Gandikota Reservoir
-
అవుకు రిజర్వాయర్ వద్ద రెండో టన్నెల్ రెడీ
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం వరద కాలువలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగం(టన్నెల్)లో మిగిలిన పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. దాంతో ప్రస్తుత డిజైన్ మేరకు వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి లైన్ క్లియర్ అయ్యింది. శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గాలేరు–నగరి వరద కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్‌ను నింపడానికి మార్గం సుగమమైంది. ఇది దుర్భిక్ష రాయలసీమలో సాగునీటి సౌకర్యాలను మరింత మెరుగు పరచడానికి దోహదం చేస్తుందని నీటి పారుదల రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి.. ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగు నీరు, 640 గ్రామాల్లోని 20 లక్షల మందికి తాగు నీరు అందించాలనే లక్ష్యంతో 2005లో నాటి సీఎం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీల పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా 5.7 కి.మీల పొడవున సొరంగం (అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో ఒక్కొక్కటి 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు సొరంగాలు) తవ్వకం పనులు చేపట్టారు. మహానేత హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో అధిక శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేయలేని టీడీపీ సర్కార్ అవుకు సొరంగాలలో ఒక్కో సొరంగంలో 165 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్ (మట్టి పొరలు పెలుసుగా ఉండటం వల్ల కూలిపోవడం)లో పనులు చేయాలి. వాటిని చేయలేని టీడీపీ సర్కార్.. ఒక సొరంగంలో 165 మీటర్ల పొడవున సొరంగానికి ప్రత్యామ్నాయంగా కాలువ తవ్వి.. దాన్ని వరద కాలువతో అనుసంధానం చేసింది. దీని వల్ల పది వేల క్యూసెక్కులను మాత్రమే తరలించవచ్చు. గండికోట రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించక పోవడం వల్ల 26.85 టీఎంసీలకుగాను నాలుగైదు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కార్ నిల్వ చేయగలిగింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోనూ నిర్వాసితులకు పునరవాసం కల్పించపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ 4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగింది. పైడిపాలెం రిజర్వాయర్‌లో 6 టీఎంసీలకుగానూ ఒక టీఎంసీ నిల్వ చేసింది. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు ఏర్పడిన లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేసేవారు. పూర్తయిన అవుకు సొరంగాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తున్న ఈఎన్సీ సి.నారాయణరెడ్డి రాయలసీమ సస్యశ్యామలమే లక్ష్యంగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక గాలేరు–నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్లో మిగిలిన పనులను పూర్తి చేయడంతోపాటు గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడాన్ని, బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలకు అడ్డుకట్ట వేసే పనులను ప్రాధాన్యతగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సుమారు రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా గండికోట రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వ చేశారు. రూ.250 కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పది టీఎంసీలకుగాను పది టీఎంసీలు, పైడిపాలెం రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 6 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ఆయకట్టుకు పూర్తి స్తాయిలో నీటిని అందిస్తున్నారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీలు ఉన్న ప్రాంతంలో రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ వేసి.. వాటికి అడ్డుకట్ట వేశారు. తద్వారా 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. మరో అడుగు ముందుకు.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో రెండో సొరంగం(టన్నెల్)లో ఫాల్ట్ జోన్(కూలిన ప్రాంతం)లో 160 మీటర్ల తవ్వకం పనులను అధికారులు అత్యంత ప్రాధాన్యతగా చేపట్టారు. అత్యాధునిక పోలింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో పాలీయురిథేన్ యురెథేన్ ఫోమ్ గ్రౌటింగ్ చేస్తూ ఫాల్ట్ జోన్లో సొరంగం తవ్వకం పనులను రెండ్రోజుల క్రితం పూర్తి చేశారు. ఫాల్ట్ జోన్లో సొరంగానికి 165 మీటర్ల మేర సిమెంట్ కాంక్రీట్‌తో లైనింగ్ చేయాల్సి ఉండగా ఇప్పటికే 134 మీటర్లు పూర్తి చేశారు. నెలాఖరుకు మిగతా 131 మీటర్ల లైనింగ్ పనులు పూర్తవుతాయి. ఇప్పటికే పూర్తయిన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులకు తోడుగా ప్రస్తుతం పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి సుజల స్రవంతి వరద కాలువ ద్వారా తరలించడానికి మార్గం సుగమం చేశారు. ఇది ఆయకట్టుకు మరింత మెరుగ్గా నీళ్లందించడానికి దోహదం చేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సుసాధ్యం చేశాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అవుకు రెండో సొరంగంలో ఫాల్ట్ జోన్లో 160 మీటర్ల తవ్వకం పనులు పూర్తి చేయడాన్ని సవాల్‌గా తీసుకున్నాం. హిమాలయాల్లో సొరంగాలు తవ్వే నిపుణులను రప్పించి.. అత్యాధునిక సాంకేతిక పరి/ê్ఞనంతో సొరంగాన్ని పూర్తి చేయించాం. దాంతో ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి కాలువ ద్వారా తరలించవచ్చు. ఆయకట్టుకు నీళ్లందించవచ్చు. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి జలవనరుల శాఖ సామర్థ్యం పెంచే పనుల్లో వేగం పెంచాం అసాధ్యమనుకున్న అవుకు రెండో టన్నెల్ తవ్వకం పనులు పూర్తి చేశాం. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గాలేరు–నగరి కాలువ సామర్థ్యం 30 వేల క్యూసెక్కులకు పెంచడంలో భాగంగా అవుకు వద్ద మూడో టన్నెల్ తవ్వకం పనులు చేపట్టాం. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తాం. అప్పుడు గాలేరు–నగరి ద్వారా 30 వేల క్యూసెక్కులు తరలించవచ్చు. శ్రీశైలానికి వరద వచ్చే పది రోజుల్లోనే గండికోట రిజర్వాయర్‌ను నింపి, ఆయకట్టుకు నీళ్లందివచ్చు. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్, జల వనరుల శాఖ -
‘గండికోట’ ఫుల్
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంతోపాటు దూరదృష్టితో వ్యవహరిస్తుండటంతో సామాజిక ప్రయోజనాలు కూడా చేకూరుతున్నాయి. నిర్వాసితులకు పునరావాసం పనులను వేగంగా పూర్తి చేసి వరద నీటిని ఒడిసిపట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరుగుతోంది. వరద నీటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రాజెక్టులను గరిష్ట స్థాయిలో నింపడం ద్వారా ఆ ఫలాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజం మొత్తానికి అందుతున్నాయి. తక్కువ లోతులోనే నీరు సమృద్ధిగా లభిస్తుండటంతో తాగు, సాగునీటి అవసరాలకు ఎక్కడా ఇబ్బందులు ఎదురు కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడం, భూగర్భ జలాలు పెరగడంతో వాతావరణ మార్పులు భారీ స్థాయిలో లేకుండా ఉష్ణోగ్రతలు కూడా అదుపులో ఉండే అవకాశం ఉంది. ఆయకట్టుకు పుష్కలంగా నీరందిస్తూ పొలాలను సస్యశ్యామలం చేయడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పునరావాస కల్పనలో గత సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో ఏటా వందల టీఎంసీల వరద జలాలు వృథాగా సముద్రంలో కలిశాయి. గండికోట జలాశయంలో 26.85 టీఎంసీలు నిల్వ గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన గండికోట జలాశయంలో తొలిసారిగా పూర్తి సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను మంగళవారం నిల్వ చేశారు. జలాశయం నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తి సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదే కాకుండా గాలేరు–నగరిలో అంతర్భాగమైన పైడిపాళెం, సర్వారాయసాగర్, వామికొండసాగర్ ప్రాజెక్టుల్లోనూ ఈ ఏడాదే గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేశారు. సీబీఆర్(చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లో పూర్తి సామర్థం మేరకు పది టీఎంసీలు నిల్వ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పులిచింతల ప్రాజెక్టు, సోమశిల రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు నిల్వ చేయడం తెలిసిందే. గతంలో 3 టీఎంసీలే నిల్వ.. గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా 2012 నుంచి 2019 వరకు గరిష్టంగా మూడు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల నీటిని నిల్వ చేయలేకపోయారు. 2014 నుంచి 2019 వరకు గండికోట నిర్వాసితుల పునరావాసం కోసం ఐదేళ్లలో రూ.146.29 కోట్లను మాత్రమే టీడీపీ సర్కార్ ఖర్చు చేయడం గమనార్హం. చిత్రావతి, వామికొండ, పైడిపాళెం, పులిచింతల, సోమశిల, కండలేరు నిర్వాసితుల పునరావాసానికి కూడా గత సర్కార్ పైసా వ్యయం చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గండికోట నిర్వాసితుల పునరావాసానికి రూ.522.85 కోట్లను జూన్ 24న విడుదల చేసింది. పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, భూసేకరణకు రూ.403.2 కోట్లను మంజూరు చేసింది. వెరసి రూ.926.05 కోట్లను వ్యయం చేసి 17,809 మంది నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించింది. దీంతో గండికోటలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగారు. ఇక గాలేరు–నగరిలో అంతర్భాగమైన వామికొండసాగర్లో 1.60, సర్వారాయసాగర్‌లో 3.06, పైడిపాళెంలో ఆరు టీఎంసీలకుగానూ 5.84 టీఎంసీలను నిల్వ చేశారు. రూ.240.53 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో జలాశయం పూర్తయిన తర్వాత తొలిసారిగా ఈ ఏడాదే పూర్తి సామర్థ్యం మేరకు పది టీఎంసీలను నిల్వ చేశారు. పులిచింతలతో శ్రీకారం.. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ సర్కార్‌తో చర్చించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరావాసం నిధులను విడుదల చేసి పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత తొలిసారిగా గతేడాది 45.77 టీఎంసీలు నిల్వ చేశారు. ఈ ఏడాదీ అదే రీతిలో నీటిని నిల్వ చేశారు. దీనివల్ల కృష్ణా డెల్టాలో పంటల సాగుకు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటికి ఇబ్బందులు తొలిగాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా దశాబ్దాల క్రితం పూర్తయిన సోమశిల రిజర్వాయర్‌లో గతేడాది పూర్తి సామర్థ్యం మేరకు 78 టీఎంసీలు నిల్వ చేశారు. ఈ ఏడాదీ అదే రీతిలో నిల్వ చేశారు. దీంతో పెన్నా డెల్టా, తెలుగుగంగ ఆయకట్టులో పంటల సాగుకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటికి ఇబ్బందులు తొలగిపోయాయి. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి బంజరు భూములకు నీళ్లందించడం ద్వారా కరువును తరిమికొట్టేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో జలయఙ్ఞం చేపట్టారు. 84 ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టి పలు ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఆయన హఠాన్మరణం తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల్లోనూ నీటిని నింపలేని దుస్థితి నెలకొంది. కమీషన్లు రాకపోవడంతో గత సర్కారు పునరావాసం పనులను నిర్లక్ష్యం చేసింది. దీంతో గతంలో ఏటా వందలాది టీఎంసీల వరద జలాలు సముద్రంలో వృథాగా కలిశాయి. కండలేరులో గరిష్టంగా నిల్వ చేసేలా.. కండలేరు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 68.03 టీఎంసీలు. గత ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. కండలేరు నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారిగా 60 టీఎంసీలను నిల్వ చేసింది. వచ్చే సీజన్ నాటికి నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా 68.03 టీఎంసీలను నిల్వ చేసే దిశగా అడుగులు వేస్తోంది. -
ప్రజాహితం కావవి.. ప్రచారం కోసం వేసే వ్యాజ్యాలు
సాక్షి, అమరావతి: ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్లు) ప్రచార ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోతున్నాయని హైకోర్టు సోమవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. పత్రికల్లో వచ్చే కథనాల క్లిప్పింగులను జత చేసి, వాటి ఆధారంగా పిటిషన్లు వేస్తూ.. వాటినే పిల్లంటున్నారని తెలిపింది. ఇలా ఓ పిల్ దాఖలు చేసి, మరుసటి రోజు పత్రికల్లో పెద్దవిగా రాయించుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటిని తాము రోజూ చూస్తున్నామంది. హైకోర్టు ఉన్నది ఇలాంటి వ్యాజ్యాలను విచారించేందుకు కాదని తేల్చిచెప్పింది. ► గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన హైకోర్టు.. ఓసారి పరిహారం తీసుకున్నాక గ్రామాలను ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ► పరిహారం తీసుకుని కూడా గ్రామాలను ఖాళీ చేయబోమంటే దాని అర్థమేంటని ప్రశ్నించింది. ► 2011లోనే నిర్వాసితులకు పరిహారం చెల్లించామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఆ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ► తదుపరి విచారణను అక్టోబర్ 7కి వాయిదా వేసింది. ► ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ► గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ నేత బొల్లిశెట్టి సత్యనారాయణ, మరికొందరు పిల్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ► సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి, మరికొందరు ప్రభుత్వ న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ.. 90 శాతానికి పైగా పిల్లు కేవలం ప్రచార ప్రయోజన వ్యాజ్యాలేనని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ► 2011లోనే పరిహారం చెల్లించామని, దీన్ని తీసుకున్న వ్యక్తులు సైతం ఆ తర్వాత పునరావాస కేంద్రాల వద్ద సిమెంట్ రోడ్డు కోసం దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని జగన్మోహన్రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ► పిటిషనర్ తరఫు న్యాయవాది చల్లా అజయ్‌కుమార్.. తాము పత్రికా కథనాల ఆధారంగా పిల్ వేయలేదన్నారు. ► దీనికి న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పందిస్తూ.. ‘ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లు పత్రికల్లో కథనం వచ్చింది. ఓ పత్రికలో స్వయంగా చదివాను’ అని స్పష్టం చేయడంతో అజయ్‌కుమార్ మౌనం వహించారు. ► ఈ సమయంలో సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఈ పిల్ల్లో ‘ఇంటర్వీనర్స్’గా చేరాలని భావిస్తున్నామని తెలిపారు. ► ఈ వ్యాజ్యాలను వ్యతిరేకిస్తూనా? సమర్థిస్తూనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ► సమర్థిస్తున్నామని వీరారెడ్డి చెప్పగా.. అయితే ఇంటర్వీనర్గా చేరే బదులు వేరే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని, సాధారణంగా ఇంటర్వీనర్స్గా చేరే వ్యక్తులు పిటిషన్లను వ్యతిరేకిస్తారని ధర్మాసనం తెలిపింది. -
గండికోట పరిహారంపై అన్ని వ్యాజ్యాలను కలిపి విచారిస్తాం
సాక్షి, అమరావతి: గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదంటూ ఓ రాజకీయ నాయకుడు దాఖలు చేసిన వ్యాజ్యం ఓ వైపు.. ప్రభుత్వం పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిందని, ఇక్కడ సీసీ రోడ్లకు బదులు మట్టి రోడ్లు వేస్తున్నారంటూ పరిహారం తీసుకున్న వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యం మరో వైపు ఉండటంతో ఈ రెండిటిని కలిపి విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. పరిహారం విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి, రెండు రోజుల పాటు గండికోట రిజర్వాయర్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసి, అక్కడి ప్రజల ప్రాణాల రక్షణ కోసం చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సూచనలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదికి ధర్మాసనం స్పష్టం చేసింది. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు బొల్లిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొందరు కూడా పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్ రాకేశ్ ధర్మాసనం విచారణ జరిపింది. -
బాబు వర్షాలు పడకూడదని కోరుకుంటారు
సాక్షి, తాడేపల్లి: అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట. గండికోట ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశారన్నారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఐదేళ్లలో చంద్రబాబు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద రిలీజ్ చేసింది ఎంత. చంద్రబాబు గండికోటకు ఈ ప్యాకేజ్ కింద నిధులు విడుదల చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చంద్రబాబు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం వల్లనే 26 టీఎంసీల నీటిని నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గండికోటకు 972 కోట్ల రూపాయలు ప్రకటించారు. వాటిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద 676 కోట్లు విడుదల చేశారు. మిగతా 296 కోట్ల రూపాయలను త్వరలో విడుదల చేస్తాము. గండికోట గురించి మాట్లాడడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి. సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుందని చంద్రబాబు కొంతమందిని రెచ్చగొడుతున్నారు’ అని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: మహిళలకు మరో ‘రత్నం’) ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన తిప్పి కొడతాము. రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయాలని రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రవేశ పెడుతున్నారు. ఉత్తరాంధ్ర సృజల స్రవంతిని త్వరలో పూర్తి చేస్తాము. పల్నాడులో 1500 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తున్నాము. కృష్ణ నది ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు బ్యారేజీలు నిర్మిస్తున్నాము. వర్షాలు పడకూడదని దేవుడుని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాయలసీమకు సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి పని చేస్తుంటే ఆయన ఓర్వలేకపోతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వర్షాలు పుష్కలంగా పడ్డాయి. 81 శాతం రిజార్వయర్లు నిండాయి. చంద్రబాబు విజయవాడకు చుట్టపు చూపుగా వస్తున్నారు. ఆరు నెలల్లో చంద్రబాబు పట్టుమని పది రోజులు కూడా అమరావతిలో ఉండలేదు. 2 లక్షల 70 కోట్ల అప్పు చేసింది చంద్రబాబు నాయుడు.70 వేల బిల్లులు పెండింగ్ లో చంద్రబాబు పెట్టారు. చంద్రబాబు పెట్టిన బకాయిలు మేము చెల్లిస్తున్నాము’ అని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. -
నేడు పెన్నాకు నీరు విడుదల
సాక్షి, జమ్మలమడుగు(కడప) : మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి రెండు టీఎంసీల నీరు విడుదల చేయడం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రెండున్నర టీఎంసీల పైన నీరు ఉండగా, మంగళవారం రాత్రికి మూడు టీఎంసీలకు చేరుకుంటుంది. ముందుగా గండికోట జలాశయం నుంచి మైలవరంలోకి ఇరిగేషన్ అధికారులు కేవలం 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. తర్వాత 1500 క్యూసెక్కులు విడుదల చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సెప్టెంబర్ 1 నుంచి మైలవరం గేట్లు ఎత్తి పెన్నానదిలోకి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అధికారులు ఆ స్థాయిలో గండికోట నుంచి మైలవరం జలాశయంలోకి నీరు విడుదల చేయలేదు. ఇరిగేషన్ అధికారులు తమపై పక్షపాతం చూపుతున్నారని రెండు రోజుల్లో మైలవరం నుంచి పెన్నానదిలోకి విడుదల చేయకపోతే ఇరిగేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులు రోజుకు 1500 క్యూసెక్కుల వచ్చే నీటిని 5000 క్యూసెక్కులకు పెంచేశారు. నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. రెండు గేట్ల ద్వారా.. మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి రెండు టీఎంసీల నీటిని విడుదల చేయబోతున్నారు. రెండు గేట్ల ద్వారా ప్రతిరోజు 1000 క్యూసెక్కుల నీటిని పెన్నానదిలో నీటిని విడుదల చేసి భూగర్భజలాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుంది. అంతే కాకుండా జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లోని గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగి తాగునీటితో పాటు రైతుల బోర్లకు నీరు అందే అవకాశం ఉంది. 6.5 టీఎంసీల నిల్వకు ప్రయత్నాలు.. మైలవరం రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు రైతులకు, తాగునీరు, ఆర్టీపీపీలకు నీరు అందించే విధంగా జలాశయంలో దాదాపు 6.5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే విధంగా అధికారులు సిద్ధమవుతున్నారు. మైలవరం జలాశయం మొత్తం సామర్థ్యం 9.5 టీఎంసీలు అయితే ప్రస్తుతం 6.5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నీటిని విడుదల చేయనున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. మైలవరం జలాశయం నుంచి బుధవారం ఉద యం పది గంటలకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రమే విడుదల చేయాల్సి ఉన్నా పూర్తి స్థాయిలో నీరు వచ్చి చేరకపోవడంతో కార్యక్రమాన్ని బుధవారం ఉదయానికి వాయిదా వేశా రు. నీటి విడుదలకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి హాజరవుతున్నట్లు సమాచారం. ఇబ్బందులు లేకుండా చర్యలు.. మైలవరం జలాశయం నుంచి రెండు టీఎంసీల నీటిని పెన్నానదిలోకి వదలి భూగర్భజలాలు పెరిగి భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బుధవారం ఉదయం మైలవరం జలాశయం గేట్లను ఎత్తి పెన్నానదిలోకి విడుదల చేయబోతున్నాం. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు వస్తున్నారు. – గౌతమ్‌రెడ్డి, మైలవరం ఇరిగేషన్ ఏఈ -
కడపకు నీళ్లొచ్చేశాయ్
సాక్షి, కడప : జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నా.. కృష్ణా జలాలను యుద్ధప్రాతిపదికన జిల్లాకు తరలించి వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచింది. ఇప్పటికే కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు చేరగా, తాజాగా కర్నూలు జిల్లాలోని అవుకు నుంచి గండికోటకు సైతం ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించింది. ఆదివారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గండికోట పరిధిలోని నీటి వనరులకు జలాన్ని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు తక్షణమే తెలుగుగంగ, కేసీ కెనాల్తోపాటు గండికోట ప్రాజెక్టు పరిధిలోని నీటి వనరులకు కృష్ణా జలాలు విడుదల చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే స్పందించిన జగన్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, బానకచర్ల మీదుగా జిల్లాకు నీటిని విడుదల చేసింది. ఆదివారం నాటికి గండికోటలో ఐదు టీఎంసీలు చేరాయి. దీంతో దిగువనున్న నీటి వనరులకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 500 క్యూసెక్కులు, మైలవరానికి 500, సర్వరాయసాగర్‌కు 500, పైడిపాలెంకు 200 క్యూసెక్కుల చొప్పున తొలిరోజు ప్రజాప్రతినిధులు నీటిని విడుదల చేశారు. సోమవారం సర్వరాయసాగర్‌కు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి 200 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం గండికోటకు పది వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఇన్‌ఫ్లో మరికొంత పెరగనుందని గాలేరు–నగరి ఎస్ఈ మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గండికోట పరిధిలోని మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. అన్నదాతలను ఆదుకుంటాం ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడటంతో శ్రీశైలం జలాశయంలో నీళ్లు నిల్వ ఉన్నాయి. దీంతో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను నీటితో నింపి రైతులకు మేలుచేసే కార్యక్రమం చేపట్టినట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గండికోట ప్రాజెక్టు వద్ద రెండు గేట్లు ఎత్తి మైలవరానికి, గండికోట ఎత్తిపోతల పథకం స్టేజ్–1 ద్వారా పైడిపాళెంకు, స్టేజి–2 ద్వారా చిత్రవతి బ్యాలెన్స్ రిజర్వాయర్‌కు మోటర్లు ఆన్ చేసి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జీఎన్ఎస్ఎస్ ఎస్ఈ మధుసూదన్‌రెడ్డి, ఈఈ రామంజినేయులు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలనే సంకల్పంతో నాడు గండికోట ప్రాజెక్టును నిర్మించిన మహనీయుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో గండికోట ప్రాజెక్టు ద్వారా మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి విడుదల చేసి ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల్లోని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని చెప్పారు. జిల్లాలోని వామికొండ, సర్వారాయసాగర్, చిత్రావతి బ్యాలెన్స్రిజర్వాయర్, మైలవరం ప్రాజెక్టుల్లో నీటిని నింపుతామన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మంసాగర్‌లో 10 టీఎంసీల నీళ్లు నిల్వ చేశారు. ఈ ఏడాది 12 టీఎంసీలు నిల్వ చేసి చరిత్ర తిరగరాస్తామని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ముంపు గ్రామాల సమస్యలు పరిస్కారం కాలేదని అన్నారు. ముంపు గ్రామాల్లోని తాళ్లప్రొద్దుటూరు, యర్రగుడి, చామలూరు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలించేదాకా ఇబ్బందుకు గురిచేయమన్నారు. పేజ్–2 గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాట చేస్తామని చెప్పారు. ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దండ్లాగు శంకర్‌రెడ్డి, ముద్దనూరు మునిరాజారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నిరంజన్‌రెడ్డి, కొండాపురం సింగిల్‌విండో అధ్యక్షుడు కొండువాసుదేవారెడ్డి, కొండాపురం నీలకంఠారెడ్డి,రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎల్. రామమునిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. హరినారాయణరెడ్డి,జిల్లా కార్యదర్శి ఎస్ చిన్నఅంకిరెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌భాషా,రామసుబ్బారెడ్డి, మండల యూత్ కన్వీనర్ లక్ష్మికాంత్‌రెడ్డి, గండ్లూరు బాలనాగిరెడ్డి, రామం జి, పెద్దిరెడ్డి, రమేష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు సర్వరాయసాగర్‌కు నీరు విడుదల
కమలాపురం: వైఎస్సార్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి సర్వరాయసాగర్‌కు ఎట్టకేలకు నీటిని విడుదల చేశారు. 150 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. గండికోట నుంచి సర్వరాయసాగర్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టిన విషయం విదితమే. ఆయన డిమాండ్‌కు స్పందించిన కలెక్టర్ గండికోట నుంచి సర్వరాయసాగర్‌కు నీటిని విడుదల చేయించారు. -
ఎన్నాళ్లు.. ఎన్నేళ్లు..
ముద్దనూరు/కొండాపురం : గండికోట రిజర్వాయరు నిర్మాణంలో భాగంగా ముద్దనూరు, కొండాపురం మండలాల్లో మొత్తం 22 గ్రామాలతో పాటు,సుమారు 30 కిలోమీటర్ల రాష్ట్ర రహదారి ముంపునకు గురవుతోంది. ముద్దనూరు మండలంలోని కమ్మవారిపల్లె సమీపం నుంచి కొండాపురం మండలంలోని సుగుమంచిపల్లె వరకు పాత రహదారి ముంపునకు గురవుతుండడంతో దీనికి ప్రత్యమ్నాయంగా దాదాపు 9 ఏళ్ల క్రితమే డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది.అయితే పనులు నత్తనడకన సాగుతున్నాయి.ముఖ్యమంత్రులు మారడం, పాత టెండర్లను రద్దుచేయడం, కొత్త టెండర్లలో అంచనాలు పెరగడం తప్ప రహదారి నిర్మాణం మత్రం పూర్తికాలేదు. రూ. 40 నుంచిరూ.100కోట్లకు చేరిన రోడ్డు నిర్మాణ వ్యయం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సుమారు రూ.45కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి అనుమతి లభించింది.వైఎస్సార్ మరణానంతరం పనులు నిలిచిపోయాయి..మరో రెండు మార్లు టెండర్ల ప్రక్రియ వరకు వచ్చి ఆగిపోయింది.తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం సుమారు రూ.100 కోట్ల పైచిలుకు వ్యయంతో రహదారి నిర్మాణం మొదలుపెట్టారు.అధికార పార్టీ అనుయాయులకే పనులు దక్కాయి. రహదారి నిర్మాణ వ్యయం రెట్టింపయినప్పటికీ,ఇప్పటికే రెండు మార్లు గడువు పెంచారు. గండికోటలోకి నీరొస్తే అవస్థలే: గండికోట ప్రాజెక్టులో సుమారు 5 టీఎంసీల నీరు నిల్వ చేస్తే ప్రస్తుతం ఉన్న కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో వాహనాలను ముద్దనూరు నుంచి మరో మార్గం ద్వారా మళ్లించాల్సిందే.గత ఏడాది కూడా ప్రాజెక్టులో నీరు చేరడంతో వాహనాలను మళ్లించారు.అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో 4 టీఎంసీలు చేరగానే కొండాపురానికి సమీపంలోని చిత్రావతి బ్రిడ్జికి నీరు చేరువకావడంతో పాటు వంతెన కూడా ప్రమాదకరంగా తయారైంది.ఈ నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ముద్దనూరు నుంచి తాడిపత్రి, అనంతపురం పట్టణాలకు వెళ్లే వాహనాలను జమ్మలమడుగు,మల్లేల మీదుగా తిప్పుతున్నారు. దీనివల్ల కొండాపురం మండల ప్రజలు ప్రయాణానికి తవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తాళ్లప్రొద్దుటూరు, దత్తాపురం, గంగాపురం, చౌటిపల్లె పల్లె గ్రామాల ప్రజలు వ్యవప్రయాసలకు గురవుతున్నారు. ఇది ఇలా ఉండగా మళ్లీ రహదారి నిర్మాణానికి మరోమారు గడువు పెంపు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.ఈ మార్గంలో ఇప్పటికే సుమారు 90 శాతం మేర కల్వర్టుల నిర్మాణం పూర్తయినట్లు, రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి పూర్తయితే రహదారిని త్వరగా నిర్మిస్తామని జీఎన్ఎస్ఎస్ ఈఈ మధుసూధన్‌రెడ్డి తెలిపారు. -
ట్రిబ్యునల్ తీర్పుకు నిరసనగా విజయమ్మ దీక్షలు
కడప : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రేపు, ఎల్లుండి దీక్షలు చేపట్టనున్నారు. పులిచింతల ప్రాజెక్ట్ వద్ద బుధవారం విజయమ్మ దీక్షకు చేయనున్నట్లు కృష్ణాజిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. ఈ దీక్షకు కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు భారీగా తరలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. మరోవైపు విజయమ్మ ఎల్లుండి వైఎస్ఆర్ జిల్లాలోని గండికోట ప్రాజెక్ట్ సమీపంలో దీక్ష చేపట్టనున్నట్లు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. మిగులు జలాలు రాకుంటే రాయలసీమ ఎడారేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా కన్వీనర్ సురేష్ బాబు, పార్టీ నేత శంకర్ రెడ్డి పాల్గొన్నారు. -
నెరవేరిన వైఎస్ఆర్ కల
కడప(వైఎస్ఆర్ జిల్లా): గండికోట రిజర్వాయర్‌కు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గండికోట రిజర్వాయర్ పనులు ప్రారంభమయ్యాయి. ఎనిమిది మండలాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు కొండాపురం మండలం గండికోటలో ఈ రక్షిత మంచీనీటి పథకం(గండికోట రిజర్వాయర్)ను నిర్మించారు. నీటిని విడుదల చేసిన సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ నీటి విడుదలతో వైఎస్ఆర్ కల నెరవేరిందన్నారు. ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పారు.