పేపర్ లీకేజీపై హైదరాబాద్‌లో ‘స్టూడెంట్ మార్చ్’
‘నీట్’ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్/హిమాయత్‌నగర్/పంజగుట్ట: నీట్ పరీక్ష లీకేజీపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు తెలంగాణకూ పాకాయి. నీట్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లో వివిధ విద్యార్థి సంఘాల నేతృత్వంలో స్టూడెంట్ మార్చ్ జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్ యూ, విద్యార్థి జనసమితి, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యా ర్థి విభాగం, ఏఐవైఎఫ్, డీవైఎఫ్‌ఐ, పీవైఎల్, వి ద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యా లీ జరిగింది.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్‌టీఏను రద్దు చేయాలని, నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్ పరీక్ష అవకతవకలు, పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్.మూర్తి అధ్యక్షతన సభ జరిగింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నా గరాజు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ తదితరులు మాట్లాడారు.అవకతవకలకు పాల్పడిన, పేపర్ అమ్ముకున్న ఎన్‌టీఏ చైర్మన్, డైరెక్టర్ల పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఎన్‌టీఏను రద్దు చేసి తిరిగి ఆయా రాష్ట్రాలు పరీక్ష నిర్వహించుకునే వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న మంత్రులు దీనిపై స్పందించడం లేదని, పరీక్ష పే చర్చ అనే మోదీ పరీక్షలు లీకేజీలపై నోరుమెదపడం లేదని, సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి రెండుచోట్ల అవకతవకలు జరిగాయని ఒప్పకున్న తర్వాత కూడా మౌనం పాటించడం వెనుక ఎవరి ప్రయోజనాల కోసం అని ప్రశ్నించారు.
మళ్లీ పరీక్షపై విద్యార్థుల్లో భయం భయం
అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఇప్పటికే రాష్ట్రస్థాయి ర్యాంకులు వచ్చేవి. విద్యార్థులు తమకు ఎక్కడ సీటు వస్తుందోనన్న అంచనా కూడా వచ్చేది. కానీ నీట్ పేపర్ లీక్ కావడంతో.. విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ నీట్ పరీక్ష నిర్వహిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని అంటున్నారు. మళ్లీ చదివి రాస్తే ఇవే ర్యాంకులు వస్తాయన్న గ్యారంటీ ఉండబోవన్నారు. అంతేగాక కాలేజీ యాజమాన్యాలు కూడా మళ్లీ పరీక్ష అంటే విద్యార్థులకు తీవ్రమైన మానసిక వేదనే ఉంటుందన్నారు.
ఉద్రిక్తంగా మారిన చలో రాజ్‌భవన్
నీట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్‌భవన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేట్లు ఎక్కిన నాయకులను పోలీసులు అడ్డుకొని కిందకు దింపి అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్‌ఎస్‌వీ నాయకులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ ఎక్కడా లేనివిధంగా ఒక ప్రవేశ పరీక్షలో 67 మంది అభ్యర్థులు 720కి 720 మార్కులు సాధించడం గిన్నిస్ రికార్డు సాధించినట్లే అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment