గద్దెనెక్కిన సారలమ్మ | Huge Devotees Rush at Medaram Jaatara | Sakshi
Sakshi News home page

గద్దెనెక్కిన సారలమ్మ

Published Thu, Feb 1 2018 1:36 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM

Huge Devotees Rush at Medaram Jaatara - Sakshi

సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తున్న పూజారులు

మేడారం నుంచి సాక్షిప్రతినిధి: వనమంతా జనంతో నిండిపోయింది. జంపన్నవాగు భక్తజన హోరుతో మార్మోగింది. అడవితల్లుల మహాజాతర మొదలైంది! కన్నెపల్లి నుంచి సారలమ్మ.. పూనుగొండ నుంచి పగిడిద్దరాజు.. కొండాయి నుంచి గోవిందరాజులు.. ఈ ముగ్గురి రాకతో బుధవారం మేడారం వన జాతర అంగరంగవైభవంగా షురూ అయింది. సుమారు రాత్రి 12.20 గంటల సమయంలో భక్తుల జయజయధ్వానాల మధ్య సారలమ్మ గద్దెనెక్కింది. అంతకుముందు సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 8.12 గంటల సమయంలో గుడి నుంచి మొంటె(వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. మార్గం మధ్యలో జంపన్నవాగులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ్నుంచి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పగిడిద్దరాజు–సమ్మక్క వివాహం కనులపండువగా సాగింది. అనంతరం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ముగ్గురి రూపాలను అర్ధరాత్రి మేడారం గద్దెలపై చేర్చారు. 

సంతాన ‘వరం’కోసం.. 
సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటె(వెదురు బుట్ట)లో తీసుకొస్తుండగా ఆలయం ప్రహరీ నుంచి వంద మీటర్ల పొడవునా సంతాన భాగ్యం ఎదురు చూసే భక్తులు నేలపై పడుకుని వరం పట్టారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్‌ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. అక్కడ్నుంచి జంపన్నవాగుకు సారలమ్మ చేరుకుంది. వంతెన ఉన్నా.. నీటిలో నుంచే నడుస్తూ సారలమ్మ పూజారులు వాగును దాటారు. ప్రభుత్వం తరఫున జాయింట్‌ కలెక్టర్‌ దుగ్యా ల అమయ్‌కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే సీతక్క పూజా కార్యక్రమాలను దగ్గరుండి వీక్షించారు. కన్నెపల్లి నుంచి మేడారం వరకు సారలమ్మ ప్రయాణించే సమయంలో చంద్రగ్రహణం ఉంది. అయినా ఆదివాసీ వడ్డెలు దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగారు. గ్రహణం కొనసాగుతున్నా.. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

జంపన్నవాగులో జనహోరు 
సారలమ్మ, తండ్రి పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిమలు గద్దెలపైకి చేరుకోవడంతో మేడారం ప్రాంతంలోని కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్‌ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవి దారులన్నీ పోటెత్తాయి. మేడారం నలువైపులా కిలోమీటర్ల మేర దారులు వాహనాలు, భక్తులతో నిండిపోయాయి. 

నేడు సమ్మక్క రాక 
మేడారం జాతరలో అద్భుత సన్నివేశంగా భావించే సమ్మక్క గద్దెలపైకి చేరే ఘట్టం గురువారం జరుగనుంది. సమ్మక్క ప్రధాన పూజారులు, వడ్డెలు మేడారం సమీపంలో ఉన్న సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్కను తీసుకువచ్చేందుకు వెళ్తారు. అశేష భక్త జనులు ఎదురెళ్లి స్వాగతం పలుకుతుండగా.. సమ్మక్కను భరిణె రూపంలో గద్దెల వద్దకు తెచ్చి ప్రతిష్టించాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వన దేవతలు నలుగురు గద్దెలపైకి చేరుకోవడంతో గురువారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో భక్తులు మేడారం చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. 

గర్భిణి, మరొకరి మృతి 
నిర్మల్‌ జిల్లా బాసర మండలం గాంధీనగర్‌కు చెందిన గర్భిణి సారాబాయి(33) మేడారం వస్తుండగా.. తాడ్వాయి వద్ద పురిటి నొప్పులు వచ్చాయి. ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. బాబు జన్మించాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో సారాబాయిని అంబులెన్స్‌లో వరంగల్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యలో పస్రా–జంగాలపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ట్రాఫిక్‌ జాంలో సుమారు 3 గంటలపాటు కాలయాపన జరిగింది. ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జంపన్న వాగు సమీపంలో సొమ్మసిల్లి పడిపోయిన భూపాలపల్లి మండలం గొర్లవీడుకు చెందిన తాటికొండ రాజనర్సయ్య (50)ను వరంగల్‌ ఎంజీఎంకు తరలిస్తుండగా మరణించాడు. 

తీరని ట్రాఫిక్‌ చిక్కులు 
జాతర ప్రారంభానికి ముందే ట్రాఫిక్‌ సమస్యలు చుట్టుముట్టాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు పన్నెండు గంటల పాటు వరంగల్‌–మేడారం మార్గం మధ్యలో మల్లంపల్లి, గట్టమ్మ, ములుగు, జంగాలపల్లి, పస్రాల వద్ద ట్రాఫిక్‌ జాం అయింది. వరంగల్‌ నుంచి మేడారం వరకు సగటున మూడు గంటల ప్రయాణం కాగా.. ఆరేడు గంటల సమయం పట్టింది. ట్రాఫిక్, బందోబస్తును డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. 

పోటెత్తిన భక్తజనం 
కన్నెపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను తీసుకువచ్చే అద్భుత సన్నివేశాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దారి పొడవునా ఇరువైపులా ఎదురేగి దండాలు పెట్టారు. సారలమ్మ రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో పరవశించింది. మాజీ ఎమ్మెల్యే సీతక్క కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం వద్ద ఆదివాసీ నృత్యం చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వాయిద్యాలు, నృత్యాలతో కన్నెపల్లి ఆలయం మార్మోగిపోయింది. రాత్రి 7:15 గంటలకు సారలమ్మ పూజారులు కాక సారయ్య, లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనుకమ్మ, కాక భుజంగరావు సారలమ్మ పూజా క్రతువులు ప్రారంభించారు. అనంతరం కన్నెపల్లి ఆలయం నుంచి మేడారం బయల్దేరారు. 

సమ్మక్క–సారక్క జాతర ప్రత్యేక వెబ్‌సైట్‌
సాక్షి, హైదరాబాద్‌: మేడారం సమ్మక్క–సారక్క జాతర ప్రత్యేక వెబ్‌సైట్‌ను గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఐ–యుగ సీఈవో రజిత్‌ ఆకుల, ప్రతినిధులు వెంకట్, రజనీకాంత్‌ తదితరులు ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనిలో మేడారం సమ్మక్క–సారక్క చరిత్ర, ముఖ్య ఘట్టాలు, భక్తులకు అందే సేవలు, అత్యవసర సమయంలో కావాల్సిన వివిధ శాఖల సమాచారం, అధికారుల ఫోన్‌ నంబర్లు, జాతరకు వెళ్లే మార్గాలు, గూగుల్‌ మ్యాప్‌ లింకులు, సమీప ప్రాంతాల్లో దర్శనీయ స్థలాల వివరాలుంటాయని మంత్రి పేర్కొన్నారు. 2006 నుంచి మేడారం జాతరకు ఐ–యుగ సంస్థ సాంకేతిక సాయం అందిస్తుందని వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement