సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంతోపాటు దూరదృష్టితో వ్యవహరిస్తుండటంతో సామాజిక ప్రయోజనాలు కూడా చేకూరుతున్నాయి. నిర్వాసితులకు పునరావాసం పనులను వేగంగా పూర్తి చేసి వరద నీటిని ఒడిసిపట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరుగుతోంది. వరద నీటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రాజెక్టులను గరిష్ట స్థాయిలో నింపడం ద్వారా ఆ ఫలాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజం మొత్తానికి అందుతున్నాయి. తక్కువ లోతులోనే నీరు సమృద్ధిగా లభిస్తుండటంతో తాగు, సాగునీటి అవసరాలకు ఎక్కడా ఇబ్బందులు ఎదురు కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడం, భూగర్భ జలాలు పెరగడంతో వాతావరణ మార్పులు భారీ స్థాయిలో లేకుండా ఉష్ణోగ్రతలు కూడా అదుపులో ఉండే అవకాశం ఉంది. ఆయకట్టుకు పుష్కలంగా నీరందిస్తూ పొలాలను సస్యశ్యామలం చేయడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పునరావాస కల్పనలో గత సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో ఏటా వందల టీఎంసీల వరద జలాలు వృథాగా సముద్రంలో కలిశాయి.
గండికోట జలాశయంలో 26.85 టీఎంసీలు నిల్వ
గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన గండికోట జలాశయంలో తొలిసారిగా పూర్తి సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను మంగళవారం నిల్వ చేశారు. జలాశయం నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తి సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదే కాకుండా గాలేరు–నగరిలో అంతర్భాగమైన పైడిపాళెం, సర్వారాయసాగర్, వామికొండసాగర్ ప్రాజెక్టుల్లోనూ ఈ ఏడాదే గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేశారు. సీబీఆర్(చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లో పూర్తి సామర్థం మేరకు పది టీఎంసీలు నిల్వ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పులిచింతల ప్రాజెక్టు, సోమశిల రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు నిల్వ చేయడం తెలిసిందే.
గతంలో 3 టీఎంసీలే నిల్వ..
గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా 2012 నుంచి 2019 వరకు గరిష్టంగా మూడు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల నీటిని నిల్వ చేయలేకపోయారు. 2014 నుంచి 2019 వరకు గండికోట నిర్వాసితుల పునరావాసం కోసం ఐదేళ్లలో రూ.146.29 కోట్లను మాత్రమే టీడీపీ సర్కార్ ఖర్చు చేయడం గమనార్హం. చిత్రావతి, వామికొండ, పైడిపాళెం, పులిచింతల, సోమశిల, కండలేరు నిర్వాసితుల పునరావాసానికి కూడా గత సర్కార్ పైసా వ్యయం చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గండికోట నిర్వాసితుల పునరావాసానికి రూ.522.85 కోట్లను జూన్ 24న విడుదల చేసింది. పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, భూసేకరణకు రూ.403.2 కోట్లను మంజూరు చేసింది. వెరసి రూ.926.05 కోట్లను వ్యయం చేసి 17,809 మంది నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించింది. దీంతో గండికోటలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగారు. ఇక గాలేరు–నగరిలో అంతర్భాగమైన వామికొండసాగర్‌లో 1.60, సర్వారాయసాగర్‌లో 3.06, పైడిపాళెంలో ఆరు టీఎంసీలకుగానూ 5.84 టీఎంసీలను నిల్వ చేశారు. రూ.240.53 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో జలాశయం పూర్తయిన తర్వాత తొలిసారిగా ఈ ఏడాదే పూర్తి సామర్థ్యం మేరకు పది టీఎంసీలను నిల్వ చేశారు.
పులిచింతలతో శ్రీకారం..
అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ సర్కార్‌తో చర్చించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరావాసం నిధులను విడుదల చేసి పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత తొలిసారిగా గతేడాది 45.77 టీఎంసీలు నిల్వ చేశారు. ఈ ఏడాదీ అదే రీతిలో నీటిని నిల్వ చేశారు. దీనివల్ల కృష్ణా డెల్టాలో పంటల సాగుకు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటికి ఇబ్బందులు తొలిగాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా దశాబ్దాల క్రితం పూర్తయిన సోమశిల రిజర్వాయర్‌లో గతేడాది పూర్తి సామర్థ్యం మేరకు 78 టీఎంసీలు నిల్వ చేశారు. ఈ ఏడాదీ అదే రీతిలో నిల్వ చేశారు. దీంతో పెన్నా డెల్టా, తెలుగుగంగ ఆయకట్టులో పంటల సాగుకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటికి ఇబ్బందులు తొలగిపోయాయి. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి బంజరు భూములకు నీళ్లందించడం ద్వారా కరువును తరిమికొట్టేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో జలయఙ్ఞం చేపట్టారు. 84 ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టి పలు ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఆయన హఠాన్మరణం తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల్లోనూ నీటిని నింపలేని దుస్థితి నెలకొంది. కమీషన్‌లు రాకపోవడంతో గత సర్కారు పునరావాసం పనులను నిర్లక్ష్యం చేసింది. దీంతో గతంలో ఏటా వందలాది టీఎంసీల వరద జలాలు సముద్రంలో వృథాగా కలిశాయి.
కండలేరులో గరిష్టంగా నిల్వ చేసేలా..
కండలేరు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 68.03 టీఎంసీలు. గత ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. కండలేరు నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారిగా 60 టీఎంసీలను నిల్వ చేసింది. వచ్చే సీజన్ నాటికి నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా 68.03 టీఎంసీలను నిల్వ చేసే దిశగా అడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment