
మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఆదివాసీలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ధర్మకర్తల మండలి ట్రస్టు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ట్రస్టు బోర్డు నుంచి లంబాడీలను తొలగించాలంటూ ఆదివాసీలు ఎండోమెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. జయశంకర్ జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో 2018 జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సమ్మక్క–సారలమ్మ జాతర జరగనుంది. జాతర నిర్వహణకు సంబంధించి 14 మంది సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్‌తో ట్రస్టు బోర్డును ఏర్పాటు చేస్తూ నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
అదే సమయంలో ఆదివాసీలు ఎండోమెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు, ఆదివాసీలకు మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహించిన ఆదివాసీ యువకులు అక్కడున్న కుర్చీలను గాల్లోకి విసిరారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి కుమారుడు అజ్మీరా ప్రహ్లాద్ కారుపైకి రాళ్లు విసిరారు. మరో పది కార్ల అద్దాలు పగిలాయి. ఆదివాసీల డిమాండ్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని జాతర కార్యనిర్వహణాధికారి రమేశ్‌బాబు హామీనివ్వడంతో ఆందోళన విరమించిన ఆదివాసీలు ర్యాలీగా సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లారు. ఓ వైపు ఆందోళన కొనసాగుతుండగా అక్కడే ఉన్న ఐటీడీఏ అతిథిగృహం నుంచి పొగలు వచ్చాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పేశారు. పెసా చట్టం ప్రకారం జాతర పాలకమండలిలో ఆదివాసీలనే నియమించాలని ఆం దోళన కారులు డిమాండ్ చేశారు.
రాజకీయ జోక్యమే కారణమా?
మేడారం జాతర ట్రస్టు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం రసా భాస కావడానికి రాజకీయ జోక్యమే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. జాతర సందర్భంగా తలనీలాల సేకరణ, గద్దెలపై పోగైన బెల్లం అమ్మకాలు నామినేషన్ పద్ధతిపై కేటాయిస్తున్నారు. ఈ విషయంలో ట్రస్టుబోర్డు నిర్ణయమే కీలకం. దీంతో ట్రస్టు బోర్డులో తమకు అనుకూలంగా ఉన్న వారికే అధికార పార్టీ నేతలు స్థానం కల్పించారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. ట్రస్టు బోర్డులో 14 మంది సభ్యులకుగాను ఇద్దరు ఆదివాసీలకు చోటు కల్పి ంచడం ఇందుకు ఉదాహరణ అని వారు పేర్కొంటున్నారు. దీనిపై ఏడాదికాలంగా పూజా రుల సంఘం, దేవాదాయశాఖకు మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇటీవల లంబాడీ–ఆదివాసీల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment