
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారని ఆంధ‍్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కలిసి మంగళవారం ఆయన కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ‘రివర్స్ టెండరింగ్‌పై కేంద్ర మంత్రి సంతృప్తి చెందారు. పోలవరం ప్రాజెక్టులో కేంద్రానికి రూ.800 కోట్లు ఆదా చేశామని వివరించాను. పార్లమెంటు సమావేశాల తర్వాత పోలవరం సందర్శనకు వస్తానని షెకావత్ చెప్పారు.
పోలవరానికి సంబంధించి రూ.1850 కోట్లు రెండు మూడు రోజుల్లో విడుదలౌతాయి. మిగిలిన నిధులకు సంబంధించి ఆడిటింగ్ కూడా పూర్తయింది . రూ. 55 వేల కోట్ల ప్రాజెక్టులో 11 వేల కోట్ల రూపాయలు పనులు మాత్రమే టీడీపీ పూర్తి చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే కుడి, ఎడమ కాలువల పనులు పూర్తయ్యాయి. పోలవరం పనులు 35 శాతం మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యాయి. 2021 కల్లా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’అని అనిల్‌కుమార్ అన్నారు.