
సాక్షి, వరంగల్ : మేడారం జాతరకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ‍్యమంత్రి రమణ్ సింగ్ సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే... సీఎం రమణ్‌సింగ్ గురువారం జారతకు వచ్చారు. ఆయన సమ్మక్కను దర్శించుకుని సారలమ్మ వద్దకు వెళుతుండగా మరోవైపు...క్యూలైన్‌లోని భక్తులు సమ్మక్క గద్దెపైకి కొబ్బరి కాయలు విసిరారు. అదే సమయంలో సీఎం రమణ్ సింగ్ అక్కడే ఉండటంతో కొబ్బరికాయలు వేగంగా వచ్చి పడ్డాయి. అయితే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆయన సురక్షితంగా అక్కడ నుంచి బయటపడ్డారు. దీంతో ఆయన సారలమ్మను దర్శించుకోకుండా తిరుగు ప్రయాణం అయ్యారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,గవర్నర్ నరసింహన్, కేంద్ర కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఓరం తదితరులు శుక్రవారం మేడారం జాతరకు రానున్నారు. ఈ నేపథ్యంలో గద్దెల ప్రాంగణం సమీపంలో తాత్కాలిక హెలిప్యాడ్‌లు నిర్మిస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.15 గంటలకు మేడారం చేరుకొని, 1.25 గంటలకు గద్దెల ప్రాంగణానికి వస్తారు. ఇరవై నిమిషాలపాటు అక్కడే ఉండి, సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.