గాలేరు–నగరి..నిర్లక్ష్యంతో సరి
► బడ్జెట్ కాగితాల్లోనే కనిపిస్తున్న నిధులు
► ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా ముందుకు సాగని పనులు
► అధికారులే కారణమంటున్న పాలకులు
► ఎప్పుటికి పూర్తవుతుందో?
పాలకులు మారుతున్నారు.. అధికారులు మారిపోతున్నారు.. ఏళ్లు గడిచిపోతున్నాయి.. కృష్ణా జలాలు నగరికి చేరనే లేదు.. రైతుల జీవితాల్లో మార్పు కొంచెమైనా లేదు. అవే అవస్థలు.. కన్నీటి తడులు.. ఎడారిని తలపించే పొలాలు.. ఆశల మోములు.. ఆవేదన సుడిగుండాలు.. అవస్థల బతుకులు.. ఇదీ జిల్లా రైతుల దీన పరిస్థితి.
ప్రభుత్వం అధికారుల అలసత్వం వల్ల పనులు ఆలస్యమవు తున్నాయంటోంది. నిధులు విడుదల చేయకుండా పనులు ఎలా చేయాలని అధికారులు తలపట్టుకుంటు న్నారు. ఇదీ పాలకుల తీరు.
నగరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మరణం గాలేరు–నగరికి శాపంగా మారింది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రాజెక్టును ప్రారంభించారు. 2009 వరకు పనుల్లో వేగం పుంజుకుంది. తర్వాత ఆయన మరణించారు. ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. కాలువల ఏర్పాటుకు భూములు స్వాధీనం చేసుకున్న పనులే అడపాదడపా చేస్తున్నారు.
కాగితాల్లోనే నిధులు
2015–16 వరకు 4,789.96 కోట్లు వెచ్చించారు. 2016–17 బడ్జెట్‌లో 358.12 కోట్లు, 2017–18లో 363.12 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. జూలై 2017 నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఇదివరలో చెప్పుకొచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం మాటమార్చింది.
ఆడలేనమ్మ మద్దెలపై పడ్డట్టుంది
జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ప్రకటించారు. ఆపై మాట మార్చేశారు. అధికారుల అలసత్వం వల్లే పనులు మందకొడిగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. నిధులు విడుదల చేయకుండా తాము ఏపనులు చేస్తామంటూ అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఓవైపు కాంట్రాక్టర్లు తెలుపుతున్నారు.
ఇంకా ఎర్త్ వర్క్, రివిట్‌మెంట్, కాలువల పనులు చేయాల్సి ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు ప్రాంతంలో ముళ్లకంపలు పేరుకుపోవడంతో పాటు పలు ప్రాంతాల్లో పగుళ్లు వదలి ఉండటంతో ఇదివరలో చేపట్టిన పనులు కొంతమేరకు మళ్లీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనే అంశంలో స్పష్టత రాలేదు. ఏదో ఒకటి చెబుతూ ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో తమను మభ్యపెడుతోందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తయితే..
ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలోని 1.03 లక్షల ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని 1.55 లక్షల ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 0.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వీలుంటుంది. 3.03 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్పి అవుతాయి. 20 లక్షల మందికి తాగునీరు అందించవచ్చు.