ప్రజా వ్యతిరేక విధానాలపై సమరభేరి
హిందూపురం : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో కార్మికులు, ప్రజలు ‘సమరభేరి’ మోగించారు. మంగళవారం వారు హిందూపురంలో ఆందోళనలతో హోరెత్తించారు. ముందుగా ట్రాక్టర్ యజమానుల అసోసియేషన్ సభ్యులు, భవన నిర్మాణ కార్మికులు, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది ప్రజలతో కలిసి స్థానిక చిన్న మార్కెట్ సర్కిల్ నుంచి ర్యాలీ చేపట్టారు.
అంబేద్కర్ సర్కిల్‌లో దాదాపు మూడు గంటల పాటు ఆందోళన చేశారు. తర్వాత తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని మహాధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు నెలలకు ఒకసారి చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రజల మధ్య ఉండాలని, సినిమాలు తీసుకుంటూ నియోజకవర్గ ప్రజల కష్టాలను విస్మరించడం తగదని హితవు పలికారు. ‘మీ బావ చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిలదీసేందుకు మీకు ధైర్యంలేదా’ అని ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలు, కార్మికులు, కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికీ తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. దీంతో నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఆందోళనకు దిగినట్లు చెప్పారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చడం లేదని మండిపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారని, చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్లీ కరువు తాండవిస్తోందని అన్నారు.
ప్రభుత్వం ఇసుక వ్యాపారం ద్వారా పచ్చచొక్కాల పొట్ట నింపుతోందని దుయ్యబట్టారు. దీనివల్ల మూడు నెలలుగా ట్రాక్టర్ల యజమానులు, బేల్దార్లు, భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవన్నారు. వారు తమ సమస్యలను తెలపడానికి బాలకృష్ణ వద్దకు వెళ్లగా పోలీసులతో బెదిరించి పంపారన్నారు. ‘నవీన్ నిశ్చల్ విమర్శిస్తున్నాడని మీ నాయకులు ఫోన్ చేస్తేనే హిందూపురం వస్తున్నావు. పోలీసుల రోప్ పార్టీ మధ్య అలా తిరిగి వెళ్లిపోతున్నావు.
ఏనాడైనా సామాన్యులు సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులో ఉన్నావా?’ అంటూ బాలకృష్ణపై నిప్పులు చెరిగారు. ధర్నాకు మద్దతుగా సీపీఐ కౌన్సిలర్ దాదాపీర్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసిందన్నారు. స్థానిక టీడీపీ నాయకులు భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు, కమీషన్లతో కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు.
ధర్నా అనంతరం తహశీల్దార్ చల్లా విశ్వనాథ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ షానూర్‌బాషా, పట్టణ అధ్యక్షుడు సమ్మద్, ఏ బ్లాక్ అధ్యక్షుడు ఇర్షాద్, బీ బ్లాక్ అధ్యక్షుడు మల్లికార్జున, రూరల్ అధ్యక్షుడు బసిరెడ్డి, మున్సిపల్ ప్రతిపక్షనాయకుడు శివ తదితరులు పాల్గొన్నారు.