సారలమ్మను గద్దెకు తీసుకువస్తున్న పూజారులు
అడవి బిడ్డల మహా జాతర జిల్లాలో వైభవంగా ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కోయపూజారుల మంత్రోచ్చరణలు.. డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాల నడుమ సారలమ్మ గద్దెకు చేరుకుంది. దీంతో జాతరలో మొదటిఘట్టం కన్నుల విందుగా సాగింది. బుధవారం సాయంత్రం నుంచే జిల్లాలోని సమ్మక్క గద్దెల వద్దకు భక్తులు తరలివస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్ నగరపాలక పరిధిలోని రేకుర్తి, శంకరపట్నం, వేగురుపల్లి– నీరుకుల్ల, వీణవంక, హుజూరాబాద్, కొత్తపల్లి మండలం చింతకుంట(శాంతినగర్), చొప్పదండి మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సమ్మక్క– సారలమ్మ జాతరకు వేలాది మంది పయనమవుతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నేడు సమ్మక్కతల్లి గద్దెకు చేరుకోనుంది. శుక్రవారం అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు.
సాక్షి, కరీంనగర్: జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తిలో జరుగుతున్న సమ్మక్క– సారలమ్మ జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు బుధవారం వరకే లక్షమందికి పైగా భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. రేకుర్తి కరీంనగర్‌లో విలీనమైన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న జాతర సందర్భంగా బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు.
సారలమ్మకు ఘనస్వాగతం..
రేకుర్తి శ్రీ సమ్మక్క– సారలమ్మ జాతరలో భాగంగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కోయ పూజారులు, ఆలయ ఈవో రత్నాకర్‌రెడ్డి, వ్యవస్థాపక చైర్మన్ పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో పక్కనే ఉన్న కొండపైకి వెళ్లారు. అక్కడ సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా ఊరేగింపు మధ్య గద్దెవద్దకు తీసుకొచ్చారు. అమ్మవారు వచ్చే సమయంలో భక్తులు ఘనస్వాగతం పలికారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సాయంత్రం 5.10 గంటలకు సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెలకు చేరనుంది. అప్పటి నుంచి ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనం ఇస్తారు. శుక్రవారం అమ్మవార్లకు మొక్కులు ఉంటాయి. శనివారం సాయంత్రం వనప్రవేశం చేస్తారు.
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు..
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం సాయంత్రానికే లక్షమందికి పైగా భక్తులు వచ్చారు. గురువారం, శుక్రవారం మరో ఐదు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. తాగునీరు, సానిటేషన్, బందోబస్తు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఏర్పాట్లను కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, జాతర నోడల్ అధికారి క్రాంతి బుధవారం పరిశీలించారు. భక్తులకు శానిటేషన్, మంచినీరు, స్నానపుగదులు, దుస్తులు మార్చుకునే గదుల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన సమయంలో తీసుకునే చర్యలను అధికారులతో సమీక్షించారు.
జిల్లావ్యాప్తంగా సందడి..
సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సందడి నెలకొంది. జిల్లాలో రేకుర్తితో పాటు శంకరపట్నం, హుజూరాబాద్, వీణవంక, వేగురుపల్లి– నీరుకుల్ల, చింతకుంట(శాంతినగర్), చొప్పదండి మండలంలోని ఆర్నకొండ తదితర ప్రాంతాల్లో జాతర ఘనంగా ప్రారంభమైంది. సారలమ్మ తల్లి ఆగమనంతో అన్ని ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. అందుకు అనుగుణంగా అధికారులు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment