగనున్న సీపీఎం 15వ జిల్లా మహాసభలు టెక్కలిలో సోమవారం ప్రారంభమయ్యూయి. ఈ సందర్భంగా పార్టీకి చెందిన రాష్ట్ర , జిల్లా కమిటీ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహాసభల్లో భాగంగా ముందుగా ఎర్రజెండాలు , జానపద కళా జాతతో పట్టణంలోని పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను విదేశీ పెట్టుబడుల పేరుతో ప్రభుత్వాలు విధ్వంసాలను సృష్టించేందుకు తీవ్ర స్థాయిలో కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు.
అభివృద్ధి పేరుతో ప్రజా వినాశనానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా జపాన్ వంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ పేరుతో గద్దెనెక్కిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు వ్యతిరేక విధానాలను ప్రవేశపెడుతున్నారన్నారు. ఇందులో భాగంగా రాజధాని నిర్మాణం పేరుతో దౌర్జన్యంగా రైతుల భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజల్ని దగా చేస్తూ కేంద్రంలో మతతత్వ పార్టీగా పేరు సంపాదించుకున్న బీజేపీ, రాష్ట్రంలో మోసపూరిత పాలన అందజేస్తున్న టీడీపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్నాయన్నారు.
వివిధ పరిశ్రమలకు అనుగుణంగా యాజమాన్యానికి అనుకూలమైన చట్టాలను అమలు చేస్తూ కార్మికులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన మంత్రి కార్మిక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బి.రోజా, బి.తులసీదాస్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. మహాసభల్లో ఎమ్మెల్సీ ఎంవీఎస్.శర్మ, సీపీఎం రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, భవిరి కృష్ణమూర్తి, ఎ.శ్రీనివాసరావు, గోవిందరావు, పినకాన కృష్ణమూర్తి, నంబూరు షణ్ముఖరావు, కొల్లి ఎల్లయ్య, హెచ్.ఈశ్వరరావు, పోలాకి ప్రసాదరావు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం
Published Tue, Jan 6 2015 3:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement