మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందొద్దు.. పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తాం
బీఆర్‌ఎస్ ట్రాప్‌లో పడొద్దు.. వారి రాజకీయ కుట్రలకు బలి కావొద్దు
హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్
సాక్షి, హైదరాబాద్: మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందొద్దని..పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అప్పుడు జరిగిన పనులపై విచారణ జరిపి బిల్లులు చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక సర్పంచ్‌లతో బలవంతంగా పనులు చేయించలేదని, బిల్లులు ఆపలేదన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, అయినా బిల్లుల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
‘మీ బిల్లుల ను ఆపిన మాజీ మంత్రులకు మీరు వంత పాడటం తగదు. వారి రాజకీయ కుట్రలకు మాజీ సర్పంచ్ లు బలి కావొద్దు’అని కోరారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇంకా రాలేదని, అలాంటప్పుడు వాటి ని దారి మళ్లించే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. మాజీ సర్పంచ్‌లను బీఆర్‌ఎస్ రెచ్చగొడుతున్నదని సోమ వారం ఒక ప్రకటనలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నాయకుల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌ల ఆత్మహత్యలు, పెండింగ్ బిల్లులపై పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తా కథనాలను ఆమె మీడి యాకు విడుదల చేశారు.
‘బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వకపోగా, వారితో బలవంతంగా పనులు చేయించింది. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణమైంది’ అని ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు మాజీ సర్పంచ్‌లపై ప్రేమ ఉన్నట్టుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఆర్థిక మంత్రిగా హరీశ్ ఉన్నప్పుడే తమ బిల్లులు పెండింగ్‌లో పెట్టారని మాజీ సర్పంచ్‌లకు స్పష్టంగా తెలుసని, తాము వచ్చాక రూ. 580 కోట్లు చెల్లించామన్నారు.
కేసీఆర్, హరీశ్‌ల ఇళ్ల ఎదుట ధర్నా చేయండి
‘డ్రామాలు చేయడం.. ఆత్మహత్యలకు పురికొల్పడం హరీశ్‌రావుకు అలవాటు. నాడు సర్పంచ్‌ల ఆత్మహత్యలకు కారణమై...నేడు తిరిగి వారిని రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే హరీశ్, బీఆర్‌ఎస్ మాజీ సర్పంచ్‌లను వాడుకుంటోంది. గతంలో సర్పంచ్‌ల ఆత్మహత్యలకు కేసీఆర్, హరీశ్‌రావు కారణం కాదా ? బిల్లులు పెండింగ్‌లో పెట్టిన వారి ఇళ్ల ముందు మాజీ సర్పంచులు ధర్నా చేయాలి’ అని సీతక్క అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment