పర్వతగిరి: ఎస్సారెస్పీ ద్వారా వస్తున్న సాగునీరు
తొర్రూరు రూరల్: వరి చేలు పాలు పోసుకుంటున్నాయి.. ఆరుగాలం చెమట తీసిన రైతన్న గట్టెక్కే రోజుల దగ్గరపడ్డాయి. ఎదుగుతున్న పంట చేనును చూసి రైతన్న మురిసిపోతున్నాడు.. ఇంకో రెండు తడులు పెడితే చాలు పంట చేతికి అందుతుంది. ఎరువుల బస్తాల అప్పులు, షావుకారు మందు డబ్బాల బాకీలు, పోరగాండ్ల బడి ఫీజులు అన్నీపోనూ ఇంకో రూ.పది, పదిహేను వేలు మిగులుతాయని అన్నదాతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లోగా అనుకోని ఆప ద.. దిగువకు నీళ్లు ఇవ్వొద్దని జగిత్యాల రైతుల ఆందోళన మొదలైంది. రైతు ఐక్య వేదిక పేరుతో కాల్వ నీళ్లకు అడ్డం పడ్డరు. రైతాంగానికి అక్కడి రాజకీయ పార్టీ నేతలు మద్దతు పలికారు. కాల్వల నీళ్లు ఆగిపోతాయేమోనని ఇక్కడి రైతన్న గుండె పగులుతున్నాడు.
దక్షిణ వరంగల్ ప్రాంతంలో కరువు తాండవిస్తోంది. వరుసగా వర్షాలు లేక పాలకుర్తి, వర్ధన్నపేట, మహబూబాబాద్ ప్రాంతా ల్లో పంట భూములు బీడువడ్డాయి. అప్పట్లో రబీ పంటలకు ఎస్సారెస్పీ జలాలు తీసుకొస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే హోదాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతులకు మాట ఇవ్వటంతో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద ఉన్న రైతులంతా పంటలు సాగు చేశారు. ఎర్రబెల్లి మాట ఇచ్చినట్లుగానే ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను విడుదల చేసింది. అధికారులు ఒక్కో చెరువు నింపు తూ వస్తున్నారు. దీంతో రైతుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అందరూ పొలం పనుల్లో బిజీ అయ్యారు. జిల్లాలో 40 వేల ఎకరాల ఆయకట్టు మేర రైతాంగం సాగు చేసుకుంది.
చెరువులకు జల కళ..
డీబీఎం–60ప్రధాన కాల్వ ద్వారా రోజుకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక టీఎంసీ నీటిని కాల్వల్లోకి వదిలారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ మండలాల్లోని 49 చెరువులను నింపేలా 1 టీఎంసీ నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 45 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాల్వ ద్వారా నీటిని వివిధ గ్రామాల చెరువులకు సరఫరా చేస్తున్నారు. డీబీఎం–57 పరిధిలో రాయపర్తి మండలంలోని 6, తొర్రూరు మండలంలోని 3 చెరువులకు 100 ఎంసీఎఫ్‌టీ, బయ్యన్న వాగు రిజర్వాయర్‌కు నీటి మళ్లింపు ద్వారా డీబీఎం 61 పరిధిలోని 6 చెరువులు, డీబీఎం 63 పరిధిలోని 4 చెరువులు, డీబీఎం–61, డీబీఎం–67 పరిధిలోని కొడకండ్ల, పెద్దవంగర మండలాల్లోని ఒక్కో చెరువుకు 200 ఎంసీఎఫ్‌టీ నీటిని సరఫరా చేస్తున్నారు.
ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలకు అనుబంధంగా ఉన్న ఉప కాల్వల ద్వారా రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ జలాలు వెళ్తున్నాయి. ఇల్లంద సమీపంలోని డీబీఎం గేటు తీయడంతో ఉప కాల్వ నుంచి వర్ధన్నపేట, పర్వతగిరి చెరువులు సైతం నిండుతున్నాయి. రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్‌కు భారీగా నీరు చేరుతుండడంతో ఈ మండలానికి సాగునీరు సమృద్ధిగా లభిస్తోంది. ఇక్కడ నుంచి బయ్యన్నవాగు రిజర్వాయర్ ద్వారా సూర్యపేట జిల్లాకు సైతం నీటిని విడుదల చేస్తున్నారు.
145 చెరువులకు జీవం..
వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న 11 మండలాలకుగాను సుమారు 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో గోదావరి జలాలను వదిలారు. భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి ఉండటంతో దాని నుంచి బయటపడేందుకు నీటిని కాల్వల్లోకి వదులుతున్నారు. దాదాపు 145 చెరువులు నీటితో నిండుతున్నాయి. రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 1,18,174 ఎకరాల ఆయకట్టు, వరంగల్ రూరల్ జిల్లాలో 32,636 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఉత్తర తెలంగాణకు సాగు నీరందించే ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్‌తోపాటు ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలకు ప్రయోజనం కలుగుతోంది. 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు ద్వారా ఐదు పాత జిల్లాలకు 18 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది.
జగిత్యాల రైతుల ఆందోళన నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు వచ్చే నీళ్లను నిలిపివేసి అక్కడి రైతాంగానికి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పాలు పోసుకునే దశలో ఉన్న వరి చేలు ఎండిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ దక్షిణ ప్రాంత రైతాంగం జల పోరాటానికి సిద్ధం కావాలనే ఆలోచనతో ఉంది. గతంలో దేవాదుల ఎత్తిపోతల ద్వారా చలివాగు రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించి మోటార్ల ద్వారా పాలకుర్తి, జనగామ ప్రాంతాలను నీళ్లందిస్తుండగా అక్కడి రైతులు ఓ రాజకీయ పార్టీ అండతో అప్పట్లో మోటార్లను బలవంతంగా బంద్ చేయించడంతో ఇక్కడి రైతుల పంట పొలాలు ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల కష్టాలు చూసే..
మాది కరువు ప్రాంతం. వానలు సరిగా కురవవు. పంటను కాపాడుకోలేక రైతన్న పడుతున్న కష్టాన్ని స్వయంగా చూసిన. నేరుగా సీఎంను కలిసి రైతుల కన్నీటి గాథను వివరించిన. ఎస్సారెస్పీ నీళ్లు ఇచ్చి ఆదుకోండని ప్రాథేయపడిన. ఆయన తక్షణమే స్పందించి రోజుకు 900 క్యుసెక్కుల నీళ్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. చెరువులు నిండాయి. వరి చేలకు నీరందుతోంది. ఒక్క నా నియోజకవర్గంలోనే 45 వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందుతోంది. రైతులు సంతోషంగా ఉన్నారు. పైన రాజకీయపరమైన ఆందోళనలు ఏవో జరుగుతున్నాయని తెలుస్తోంది. రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే
నీళ్లాపితే సావే దిక్కు..
ఇప్పుడైతే ఎస్సారెస్పీ నీళ్లు అందుతున్నాయి. వరి చేను పాలువోసుకుంటోంది. చెరువులకు నీళ్లు వచ్చి పంటకు పారుతోంది. కానీ ఎగువన రాజకీయం జరుగుతుందట. నీళ్లు ఆపుతారనే పుకార్లు అస్తున్నాయి. గీ టైంలో నీళ్లు ఆపితే సచ్చిపోవుడు తప్ప ఇంకోటి లేదు. – వెంకటసాయిలు, వెలికట్ట, తొర్రూరు
బోరు బాగా పోస్తుంది..
గతంలో బోరు సన్నగా పోసేది. ఎకరాకు కూడా నీరు సరిపోయేది కాదు. ఎస్సారెస్పీ జలాలతో భూమిలో నీరు పెరిగి బోరు బాగా పోస్తుంది. మూడెకరాల మేర సాగు చేసిన పంటలకు నీరు సరఫరా అవుతున్నాయి. ప్రతి సీజన్‌లో గోదావరి నీరు సరఫరా చేస్తే బాగుంటుంది. – వెంకన్న, రైతు, మైలారం, రాయపర్తి
నా పంట బయటపడ్డట్టే..
గోదావరి నీళ్లతో చెరువు నిండింది. నా వరి పంట చేతికి అందుతోంది. ఎప్పుడో వర్షాలు పడితే చెరువులోకి నీళ్లు వచ్చేవి. లేకుంటే చెరువు ఎండిపోయేది. ఇక నా పంట చేతికి అందినట్టే. –జక్కుల ఐలయ్య, రైతు, ఈరవెన్ను
Comments
Please login to add a commentAdd a comment