Warangal Agriculture
-
సేంద్రియ పంటలకు అధిక ధర
చెన్నారావుపేట: నాణ్యమైన పంటలు పం డించినపుడే అధిక రాబడి లభిస్తుందని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఆశాజ్యోతి మండల సమాఖ్య కార్యాలయంలో ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన పథకం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ న్యూడిల్లీ వారి ఆధ్వర్యంలో మూడు రోజు ల శిక్షణ తరగతులు మంగళవారం ప్రా రంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పంటల విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోని ఉండాలన్నారు. పండించిన వాటిని విక్రయించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మార్కెటింగ్, గ్రేడింగ్, నాణ్యత పాటించినపుడే పండించిన పంటకు అధిక ధర లభిస్తుందని తెలిపారు. మూడురోజుల కాలంలో సందేహాలను నివృత్తి చేసుకొని ఇతర రైతులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. నాణ్యమైన పం ట పండించినప్పుడు మార్కెటింగ్ వారు స్వయంగా రైతు వద్దకే వచ్చి ధర ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తారని చెప్పారు. వ్యవసాయ విస్తరణ అధికారులతో భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఆధారంగా పంటలు వేసుకోవాలన్నారు. నర్సంపేటలో మార్చి, పసుపు స్పైసెస్ ఇండస్ట్రీస్.. నర్సంపేటలో పుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా డీఆర్డీఓ సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మిర్చి, పసుపుతో పాటు వరి, మొక్కజొన్న స్పైసెస్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడానికి అనుమతులు కోరుతున్నట్లు తెలిపారు. రైతులు నాణ్యమైన పంట పండిస్తే అక్కడనే పండించిన పంటను స్పైసెస్ చేసి అధిక ధరకు విక్రయించవచ్చాన్నారు. స్పైసెస్ బోర్డు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ లింగప్ప మాట్లాడారు. వరంగల్ వరంగల్ చపట్టా మిర్చికి అధిక డిమాండ్ ఉందన్నారు. 150 దేశాలకు ఎగుమతి చేయడానికి 137 మంది ఎగుమతి దారులు ఉన్నారని అన్నారు. రైతులు పంట పండించిన తర్వాత ప్యాకింగ్, గ్రేడింగ్, మార్కెటింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలా చేసినప్పుడు సుమారుగా రూ. 8 వేలు ఉన్న మిర్చికి రూ.10 వేల ధర వస్తుందన్నారు. రైతులు ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలన్నారు.. కార్యక్రమంలో సర్పంచ్ కుండె మల్లయ్య, అసిస్టెంట్ కలెక్టర్ మను చౌదరి, జెడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రావు, డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్, డీపీఆర్వో బండి పల్లవి, ఆర్డీఓ రవి, నర్సంపేట ఉద్యానశాఖ అధికారిని జ్యోతి, వ్యవసాయ అధికారి అనిల్, అసిస్టెంట్ మార్కెటింగ్ స్సైసెస్ బోర్డు డైరెక్టర్ స్వప్న థాయర్, వివేక్నాథ్, జిల్లా సంక్షేమ అధికారిణి సబిత, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ చందర్, ఏపీఓ అరుణ, ఎస్సై కూచిపూడి జగదీష్, సాయి స్వచ్ఛంద సంస్థ సీఈఓ వెంకన్న, మండల సమాఖ్య అధ్యక్షురాలు పెంతల స్వప్న, కో ఆర్డినేటర్ సుధాకర్, స్వామి, శిరీష, తదితరులు ఉన్నారు. వననర్సరీ సందర్శన మండలంలోని మగ్దుంపురం వన నర్సరిని కలెక్టర్ హరిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోజుకు ఎన్ని బ్యాగులు నింపుతున్నారు.. ఎన్ని స్టంప్స్ పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యం చేయకుండా వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెండ్యాల జ్యోతి ప్రభాకర్, ఆర్డీవో రవి, ఎంపీడీవో చందర్, ఏపీవో అరుణ, ఎఫ్ఏ సతీష్,తదితరులు ఉన్నారు. -
నీళ్ల కోసం జగడం
తొర్రూరు రూరల్: వరి చేలు పాలు పోసుకుంటున్నాయి.. ఆరుగాలం చెమట తీసిన రైతన్న గట్టెక్కే రోజుల దగ్గరపడ్డాయి. ఎదుగుతున్న పంట చేనును చూసి రైతన్న మురిసిపోతున్నాడు.. ఇంకో రెండు తడులు పెడితే చాలు పంట చేతికి అందుతుంది. ఎరువుల బస్తాల అప్పులు, షావుకారు మందు డబ్బాల బాకీలు, పోరగాండ్ల బడి ఫీజులు అన్నీపోనూ ఇంకో రూ.పది, పదిహేను వేలు మిగులుతాయని అన్నదాతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లోగా అనుకోని ఆప ద.. దిగువకు నీళ్లు ఇవ్వొద్దని జగిత్యాల రైతుల ఆందోళన మొదలైంది. రైతు ఐక్య వేదిక పేరుతో కాల్వ నీళ్లకు అడ్డం పడ్డరు. రైతాంగానికి అక్కడి రాజకీయ పార్టీ నేతలు మద్దతు పలికారు. కాల్వల నీళ్లు ఆగిపోతాయేమోనని ఇక్కడి రైతన్న గుండె పగులుతున్నాడు. దక్షిణ వరంగల్ ప్రాంతంలో కరువు తాండవిస్తోంది. వరుసగా వర్షాలు లేక పాలకుర్తి, వర్ధన్నపేట, మహబూబాబాద్ ప్రాంతా ల్లో పంట భూములు బీడువడ్డాయి. అప్పట్లో రబీ పంటలకు ఎస్సారెస్పీ జలాలు తీసుకొస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే హోదాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతులకు మాట ఇవ్వటంతో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద ఉన్న రైతులంతా పంటలు సాగు చేశారు. ఎర్రబెల్లి మాట ఇచ్చినట్లుగానే ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను విడుదల చేసింది. అధికారులు ఒక్కో చెరువు నింపు తూ వస్తున్నారు. దీంతో రైతుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అందరూ పొలం పనుల్లో బిజీ అయ్యారు. జిల్లాలో 40 వేల ఎకరాల ఆయకట్టు మేర రైతాంగం సాగు చేసుకుంది. చెరువులకు జల కళ.. డీబీఎం–60ప్రధాన కాల్వ ద్వారా రోజుకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక టీఎంసీ నీటిని కాల్వల్లోకి వదిలారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ మండలాల్లోని 49 చెరువులను నింపేలా 1 టీఎంసీ నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 45 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాల్వ ద్వారా నీటిని వివిధ గ్రామాల చెరువులకు సరఫరా చేస్తున్నారు. డీబీఎం–57 పరిధిలో రాయపర్తి మండలంలోని 6, తొర్రూరు మండలంలోని 3 చెరువులకు 100 ఎంసీఎఫ్‌టీ, బయ్యన్న వాగు రిజర్వాయర్‌కు నీటి మళ్లింపు ద్వారా డీబీఎం 61 పరిధిలోని 6 చెరువులు, డీబీఎం 63 పరిధిలోని 4 చెరువులు, డీబీఎం–61, డీబీఎం–67 పరిధిలోని కొడకండ్ల, పెద్దవంగర మండలాల్లోని ఒక్కో చెరువుకు 200 ఎంసీఎఫ్‌టీ నీటిని సరఫరా చేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలకు అనుబంధంగా ఉన్న ఉప కాల్వల ద్వారా రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ జలాలు వెళ్తున్నాయి. ఇల్లంద సమీపంలోని డీబీఎం గేటు తీయడంతో ఉప కాల్వ నుంచి వర్ధన్నపేట, పర్వతగిరి చెరువులు సైతం నిండుతున్నాయి. రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్‌కు భారీగా నీరు చేరుతుండడంతో ఈ మండలానికి సాగునీరు సమృద్ధిగా లభిస్తోంది. ఇక్కడ నుంచి బయ్యన్నవాగు రిజర్వాయర్ ద్వారా సూర్యపేట జిల్లాకు సైతం నీటిని విడుదల చేస్తున్నారు. 145 చెరువులకు జీవం.. వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న 11 మండలాలకుగాను సుమారు 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో గోదావరి జలాలను వదిలారు. భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి ఉండటంతో దాని నుంచి బయటపడేందుకు నీటిని కాల్వల్లోకి వదులుతున్నారు. దాదాపు 145 చెరువులు నీటితో నిండుతున్నాయి. రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 1,18,174 ఎకరాల ఆయకట్టు, వరంగల్ రూరల్ జిల్లాలో 32,636 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఉత్తర తెలంగాణకు సాగు నీరందించే ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్‌తోపాటు ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలకు ప్రయోజనం కలుగుతోంది. 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు ద్వారా ఐదు పాత జిల్లాలకు 18 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. జగిత్యాల రైతుల ఆందోళన నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు దిగువకు వచ్చే నీళ్లను నిలిపివేసి అక్కడి రైతాంగానికి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పాలు పోసుకునే దశలో ఉన్న వరి చేలు ఎండిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ దక్షిణ ప్రాంత రైతాంగం జల పోరాటానికి సిద్ధం కావాలనే ఆలోచనతో ఉంది. గతంలో దేవాదుల ఎత్తిపోతల ద్వారా చలివాగు రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించి మోటార్ల ద్వారా పాలకుర్తి, జనగామ ప్రాంతాలను నీళ్లందిస్తుండగా అక్కడి రైతులు ఓ రాజకీయ పార్టీ అండతో అప్పట్లో మోటార్లను బలవంతంగా బంద్ చేయించడంతో ఇక్కడి రైతుల పంట పొలాలు ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాలు చూసే.. మాది కరువు ప్రాంతం. వానలు సరిగా కురవవు. పంటను కాపాడుకోలేక రైతన్న పడుతున్న కష్టాన్ని స్వయంగా చూసిన. నేరుగా సీఎంను కలిసి రైతుల కన్నీటి గాథను వివరించిన. ఎస్సారెస్పీ నీళ్లు ఇచ్చి ఆదుకోండని ప్రాథేయపడిన. ఆయన తక్షణమే స్పందించి రోజుకు 900 క్యుసెక్కుల నీళ్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. చెరువులు నిండాయి. వరి చేలకు నీరందుతోంది. ఒక్క నా నియోజకవర్గంలోనే 45 వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందుతోంది. రైతులు సంతోషంగా ఉన్నారు. పైన రాజకీయపరమైన ఆందోళనలు ఏవో జరుగుతున్నాయని తెలుస్తోంది. రైతులకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే నీళ్లాపితే సావే దిక్కు.. ఇప్పుడైతే ఎస్సారెస్పీ నీళ్లు అందుతున్నాయి. వరి చేను పాలువోసుకుంటోంది. చెరువులకు నీళ్లు వచ్చి పంటకు పారుతోంది. కానీ ఎగువన రాజకీయం జరుగుతుందట. నీళ్లు ఆపుతారనే పుకార్లు అస్తున్నాయి. గీ టైంలో నీళ్లు ఆపితే సచ్చిపోవుడు తప్ప ఇంకోటి లేదు. – వెంకటసాయిలు, వెలికట్ట, తొర్రూరు బోరు బాగా పోస్తుంది.. గతంలో బోరు సన్నగా పోసేది. ఎకరాకు కూడా నీరు సరిపోయేది కాదు. ఎస్సారెస్పీ జలాలతో భూమిలో నీరు పెరిగి బోరు బాగా పోస్తుంది. మూడెకరాల మేర సాగు చేసిన పంటలకు నీరు సరఫరా అవుతున్నాయి. ప్రతి సీజన్లో గోదావరి నీరు సరఫరా చేస్తే బాగుంటుంది. – వెంకన్న, రైతు, మైలారం, రాయపర్తి నా పంట బయటపడ్డట్టే.. గోదావరి నీళ్లతో చెరువు నిండింది. నా వరి పంట చేతికి అందుతోంది. ఎప్పుడో వర్షాలు పడితే చెరువులోకి నీళ్లు వచ్చేవి. లేకుంటే చెరువు ఎండిపోయేది. ఇక నా పంట చేతికి అందినట్టే. –జక్కుల ఐలయ్య, రైతు, ఈరవెన్ను -
రబీకి సన్నద్ధం..
సాక్షి, భూపాలపల్లి: ఖరీఫ్ సీజన్ ముగియడానికి సమయం దగ్గర పడుతుండటంతో రబీ కోసం వ్యవసాయ శాఖ పంటల ప్రణాళికలను సిద్ధం చేసింది. జిల్లాలో రైతులు సాగు చేయనున్న పంటలకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులకు సంబంధించిన అంచనాలను తయారుచేసింది. మామూలుగా అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు రబీ సీజన్ ఉంటే జిల్లాలో ఒక నెల ఆలస్యంగా పంటల సాగు ప్రారంభిస్తుంటారు. జిల్లా పరిధిలోని 20 మండలాల్లో సాగయ్యే పంటలకు అనుగుణంగా విత్తనాలను పంపిణీ చేయడానికి అవసరమైన కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఈ రబీలో దాదాపు 80,711.4 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో సింహభాగం 51,975 ఎకరాల్లో వరి వేయనున్నట్లు పేర్కొం టోంది. 2017–18 సంవత్సరం రబీలో 76,865 ఎకరాల్లో పంటలు సాగయినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. గత ఏడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఇది ఎక్కువే. జిల్లాలో రబీ సాధారణ సాగు 86,092.5 ఎకరాలు. వ్యవసాయ శాఖ దాదాపు 6,000 ఎకరాలు తక్కువగా అంచ నా వేసింది. పంటలకు అవసరమయ్యే 5,662 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయబోతోంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులను అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. చెరువుల కింద ఇబ్బంది లేదు.. జిల్లాలో ఈ సారి వర్షాలు విస్తారంగా కురియడంతో చెరువులు దాదాపు నిండాయి. దీంతో ఆయకట్టులో భూముల్లో సాగుకు ఇబ్బంది లేదు. జిల్లాలో ప్రధాన చెరువలైన రామప్ప, లక్నవరం, గణపురం, భీంగణపూర్ చెరువులతోపాటు చిన్న చితకా కలిపి 600లకుపైగా చెరువులు ఉన్నాయి. దాదాపు అన్ని చెరువులు నీటితో నిండి ఉన్నాయి. సాగు అంచనాలను మించే అవకాశం.. ఖరీఫ్ ప్రారంభమైన తర్వాత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో పంట లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వాగులు వంకలు ఉన్న ప్రాంతాల్లో ఇసుకమేటలతో పంటలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇలాంటి చోట్ల వ్యవసాయదారులు ఇసుక మేటలను తీయించే పనిలో ఉన్నారు. ఖరీఫ్‌లో సాగుచేయని వారు రబీలో ఆరుతడి పంటలతోపాటు వరి సాగు చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఈసారి సాగు విస్తీర్ణం వ్యవసాయ శాఖ అంచనాలను మించే అవకాశం ఉంది. వ్యవసాయ బోర్లు ఉన్న చోట వరికి ప్రాధాన్యతనిస్తుండగా, నీటి సదుపాయం లేనిచోట రైతులు పప్పుధాన్యాలను సాగు చేయనున్నారు. -
భారీ వర్షం
వరంగల్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు ప్రాంతా ల్లో గురువారం భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా పరకాలలో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతా లు జలమయం కాగా... పలుప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. కొడకండ్ల మండల కేంద్రంలోని బయ్యన్నవాగులోకి వరద నీరు భారీగా చేరుతుండడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. గ్రామంలో భారీ వృక్షం నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పద్మశాలి కాలనీలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. తొర్రూరు, చిట్యాల, వెలికట్ట, బొమ్మకల్ గ్రామాల్లో చెరువులు అలుగు పోస్తున్నాయి. ఆయూ ప్రాంతాల్లో పత్తి, పెసర పంటలు నీట మునిగాయి. నెల్లికుదురు మండలంలో కాచికల్-ఎర్రబెల్లిగూడెం గ్రామాల మధ్య కల్వర్టుపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. తొర్రూరు-కేసముద్రం, నెల్లికుదురు-మహబూబాబాద్ మార్గాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. కురవి బస్టాండ్ సెంటర్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. నర్సింహులపేట మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. డో ర్నకల్ మండల కేంద్రంలో వీధులన్నీ జలమయమయ్యా యి. మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కేసముద్రం మండలం ఇనుగుర్తిలో పంటలు నీటిలో కొట్టుకుపోయాయి. ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. బుధవారం నుంచి గురువారం వరకు వర్షపాతం ఇలా.. బచ్చన్నపేట 10.4 మి.మీ ,స్టేషన్ఘనపూర్ 2.0, ధర్మసాగర్ 4.8, హసన్‌పర్తి 6.2, హన్మకొండ 10.6, వర్ధన్నపేట 2.4, జఫర్‌గఢ్ 10.8, పాలకుర్తి 8.0, దేవరుప్పుల 9.4, కొడకండ్ల 8.4, రాయపర్తి 4.8, తొర్రూరు 2.0, నర్సింహులపేట 3.8, మరిపెడ 65.4, డొర్నకల్ 8.0, కురవి 18.2, కేసముద్రం 38.4, నెక్కొండ 6.8, గూడూర్ 31.4, కొత్తగూడ 12.8, ఖా నాపూర్ 5.2, చెన్నారావుపేట 4.0, పర్వతగిరి 3.2, సంగెం 13.8, నల్లబెల్లి 9.8, దుగ్గొండి 6.2, గీసుకొండ 45.0, ఆత్మకూర్ 50.6, శాయంపేట 40.0, పరకాల 87.8, రేగొండ 24.2, మొగుళ్లపల్లి 3.6, గణపురం 11.8, ములుగు 13.4, తాడ్వాయి 2.0, ఏటూరునాగారం 11.2, వరంగల్ 21.4 మిల్లీ మీటర్లుగా నమోదైనట్లు వ్యవసాయ శాఖ ఆధికారులు తెలిపారు.