ప్రజాహితం కావవి.. ప్రచారం కోసం వేసే వ్యాజ్యాలు | AP High Court Comments On Public interest litigations | Sakshi
Sakshi News home page

ప్రజాహితం కావవి.. ప్రచారం కోసం వేసే వ్యాజ్యాలు

Published Tue, Sep 29 2020 4:40 AM | Last Updated on Tue, Sep 29 2020 4:40 AM

AP High Court Comments On Public interest litigations - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌లు) ప్రచార ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోతున్నాయని హైకోర్టు సోమవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. పత్రికల్లో వచ్చే కథనాల క్లిప్పింగులను జత చేసి, వాటి ఆధారంగా పిటిషన్‌లు వేస్తూ.. వాటినే పిల్‌లంటున్నారని తెలిపింది. ఇలా ఓ పిల్‌ దాఖలు చేసి, మరుసటి రోజు పత్రికల్లో పెద్దవిగా రాయించుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటిని తాము రోజూ చూస్తున్నామంది. హైకోర్టు ఉన్నది ఇలాంటి వ్యాజ్యాలను విచారించేందుకు కాదని తేల్చిచెప్పింది.
 
► గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన హైకోర్టు.. ఓసారి పరిహారం తీసుకున్నాక గ్రామాలను ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
► పరిహారం తీసుకుని కూడా గ్రామాలను ఖాళీ చేయబోమంటే దాని అర్థమేంటని ప్రశ్నించింది. 
► 2011లోనే నిర్వాసితులకు పరిహారం చెల్లించామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఆ వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
► తదుపరి విచారణను అక్టోబర్‌ 7కి వాయిదా వేసింది. 
► ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 
► గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ నేత బొల్లిశెట్టి సత్యనారాయణ, మరికొందరు పిల్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 
► సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి, మరికొందరు ప్రభుత్వ న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ.. 90 శాతానికి పైగా పిల్‌లు కేవలం ప్రచార ప్రయోజన వ్యాజ్యాలేనని హైకోర్టు దృష్టికి తెచ్చారు. 
► 2011లోనే పరిహారం చెల్లించామని, దీన్ని తీసుకున్న వ్యక్తులు సైతం ఆ తర్వాత పునరావాస కేంద్రాల వద్ద సిమెంట్‌ రోడ్డు కోసం దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని జగన్‌మోహన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 
► పిటిషనర్‌ తరఫు న్యాయవాది చల్లా అజయ్‌కుమార్‌.. తాము పత్రికా కథనాల ఆధారంగా పిల్‌ వేయలేదన్నారు. 
► దీనికి న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ స్పందిస్తూ.. ‘ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లు పత్రికల్లో కథనం వచ్చింది. ఓ పత్రికలో స్వయంగా చదివాను’ అని స్పష్టం చేయడంతో అజయ్‌కుమార్‌ మౌనం వహించారు. 
► ఈ సమయంలో సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఈ పిల్‌ల్లో ‘ఇంటర్వీనర్స్‌’గా చేరాలని భావిస్తున్నామని తెలిపారు. 
► ఈ వ్యాజ్యాలను వ్యతిరేకిస్తూనా? సమర్థిస్తూనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. 
► సమర్థిస్తున్నామని వీరారెడ్డి చెప్పగా.. అయితే ఇంటర్వీనర్‌గా చేరే బదులు వేరే పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చునని, సాధారణంగా ఇంటర్వీనర్స్‌గా చేరే వ్యక్తులు పిటిషన్లను వ్యతిరేకిస్తారని ధర్మాసనం తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement