ఢిల్లీ: రాజస్థాన్‌లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ జల ఉద్యమాన్ని.. జన ఉద్యమంగా మార్చారని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. గురువారం శ్రీరామ్ రచించిన ‘విలక్షణమైన నీటి నిర్వహణ గాథ’ పుస్తకాన్ని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకవత్‌లు ఆవిష్కరించించారు. ఈ కర్యక్రమంలో మంత్రులు ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి, సంజయ్ దొత్రేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ‘రాజస్థాన్‌లో 99.7 శాతం నీటి సంరక్షణ ప్రాజెక్టు విజయవంతమైంది. నాలుగున్నర అడుగుల మేర నీరు పైకి వచ్చింది. ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెరగాల్సి ఉంది. దేశంలో జల్ క్రాంతి రావాలి. ప్రధానమంత్రి నీటి నిర్వహణపై ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సాంకేతికత ఆధారంగా నీటి నిర్వహణ, సంరక్షణ చేయాలి. వెదిరే శ్రీరామ్ పుస్తకం దేశానికి ప్రేరణగా నిలుస్తుంది. నాడు ఉపవాసం ఉన్న దేశం నేడు సమృద్ధిగా ఆహారదేశంగా మారింద’న్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. శ్రీరామ్ జల ఉద్యమాన్ని జన ఉద్యమంగా మార్చారన్నారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో నీటి వనరులు సృష్టించారని తెలిపారు.
శ్రీరామ్ మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో తాను నిర్వహించిన ముఖ్యమంత్రి జలశక్తి స్వావలంబన ద్వారా ఆరు అడుగుల మేర నీటి నిల్వలు పెరిగాయని తెలిపారు. ఈ పథకం విజయవంతం కావడం వల్ల 50 శాతం నీటి ట్యాంకర్ల అవసరం తగ్గిపోయిందని పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో ఈ పథకం విజయవంతమైందన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణ నదులు తెలుగు రాష్ట్రాలకు జీవధారలుగా ఉన్నాయన్నారు. గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. సముద్రంలోకి గోదావరి వృధాగా పోతోందని.. నల్గొండ ఫ్లోరైడ్ సమస్యతో తల్లడిల్లుతోందని తెలిపారు. కేంద్ర ఐటీ సహాయ మంత్రి సంజయ్ దోత్రే.. ‘జలమే జీవనం, ప్రకృతిని నాశనం చేయడం వల్లే ఈ కరువు కాటకాల పరిస్థితి ఏర్పడింది. వాన నీటి సంరక్షణకు అందరూ నడుం కట్టాలి. నీటి నిర్వహణలో అద్భుతాలను సృష్టించారు. ఇది దేశమంతటికీ ఒక మోడల్‌గా నిలుస్తుంద’న్నారు. కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ .. ‘ దేశానికి వెదిరే శ్రీరామ్ వంటి వారు అవసరం.. ఆయన చేసిన కార్యక్రమానికి అధికారులు సైతం అభినందించాలి. సుమారు 50వేల కోట్ల రూపాయలతో నీటి సంరక్షణ అడవులు పెంపకానికి కేటాయించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment