ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మధ్యలో గోదావరి వరద ప్రవాహం స్పిల్‌వేలోకి వచ్చినా పనులను ఆపకుండా అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ఈ సీజన్‌లో రెండుసార్లు వచ్చిన వరదతో స్పిల్ చానల్ మునిగిపోయింది. దాదాపు 24 లక్షల క్యూసెక్కుల ప్రవాహం స్పిల్‌వే నుంచి ప్రవహించింది. అయినా పనులను ఆపలేదు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకనుగుణంగా పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పోలవరంలో 3,356 మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఏకకాలంలో భీమ్‌ల నిర్మాణ పనులు పూర్తిచేసి.. ఒక వైపు నుంచి గేట్లు అమర్చుకుంటూ.. మరోవైపు నుంచి గడ్డర్లపై బ్రిడ్జి స్లాబ్ పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించారు.
159 గడ్డర్ల నిర్మాణం పూర్తి
స్పిల్‌వే పియర్స్ అన్నీ 52 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. మిగిలిన ఆరు ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. ఇప్పటివరకు 159 గడ్డర్ల నిర్మాణం పూర్తి కాగా మరో 33 గడ్డర్ల నిర్మాణం ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. 37 గడ్డర్లను స్పిల్‌వే పియర్స్‌పై పెట్టగా మిగతా వాటిని మరో వారం నుంచి పెడతారు. మొత్తం 1,81,269 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. ఇంకా 87,940 క్యూబిక్ మీటర్ల పని ఉంది. స్పిల్‌వే పొడవు 1,050 మీటర్లు కాగా ఇప్పటివరకు 161 మీటర్లు బ్రిడ్జి కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి.
ఈ నెల 25 నుంచి గేట్ల అమరిక
గేట్ల అమరిక ప్రక్రియను అక్టోబర్ 25 నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 48 గేట్ల పనులు పూర్తవుతాయి. స్పిల్ చానల్‌లో రెండు నుంచి మూడు టీఎంసీల వరద నీటిని డిసెంబర్ 15 కల్లా తోడాక కాంక్రీట్ పనిని ప్రారంభిస్తారు. ఇప్పటివరకు 1,12,116 క్యూబిక్ మీటర్ల స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. ఇంకా 5,17,967 క్యూబిక్ మీటర్ల పని ఉంది. స్పిల్ చానల్ మట్టి తవ్వకం పనులు 10,64,417 క్యూబిక్ మీటర్లు పూర్తి కాగా, ఇంకా 33,35,583 క్యూబిక్ మీటర్ల పనులు మిగిలి ఉన్నాయి. ఈ పనులను, ఎగువ కాఫర్ డ్యామ్ పనులను మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సకాలంలో పూర్తి చేస్తాం
పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని సీఎం కార్యాచరణను నిర్దేశించారు. ఈ మేరకు వర్షాలు, వరదల సమయంలో కూడా పనులు సాగుతున్నాయి. స్పిల్ చానల్‌లో చేరిన వరద నీటిని గోదావరిలోకి మళ్లించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నీటిని తోడగానే ఆ పనులు కూడా చేపడతాం.
– నాగిరెడ్డి, ఎస్‌ఈ, పోలవరం.
జూన్ నాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పూర్తి
ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను వచ్చే జూన్ నాటికి పూర్తి చేసి.. తర్వాత ఎర్త్ కమ్ రాక్ ఫిల్‌డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్) పనులు ప్రారంభిస్తారు. జూన్ నుంచి గోదావరి నీటిని స్పిల్‌వే మీదుగా, స్పిల్ చానల్ నుంచి దిగువకు వెళ్లేలా చేయనున్నారు. స్పిల్ చానల్‌లో నిర్మించే బ్రిడ్జికి సంబంధించిన పియర్స్ పనులను త్వరలో చేపడతారు. గ్యాప్–3లో మట్టి తవ్వకం పనులు, కొండరాయి బ్లాస్టింగ్ పనులు పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభమయ్యే కాంక్రీట్ నిర్మాణ పనులను ఫిబ్రవరి నాటికి, పవర్‌హౌస్ మట్టి పనులను జూన్ నాటికి పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment