అధికారుల తీరుపైహైకోర్టు తీవ్ర ఆగ్రహం
మీ ఇష్టం వచ్చినట్లు అనుమతులిచ్చి.. తర్వాత కూల్చివేతలంటారా?
సివిల్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి, ఆ తర్వాత కొన్నేళ్లకు కూల్చివేత నోటీసులిచ్చే అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తే గానీ సరిగా విధులు నిర్వహించరని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. నష్టపరిహారం కూడా సదరు అధికారుల నుంచే వసూలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిన స్థితి వస్తుందని హెచ్చరించింది. అధికారుల ఆస్తులు జప్తు చేస్తే అప్పుడు తెలిసొస్తుందని పేర్కొంది.
అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో సర్కార్ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, అధికారుల తప్పులకు ప్రజాధనం వెచ్చిoచడం సరికాదని అభిప్రాయపడింది. నిర్మాణం అక్రమమైనప్పుడు ఆ నిర్మాణం చేపట్టడానికి ఎలా అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించింది. అవకతవకలకు పాల్పడి అనుమతులిచ్చి.. నిర్మాణం పూర్తయిన తర్వాత చెరువులు, బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ అంటూ కూల్చివేతలకు పాల్పడుతున్నారని మండిపడింది.
అయితే, నీటివనరుల సంరక్షణకు తాము వ్యతిరేకం కాదని, అధికారుల తీరునే తప్పుబడుతున్నామని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని నర్కూడ గ్రామం మంగరాశి కుంట ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఇళ్లను నిర్మించారంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు.
15 రోజులు సమయమివ్వండి..
అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లను కూడా కూలుస్తామని అధికారులు ఈ నెల 4న నోటీసులు అతికించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఏడు రోజుల్లో నిర్మాణాలను తొలగించాలని అందులో హెచ్చరించారన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. పిటిషనర్ల వాదన వినకుండా.. కూల్చివేతపై ముందుకెళ్లడం చట్టవిరుద్ధమని చెప్పారు.
వాదనలు విన్న న్యాయమూర్తి.. ముందుగా చెరువులు, బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం అక్రమమని తేలితే.. చట్ట ప్రకారం ముందస్తు నోటీసులు జారీ చేయాలని, 15 రోజుల సమయం ఇచ్చి పిటిషనర్ల వాదన కూడా వినాలన్నారు. పిటిషనర్లు వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు, రసీదులను జతచేస్తూ వివరాలు అందజేయాలంటూ జడ్జి విచారణ ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment