
30 ఏళ్లు.. 87 టీఎంసీలు
► ‘మిషన్ భగీరథ’ అవసరాలపై అంచనాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’కు అవసరమయ్యే నీటి లెక్కలు సిద్ధమయ్యాయి. రాబోయే 30 ఏళ్ల అవసరాలపై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 2018 జనవరి నాటికి సుమారు 60 టీఎంసీల నీరు అవసరమవుతుందని, 2050 నాటికి అది 87.64 టీఎంసీలకు చేరుతుందని లెక్కలేసింది. నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి తాగునీటికి 10 శాతం నీటిని వాడుకోవాలనే నిర్ణయానికి అనుగుణంగా ఈ అంచనాలను తయారు చేసింది. ఏ నది బేసిన్ నుంచి ఎంత నీరు తీసుకోవాలి, ప్రాజెక్టుల నుంచి ఎంత తీసుకోవాలన్న అంశాలపై నీటిపారుదల శాఖ, తాగునీటి విభాగం అధికారులతో కలసి ఈ కార్యాచరణ రూపొందించారు.
గత అంచనా కన్నా భారీగా పెరుగుదల
వాస్తవానికి మిషన్ భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని 26 సెగ్మెంట్లకు నీరందించేందుకు ప్రాజెక్టుల నుంచి మొత్తం 39.19 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. కృష్ణా బేసిన్‌లో 19.59 టీఎంసీలు, గోదావరి నుంచి 19.67 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే పెరుగుతున్న రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఈ కేటాయింపుల్లో మార్పులు చేసింది. ఈ ఏడాది మొదట్లో నీటి అవసరాలపై అంచనాలు వేసిన అధికారులు వాటిని సవరించారు. 2018 నాటికి 41.31 టీఎంసీలు, 2033 నాటికి 50.6 టీఎంసీలు, 2048 నాటికి 60.75 టీఎంసీల అవసరం ఉంటుందని లెక్కకట్టారు. అయితే వచ్చే 30 ఏళ్ల అవసరాలపై అంచనాలు సిద్ధం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నుంచి 10 శాతం నీటిని తీసుకోవాలని సూచించారు.
దీంతో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సమావేశాలు నిర్వహించిన నీటిపారుదల, తాగునీటి విభాగం అధికారులు నీటి అవసరాల ప్రణాళికలు సిద్ధం చేశాయి. రెండు బేసిన్‌ల పరిధిలోని 37 ప్రాజెక్టుల నుంచి 2018 నాటికే 59.17 టీఎంసీలు తీసుకోవాలని, ప్రతి ఐదేళ్లకు 5 టీఎంసీల మేర పెరిగినా 2050 నాటికి 87.64 టీఎంసీలు అవసరం ఉంటుందని లెక్కలేశాయి. ఇందులో గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నుంచే అధిక కేటాయింపులు ఉండేలా చూసుకున్నాయి. 2018లో ఈ బేసిన్ ప్రాజెక్టుల నుంచి 32.17 టీఎంసీలు తీసుకోనుండగా.. కృష్ణా బేసిన్ నుంచి 23.08 టీఎంసీలు తీసుకోనున్నారు. ఈ లెక్కన 2050 నాటికి గోదావరి నుంచి 54.50 టీఎంసీలు తీసుకోనుండగా.. కృష్ణా బేసిన్ నుంచి 33.11 టీఎంసీల మేర తీసుకోనున్నారు. ఈ నీటిని తీసుకునేందుకు 37 ప్రాజెక్టుల కనీస మట్టాన్ని (ఎండీడీఎల్) కూడా నీటిపారుదల శాఖ నిర్ధారించింది. మార్చిన ఎండీడీఎల్‌లకు అనుగుణంగా ప్రాజెక్టుల ఆపరేషన్ మాన్యువల్‌లో మార్పులు చేసి ప్రభుత్వానికి అందించింది.
నీటి అవసరాల అంచనా ఇలా.. (టీఎంసీల్లో)
ఏడాది నీటి అవసరం
2018 59.17
2023 66.16
2028 69.56
2033 72.65
2038 76.98
2043 81.20
2048 85.34
2050 87.64
► వచ్చే జనవరి నాటికి నీటి అవసరం60టీఎంసీలు
►2028 నాటికి నీటి అవసరం69టీఎంసీలు
►ప్రాజెక్టుల నుంచి తాగునీటికి..10%