మీడియా సంస్థలపై రాహుల్ గాంధీ ఆగ్రహం
బీజేపీ విధానాలు ప్రజలకు శాపంగా మారాయని విమర్శ
కన్నూర్: కేంద్రంలోని అధికార బీజేపీ విధానాలను, సిద్ధాంతాలను విమర్శించినందుకు కొన్ని మీడియా సంస్థలు నిత్యం తనను దూషిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.
గురువారం కేరళలోని కన్నూర్, పాలక్కాడ్, కొట్టాయంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ మాట్లాడారు. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ విధానాలు దేశ ప్రజలకు శాపంగా మారాయన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై తాను పోరాటం సాగిస్తున్నానని చెప్పారు. అందుకు దూషణలు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన మీడియా చానళ్లు తనను లక్ష్యంగా చేసుకొని రోజంతా తిట్లదండకం వల్లిస్తున్నాయని ఆక్షేపించారు.
బీజేపీతో పినరయి విజయన్ లాలూచీ
భారతదేశం ఇప్పుడున్నంత అస్తవ్యస్తంగా గతంలో ఎన్నడూ లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సంపద పంపిణీలో ఇప్పుడున్న అసమానతలు గతంలో లేవని గుర్తుచేశారు. అందుకే రాబోయే తమ ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రాహుల్ మండిపడ్డారు. బీజేపీతో విజయన్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు జైలులో ఉన్నారని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయన్ ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆయనను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. దేశ ప్రజలపై ఒకే భాష, ఒకే చరిత్రను రుద్దడానికి కమల దళం కుట్రలు పన్నుతోందని పేర్కొన్నారు.
రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనే ఎన్నికలివి
ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు జరుగుతున్న ఎన్నికలు అని రాహుల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు వీడియో సందేశం ఇచ్చారు. భారతదేశం అనే భావనను నిరీ్వర్యం చేసేందుకు బీజేపీ సాగిస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే వెన్నుముక అని, వారిపై పెద్ద బాధ్యత ఉందని చెప్పారు. స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థలపై, న్యాయ వ్యవస్థపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దాడికి దిగుతున్నాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment