
సాక్షి, అమరావతి: విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ప్రతీ దానికీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడమేనా? అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వులపై అభ్యంతరముంటే బాధిత వ్యక్తులు కోర్టుకు వస్తారని.. వారికిలేని అభ్యంతరం మీకెందుకని రామకృష్ణ బాబును హైకోర్టు నిలదీసింది. బాధితులు కోర్టుకు రాకుండా మీరెందుకొచ్చారని అడిగింది. ప్రభుత్వ చర్యలు, ఉత్తర్వులపై అభ్యంతరముంటే వాటిని అసెంబ్లీలో ప్రస్తావించుకోవాలని ఆయనకు స్పష్టంచేసింది.
చదవండి: ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. రెండు, మూడు రోజుల్లో..
ప్రతీ వ్యవహారంలో పిల్ దాఖలు చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పింది. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ విషయంలో సర్కారు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆయన దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజుల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఆక్రమణలో ఉన్న అభ్యంతరంలేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు 2017లో జారీచేసిన జీఓ–388ని ప్రభుత్వం అమలుచేయడంలేదని, దీని ప్రకారం భూములను క్రమబద్ధీకరించేందుకు లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తులను అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రామకృష్ణబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్. ప్రణతి వాదనలు వినిపిస్తూ.. 2017లో జారీచేసిన జీఓ ప్రకారం ఎంతోమంది తమ స్వాధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని.. ఇలాంటి వారు లక్షల్లో ఉన్నారని తెలిపారు.
అయితే.. ఈ జీఓను అమలుచేయకుండా ప్రభుత్వం కొత్త జీఓ జారీచేసి భూములను క్రమబద్ధీకరిస్తోందని, దీనివల్ల గతంలో దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ చర్యలు ఇబ్బందిగా ఉంటే బాధితులు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించింది. బాధితులకు లేని ఇబ్బంది పిటిషనర్‌కు ఎందుకని నిలదీసింది. ప్రతీ దానికి ఇలా పిల్ దాఖలు చేయడమేనా? అంటూ అసహనం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment