సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.15,661 కోట్లు అవసరమని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తేల్చింది. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేస్తూ శుక్రవారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి నివేదిక పంపినట్లు సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్విందర్‌సింగ్ వోరా వెల్లడించారు. ఇప్పటికే పోలవరం తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు.
ఇందులో భాగంగా జూన్ 5న కేంద్ర ఆర్థికశాఖ మెమో కూడా జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి అదనంగా 36 గ్రామాలు వస్తాయని తేలింది. ఆ గ్రామాల ప్రజలకు తొలిదశ కిందే పునరావాసం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. ఆ మేరకు సవరించిన ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.
దీంతో తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.17,148 కోట్లు అవసరమంటూ సవరించిన వ్యయ ప్రతిపాదనలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా సీడబ్ల్యూసీకి పంపింది. వాటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ తొలిదశ పూర్తికి రూ.15,661 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టింది.
కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత నిధుల విడుదల..
సీఎం జగన్ చేసిన విజ్ఞప్తి.. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి సూత్రప్రాయంగా కూడా అంగీకరించింది. ఆ గ్రామాల ప్రజలకు పునరవాసం కల్పించడానికి అదనంగా రూ.2,749.85 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది.
మొత్తం రూ.15,661 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు శుక్రవారం సిఫార్సు చేసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆ మేరకు పోలవరానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేయనుంది. దీని ఆధారంగా కేంద్ర కేబినెట్‌కు జల్‌శక్తి, ఆర్థిక శాఖలు ప్రతిపాదన పంపనున్నాయి. దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే పోలవరం తొలిదశ పూర్తికి అవసరమైన నిధులు విడుదలకు మార్గం సుగమం అవుతుంది.
దశల వారీగా పోలవరంలో నీటినిల్వ..
ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాగా.. గరిష్ట నీటినిల్వ 194.6 టీఎంసీలు. కొత్తగా నిరి్మంచే ఏ ప్రాజెక్టులోనైనా సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది దాని పూర్తినిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు.. మరుసటి ఏడాది 2/3వ వంతు, తర్వాత పూర్తిస్థాయిలో నీటినిల్వ చేయాలి. లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంతోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలిఏడాది 41.15 మీటర్లలో, తర్వాత దశల వారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం 45.74 మీటర్లలో నీటినిల్వ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.
కేంద్రాన్ని ఒప్పించిన సీఎం జగన్..
నిజానికి.. కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో 2013–14 ధరల ప్రకారమే పూర్తిచేస్తామని 2016, సెప్టెంబరు 7న నాటి సీఎం చంద్రబాబు అంగీకరించి పనులను దక్కించుకున్నారు. అప్పటి ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.20,398.61 కోట్లు ఇచ్చేందుకు అప్పట్లో కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది.
ఇందులో 2014, ఏప్రిల్ 1 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు మినహాయించి మిగతా అంటే రూ.15,667.91 కోట్లు ఇస్తామని తేల్చింది. 2014, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.14,969.37 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇక రూ.698.54 కోట్లు మాత్రమే మిగిలాయి. కానీ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లు అవసరం.
ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేస్తూ.. 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఖరారు చేసిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేసి, ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ప్రధాని మోదీని కోరారు. ఈ క్రమంలోనే తొలిదశ పూర్తికి అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లు ఇచ్చి.. ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా రైతులకు అందించేందుకు సహకరించాలని సీఎం జగన్ చేసిన వినతిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక శాఖలను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment