
మిషన్ భగీరథ ఎందుకు?: కోదండరాం
కేయూ క్యాంపస్ (వరంగల్): తెలంగాణ ప్రభుత్వం విచిత్రంగా వ్యవహరిస్తోందని, గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు ఉండగా.. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారో తెలియడం లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హన్మకొండలో ఆదివారం మానవ హక్కుల వేదిక వరంగల్ జిల్లా ఏడో మహాసభల్లో ఆయన మాట్లాడారు.
మిషన్ భగీరథ పథకం కోసం ప్రభుత్వం రూ. 42 వేల కోట్లు కేటాయించి పనులను మెగా కంపెనీకి అప్పగించారని, వీటిని ప్రభుత్వమే చేయిస్తే రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్ల వరకు మిగులుతాయన్నారు. నేరెళ్లలో ఇసుక రవాణా అధికంగా ఉందని, స్పీడ్ బ్రేకర్లు వేసి లారీల వేగాన్ని నియంత్రించాలని కోరిన వారిపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాము ఎక్కడికి వెళ్తున్నా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.