ఇప్పటి వరకూ ఎమ్మెల్యే టికెట్ తమదేనంటూ ఆశల పల్లకీలో ఊరేగారు. ఎక్కువ కేసులు పెట్టించుకుని అధినేత దృష్టిలో పడేందుకు అడ్డగోలు చర్యలతో చెలరేగారు. చంద్రబాబుకు తాము ఎంత చెబితే అంత, తమకు కాక టికెట్ ఇంకెవరికి ఇస్తారంటూ విర్రవీగారు. డబ్బు మూటలే ప్రామాణికంగా పక్కపార్టీ నుంచి వచ్చేవారు, ఎన్‌ఆర్‌ఐలు, బడా పారిశ్రామికవేత్తలకు అధినేత టికెట్లు కేటాయిస్తుండటంతో దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆది నుంచి టీడీపీని నమ్ముకున్న నాయకులు ఎమ్మెల్యే టికెట్లపై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతున్నాయి. ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తామన్న చంద్రబాబు, చినబాబు మాటలు నీటి మూటలేనని తేలాయి. అధినేతల మెప్పు కోసం నియోజకవర్గాల్లో హడావిడి చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, కేసులు పెట్టించుకోవడమే లక్ష్యంగా పని చేసిన వారికి నిరాశే మిగిలింది. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ డబ్బు మూటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐలు, బడా పారిశ్రామికవేత్తలకే ఎమ్మెల్యే సీట్లు కట్టబెడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ టికెట్ వెనిగండ్ల రాముకు, గన్నవరం టికెట్ యార్లగడ్డ వెంకటరావుకు కేటాయించారు.
పార్టీ కోసం కష్టపడి పని చేసి, పలు కేసులు పెట్టించుకున్న పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బోడే ప్రసాద్ సీటు చింపేశారు. ఆయనకు టికెట్ లేదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారని సమాచారం. పక్క పార్టీల నుంచొచ్చే డబ్బున్న బడానేతలకు టికెట్ ఇస్తామన్న సంకేతాలు ఇచ్చారు. తనకే టికెట్ వస్తుందని బోడే ప్రసాద్ పాద యాత్రలు చేస్తున్నా, ఆయన భార్య, కుమారుడు కాళ్లకు బలపం కట్టుకుని గడప గడపకూ తిరుగుతున్నా ప్రయోజనం శూన్యమన్న చర్చ జరుగుతోంది. టికెట్ కోసం తమ ప్రత్యర్థి, పార్టీ మారుతున్న నేత పంచకు చేరి కాళ్లావేళ్ల పడగా, తనకే ఇక్కడ టికెట్ లేక వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని, అధిష్టానం వద్దే విన్నవించుకోవాలని ఆ నేత సూచించడంతో బోడే ప్రసాద్‌కు దింపుడు కల్లం ఆశ కూడా లేకపోయిందన్న చర్చ సాగుతోంది.
ఉమాకు టికెట్ గల్లంతు
పార్టీలో నంబరు–2, అధినేతకు తాను ఎంత చెబితే అంత అని విర్రవీగిన దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. అధినేత వద్ద మెప్పుకోసం నానా హంగామా చేసి కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్లిన ఆయనను ఇప్పుడు అధినేత పట్టించుకోవటం లేదు. మైలవరం సీటు కోసం పక్క పార్టీల నుంచి వచ్చేవారు, పార్టీలోనే కొంత మంది డబ్బు మూటలు ఆశ చూపడంతో ఉమాకు చెక్ పెట్టినట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. విజయవాడ ఎంపీ సీటు సైతం డబ్బే ప్రామాణికంగా కేశినేని చిన్నికి కేటాయిస్తున్నారని, పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.
ముద్దరబోయినకు షాక్
నూజివీడు నియోజకవర్గంలో పదేళ్లుగా పార్టీజెండా మోస్తూ తిరుగుతున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు, పార్టీ తరఫున పోరాటం చేసిన ముద్దరబోయినకు టికెట్ లేదని మొండి చెయ్యి చూపడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పక్క పార్టీ నుంచి వచ్చిన నేతకు టికెట్ కేటాయిస్తానని చెప్పడంపై, ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే జనసేన పొత్తు నేపథ్యంలో పలుచోట్ల టీడీపీ అభ్యర్థులకు గండి పడింది. బీజేపీతో పొత్తు ఉంటుందన్న నేపథ్యంలో మరికొన్ని సీట్లు ఆ పార్టీకి కేటాయించాల్సి వస్తోంది. మిగిలిన సీట్లు ఎన్‌ఆర్‌ఐలు, బడా పారిశ్రామిక వేత్తలకు కేటాయిస్తే, ఆది నుంచి పార్టీని నమ్ముకొని పని చేసిన వారి పరిస్థితి ఏంటనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో పార్టీ నేతల్లో అసంతృప్తి తారస్థాయికి చేరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment