రాష్ట్రంలోని కొన్ని బెటాలియన్లలో టీజీఎస్పీ సిబ్బంది నిరసనలు
తమ తోటివారిపై సస్పెన్షన్లు ఎత్తివేయాలంటూ వినతులు
ఏక్ పోలీస్ విధానం అమలు చేసేవరకు తగ్గేది లేదంటున్న కానిస్టేబుళ్లు
సిబ్బందికి నచ్చజెబుతూనే కఠిన చర్యలకు ఉన్నతాధికారుల హెచ్చరికలు
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల క్రైం/ఖిలా వరంగల్: టీజీఎస్పీ పోలీసులకు సంబంధించిన సెలవుల విధానంలో మార్పు నేపథ్యంలో మొదలైన సిబ్బంది ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. ఆందోళనల నేపథ్యంలో సస్పెండైన తమతోటి సిబ్బందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నా ఖాతరు చేయడం లేదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారని గుర్తించిన 39 మంది టీజీఎస్పీ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ టీజీఎస్పీ అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
3, 4, 5 17వ బెటాలియన్లలో ఆరుగురు చొప్పున, 6, 12, 13వ బెటాలియన్లలో ఐదుగురు చొప్పున సస్పెండ్ చేశారు. దీంతో కానిస్టేబుళ్లు ఆదివారం మరోమా రు ఆందోనకు దిగారు. నల్లగొండలోని 12వ బెటాలియన్ సిబ్బంది కాసేపు ఆందోళన చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని హైదరాబాద్ కొండాపూ ర్‌లోని 8వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, పిల్లలు క్యాండిల్ మార్చ్ చేశారు. ములుగు జిల్లా చల్వాయి ఐదో బెటాలియన్‌కు చెందిన సిబ్బంది ఏకంగా అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్‌జైన్‌కు లేఖ రాశారు.
సస్పెండ్ చేసిన తమ తోటి సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే అందరినీ సస్పెండ్ చేయాలని వారు ఆ లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు సిరిసిల్లలోని సర్దాపూర్ 17వ బెటాలియన్ పోలీసులు కూడా సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు విన్నవించారు. కొద్దిసేపు బైఠాయించిన తర్వాత విధుల్లో చేరారు.
అనంతరం ఆదివారం రాత్రి సిరిసిల్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము చేస్తున్న శాంతియుత నిరసనలను గమనించి ఉద్యోగులకు బాసటగా నిలవాల్సిన ఉన్నతాధికారులు కొందరిపై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని అన్నారు.
సివిల్ డ్రెస్‌తో ధర్నా
ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ మామునూరు టీజీ ఎస్పీ నా లుగో బెటాలియన్ గేటు వద్ద సిబ్బంది ధర్నాకు దిగారు. శనివారం బెటాలియన్ గేటు వద్ద ఆందో ళనకు దిగిన కానిస్టేబుళ్లు ఎస్.సతీష్, బి.రమేష్, డి.శ్రీనివాస్, సీహెచ్ ప్రశాంత్, పి.సంపత్ కె.వినోద్‌ను సస్పెండ్ చేస్తూ అదేరోజు రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉదయం విధులకు హాజరైన స్పెషల్ పోలీసులు యూనిఫాం లేకుండా సివిల్ డ్రెస్‌తోనే బెటాలియన్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. వీరికి పోలీసు కుటుంబాల సభ్యులు బాసటగా నిలిచారు.
ఫోకస్ పెంచిన ఉన్నతాధికారులు
టీజీఎస్పీ సర్విస్ రూల్స్ ఏంటి?, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పుడు ఏక్ పోలీస్ విధానం లేకపోవడం, టీజీఎస్పీ అన్నది పారామిలిటరీ ఫోర్స్ కాబ ట్టి అందుకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది.. ఇలాంటి అనేక కోణాల్లో సిబ్బందికి నచ్చజెప్పేందుకు పోలీస్ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన మేర సత్ఫలితాలు ఇవ్వ డం లేదు. దీంతో తదుపరి చర్యలతోపాటు..ఆందోళన మూలాలపై పోలీస్ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు.
ఇప్పటికే ఆయా బెటాలియన్లలో అడిషనల్ డీజీ స్థాయి నుంచి స్థానిక ఎస్పీల వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇదే పద్ధతిలో మరింత లోతుగా యథార్థ పరిస్థితులను సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం కొనసాగించడంతో పాటు క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదన్న సందేశాన్ని మరింత గట్టిగా సిబ్బందికి పంపే యోచనలో పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment