కొండాయి నుంచి మేడారం వెళ్తున్న గోవిందరాజులు
ఏటూరునాగారం: సమ్మక్క మరిది గోవిందరాజులు బుధవారం మేడారానికి బయలుదేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో గోవిందరాజులు కొలువై ఉన్నారు. గుడిలో గోవిందరాజుల ప్రధాన పూజారి దబ్బగట్ల జనార్దన్, వడ్డె పొదెం బాబు, దబ్బగట్ల కిష్టయ్యలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముం దుగా గోవిందరాజుల ఆలయం వద్ద తహసీల్దార్ నరేందర్ సమక్షంలో దబ్బగట్ల వంశస్తులు గోవిందరాజులను వడ్డెలకు అప్పగించారు. డప్పుచపుళ్ల నడుమ గోవిందరాజుల పడగను వడ్డె పొదెం బాబు ఎత్తుకొని నాగుల చుట్టూ ప్రదక్షిణలు చేసి బయలుదేరడంతో భక్తులు, గ్రామస్తులు బెల్లపు శాకను ఆరబోశారు. నీళ్లతో స్వాగతం పలుకుతూ మల్యాలలోని సమ్మక్క గుడికి తీసుకెళ్లారు. వడ్డె పాదాలకు పసుపు, కుంకుమ్మపూసి దూపం వేసి పూజలు చేశారు. అనంతరం సమ్మక్కను సాదుకున్న మల్లెల మూర్తి ఇంటిలోకి కింద నేలను తాకకుండా చాపలు, చద్దర్లను వేసి లోనికి పూజారులు, వడ్డెలను పడగను పట్టుకొని వెళ్లడంతో వారి సంప్రదాయబద్ధంగా ముడుపులు చెల్లించి వడ్డెలకు పాలను ఇచ్చారు.
పాలు తాగిన వడ్డెలు మళ్లీ గోవిందరాజులను కొండాయికి తీసుకువచ్చేవరకు ఇలా ఉపవాసంతో ఉండడం వారి ఆనవాయితీగా వస్తోంది. గోవిందరాజులు వెళ్లే క్రమంలో అందరు నేలపై పడుకుంటే వారిపై నుంచి ఆయన దాటిపోతే సకల సౌభాగ్యాలు కలుగుతాయని వారి ప్రగాఢ నమ్మకం. అనంతరం అడవి మార్గంలో గోవిందరాజులను మేడారానికి తీసుకెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై బత్తుల సత్యనారాయణ, స్పెషల్ పార్టీ పోలీసులు భారీ బందోబస్తు నడుమ గోవిందరాజులను మేడారానికి సాగనంపారు. అంతేకాకుండా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో గ్రేహౌండ్స్ దళాలు అడవిలో పెద్ద ఎత్తున మోహరించాయి. కాగా గోవిందరాజులను తీసుకెళ్లే రోడ్డు మార్గం బాగాలేదని పూజారి దబ్బగట్ల గోవర్ధన్, అట్టం నాగరాజు, దబ్బగట్ల రాజారావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment