అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన
సాక్షి, అమరావతి/సీతమ్మధార : రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లకు గత మూడు నెలలుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మరో విడత సోమవారం అన్ని జిల్లాల్లో వలంటీర్లు ఆందోళనలు నిర్వహించారు.
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల వేదికలో వలంటీర్ల ప్రతినిధి బృందాలు ఆయా జిల్లాల కలెకర్లను కలిసి ఈ మేరకు వినతిపత్రాలను అందజేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వలంటీర్ల గౌరవ వేతనం రెట్టింపు చేసి రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారని ఈ సందర్భంగా వలంటీర్ల సంఘాల నేతలు గుర్తించారు.
కూటమి ప్రభుత్వం వలంటీర్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 26 నుంచి 2 వరకు వలంటీర్లు శాంతియుత నిరసనలకు సీపీఐ అనుబంధ ఏఐవైఫ్ పిలుపునిచ్చింది.
వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోండి
వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రజా వార్డు వలంటీర్ అసోసియేషన్ ఆధ్వరం్యలో వలంటీర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు వలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని, ప్రతి నెల రూ.10 వేలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన వలంటీర్లను తిరిగి కొనసాగించాలన్నారు. వలంటీర్ల ధర్నాకు సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది.
ధర్నాలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటసుబ్బయ్య, భవానీప్రసాద్, కోడూరి రాము, పెంచలయ్య, బాలకృష్ణప్రసాద్, కోడూరు లక్ష్మణ్, ఆంజనేయులు, అజార్, రాజు, పార్వతి, గుణసాయి, కె.రాజు, సంధ్య, శృతి, గాయత్రి, నాగపుష్ప, భారతి, సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్‌వీ కుమార్, సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్.జ్యోతీశ్వరరావు, కె.కుమారమంగళం, జి.అప్పలరాజు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment