అనుసంధానంతో సస్యశ్యామలం | CM YS Jagan mandate to Water Resources department officials | Sakshi
Sakshi News home page

‘గోదావరి–కృష్ణా’ అనుసంధానంతో సస్యశ్యామలం

Published Tue, Feb 4 2020 3:41 AM | Last Updated on Tue, Feb 4 2020 11:50 AM

CM YS Jagan mandate to Water Resources department officials - Sakshi

సాక్షి, అమరావతి: గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే తమ లక్ష్యమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను గరిష్ఠంగా ఒడిసి పట్టి, కనిష్ఠ వ్యయంతో తక్కువ సమయంలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి తరలించడంపై సమగ్రంగా అధ్యయనం చేసి.. నెలలోగా నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖాధికారులను ఆయన ఆదేశించారు. పోలవరంతోపాటు వెలిగొండ, వంశధార, తోటపల్లి తదితర ప్రాజెక్టులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. రాయలసీమ కరువు నివారణ కోసం ప్రాజెక్టుల కాలువల విస్తరణతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులను చేపట్టి శరవేగంగా పూర్తిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు.

పోలవరం, గండికోట, వెలిగొండ ప్రాజెక్టుల నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ సామర్థ్యాన్ని మరో రెండు టీఎంసీలకు పెంచి, రోజుకు రెండు టీఎంసీల చొప్పున గోదావరి వరద జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించి, అక్కడి నుంచి బొల్లాపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు తరలించి.. అక్కడి నుంచి బీసీఆర్‌ (బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌)లోకి తరలించే ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. 
సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

శరవేగంగా నదుల అనుసంధానం..
తక్కువ ఖర్చుతో గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం.. అధికంగా జలాల తరలింపు.. శరవేగంగా పనులు పూర్తయ్యే మార్గాలపై అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ విస్తృతంగా చర్చించారు. పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి తరలించే గోదావరి జలాలను.. అక్కడ నుంచి ‘రివర్స్‌ పంపింగ్‌’ ద్వారా పులిచింతల ప్రాజెక్టులోకి.. మళ్లీ అక్కడి నుంచి టెయిల్‌ పాండ్‌లోకి.. ఆ తర్వాత సాగర్‌లోకి.. అక్కడి నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోసే అంశంపై కూడా అధ్యయనం చేయాలని అధికారులకు వైఎస్‌ జగన్‌ సూచించారు. నదిలో జలాలను తరలించడంవల్ల భూసేకరణ సమస్య ఉత్పన్నం కాదని.. దీనివల్ల వ్యయం కూడా తగ్గుతుందన్నారు. దీనిపై నెలలోగా నివేదిక ఇవ్వాలని.. దాని ఆధారంగా నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పారు. కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గుతున్న నేపథ్యంలో.. ఆ జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు గోదావరి జలాలను తరలించి.. కరువురహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

పోలవరం నిధులు రాబట్టండి
పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయాలని అధికారులను సీఎం  ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రీయింబర్స్‌ చేసిన రూ.1,850కోట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సోమవారం చేరాయని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన మిగిలిన రూ.3,823 కోట్లను కూడా రీయింబర్స్‌ చేయాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల ఆమోదం ప్రక్రియ కూడా తుదిదశకు చేరుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి, పోలవరానికి నిధులు రాబట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయాలని సీఎం చెప్పారు. అలాగే,  జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. పోలవరం, గండికోట, వెలిగొండ, సీబీఆర్‌ (చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌) తదితర ప్రాజెక్టుల నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ప్రాజెక్టుల పనులను క్షేత్రస్థాయిలో తాను పరిశీలిస్తానని, ఇందులో భాగంగా ఈనెల 19న వెలిగొండ ప్రాజెక్టు.. 27న పోలవరం పనులను తనిఖీ చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

కరువు నివారణకు రూ.33,869 కోట్లు
కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లో ఆ వరద జలాలను ఒడిసి పట్టేలా రాయలసీమ ప్రాజెక్టుల కాలువల సామర్థ్యాన్ని పెంచడం.. కరువు నివారణ పనులకు రూ.33,869 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. దీంతో ఆ పనులకు పరిపాలన అనుమతులిచ్చి.. టెండర్లు పిలవాలని ఆయన ఆదేశించారు. అలాగే.. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి.. కొత్తగా ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రాధాన్యత ప్రాజెక్టు కింద చేపట్టాలన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.15,488 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని అధికారులు వివరించగా.. ఈ పనులూ చేపట్టడానికి అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం నుంచి విశాఖకు నీటిని తరలించే నిమిత్తం పైప్‌లైన్‌ వేయడానికీ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement