
చేతి పంపు వద్ద నీళ్ల కోసం బారులు తీరిన భక్తులు
మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో భక్తులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. తల్లుల దర్శనం కోసం క్యూ లైన్లలో నిల్చున్న వారు గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. జాతరలో తాగునీటి వసతి కల్పించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు ప్రభుత్వం రూ.19.80 కోట్లను కేటాయించింది. ఇందులో సుమారు రూ.10 కోట్ల వరకు తాగునీటి వసతికి వెచ్చించారు. కాగా, గత జాతరలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ద్వారానే నీళ్లను అందిస్తున్నారు. కేవలం మిషన్ భగీరథ నీళ్లపైనే ఆశలు పెట్టుకుని అధికారులు కాలం వెళ్లదీస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. –ములుగు
క్యూ లైన్లలో ఇబ్బందులు
భక్తులు సోమవారం భారీగా గద్దెలకు చేరుకోవడంతో రద్దీ ఎక్కువై అమ్మల దర్శనం ఆలస్యమైంది. మధ్యాహ్నం కావడంతో ఎండ ఎక్కువగా ఉండి తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చంటి పిల్లల పరిస్థితి అగమ్యగోచరం. క్యూలో భక్తుల కోసం డ్రమ్ములు, నల్లాల ద్వారా నీటిని అందిస్తామన్న అధికారులు ఇప్పటి వరకు ఆదిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
వంటావార్పునకు..
భక్తులు నీళ్ల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్‌పాయింట్, నార్లాపూర్, చింతల్‌క్రాస్, వెంగళాపురం, పడిగాపురం, కొత్తూరు, కన్నెపల్లి, ఊరట్టం ప్రాంతాల్లో నీళ్లులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది ప్రైవేట్ వాహనాల ద్వారా సమీపంలోని బోరింగ్ పంపులు, ట్యాప్స్‌ల ద్వార నీటిని తీసుకొస్తున్నారు. మరి కొందరు వాగు నీళ్లను వంటలకు వాడుతున్నారు.
మినరల్ వాటర్ క్యాన్‌కు రూ.70
ఆర్‌డబ్ల్యూఎస్ తరుఫున డిమాండ్ మేర మంచినీరు అందకపోవడంతో ఇదే అదునుగా భావించిన వ్యాపారులు మినరల్ వాటర్ క్యాన్ల ధరలను అమాంతంగా పెంచేశారు. 20 రోజుల క్రితం క్యాన్‌కు రూ.15 నుంచి రూ.20 ధర పలుకగా ప్రస్తుతం ఆ ధర రూ.50 నుంచి రూ.70 దాకా పలుకుతూ ఉండడం విశేషం.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తేనే..
మిషన్ భగీరథ పథకంలో భాగంగా మేడారానికి వచ్చే భక్తులకు ఈ సారి శుద్ధమైన గోదావరి జలాలను అందించాలని ప్రభుత్వం యంత్రాంగం భావించింది. అనుకున్న విధంగానే పనులను వేగవంతం చేసింది. కానీ, అధికారుల ప్రయత్నం సఫలమయ్యేలా కనిపించడం లేదు. ఇంగ్లిష్ మీడియం పాఠశాల సమీపంలో 4 లక్షల లీటర్ల కెపాసిటీతో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించింది. ఇదంతా బాగానే ఉన్నా అధికారులు నీటిని అందించని పక్షంలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా భగీరథ పథకం ద్వార నీటిని అందిస్తే మేలని భక్తులు సూచిస్తున్నారు.
మంచినీటికి ఇబ్బందులు పడుతున్నాం..
జాతరలో మంచినీటి సౌకర్యం ఉంటుంనే భావనతో ఇంటి నుంచి నీళ్లను తీసుకురాలేదు. తీరా ఇక్కడికి వచ్చాక నీళ్లు అందుబాటులో లేవు. మినరల్ వాటర్ ప్లాంట్‌కు వెళితే ఎక్కడా లేని ధరలు చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. తాగడానికి, వంట చేయడానికి రెడ్డిగూడెం సమీపంలోని నల్లాల దగ్గరకు వచ్చాం. నీళ్లు బాగాలేకున్నా తాగుతున్నాం.
విజయ, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment