
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఐని ఆదేశిస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ బి.కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సలాం కుటుంబం ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ (ఐయూఎంఎల్‌పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే.
పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు చేయడం లేదన్నారు. అందువల్ల సీబీఐ దర్యాప్తునకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, తమ జోక్యం అవసరంలేదని స్పష్టంచేసింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఇటీవల పోలీసులపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని ఆక్షేపించారు.
సీబీఐకి హైకోర్టులో న్యాయవాది లేకపోతే ఎలా?
సీబీఐ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు పూర్తిస్థాయి న్యాయవాది(స్టాండింగ్ కౌన్సిల్) లేకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని వెంటనే సీబీఐ డైరెక్టర్‌కు, కేంద్ర న్యాయ శాఖకు తెలియచేయాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్‌కు సూచించింది. సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కౌంటర్ దాఖలుకు సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెన్నకేశవులు మూడు వారాల గడువు కోరడంతో ఏ హోదాలో హాజరవుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టులో ప్రత్యేకంగా స్టాండింగ్ కౌన్సిల్ ఉండాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరు కావడానికి వీల్లేదని పేర్కొంది.