
ములుగులో బుధవారం ఉదయం భారీగా నిలిచిపోయిన వాహనాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: సారలమ్మ గద్దెలపైకి రావడానికి ముందే భక్తులు మేడారం చేరుకోవడం ఆనవాయితీ. మంగళవారం ఉదయం నుంచే మేడారం వచ్చే భక్తుల రాక మొదలై, మ«ధ్యాహ్నం సమయానికి రద్దీ పెరిగిపోయి సాయంత్రానికి పతాకస్థాయికి చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే ఆర్టీసీ 2,450 బస్సులు మేడారానికి కేటాయించింది. మరోవైపు ప్రైవేట్ వాహనాల ద్వారా వరంగల్ నుంచి మేడారం వచ్చే భక్తుల రద్దీ సాయంత్రానికి పెరిగింది. దీంతో వరంగల్–మేడారం మధ్య వాహనాల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. మేడారం వెళ్లే భక్తులు తొలి మొక్కులు గట్టమ్మ వద్ద చెల్లించుకోవడం ఆనవాయితీ. మేడారం వెళ్లే ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు గట్టమ్మ వద్ద ఆపారు. ఇక్కడ పార్కింగ్‌కు తక్కువ స్థలం కేటాయించడంతో వాహనాలు నిలిపేందుకు స్థలం లేదు. దీంతో గట్టమ్మ నుంచి వరంగల్ వైపు వాహనాలు జాకారం వరకు నిలిచిపోయాయి. దీంతో మంగళవారం సాయంత్రం 6:30 గంటలకే తొలిట్రాఫిక్ జామ్ ఎదురైంది.
కొరవడిన వ్యూహం
గట్టమ్మ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఇక్కడ వాహనాలు ఆపకుండా ముందుకు వెళ్లాలంటూ పోలీసులు ఆదేశించారు. దీంతో గట్టమ్మ దాటి ముందుకు వెళ్లిన వాహనదారులు డిగ్రీ కాలేజీ సమీపంలో ఆపి, వెనక్కి వచ్చి దర్శనాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆప్పటికే హన్మకొండ, వరంగల్, కాజీపేట బస్‌స్టేషన్లలో భక్తుల తాకిడి పెరిగిపోవడంతో మేడారం వెళ్లిన బస్సులు త్వరగా రావాలనే ఆదేశాలు ఆర్టీసీ సిబ్బందికి అందాయి. దీంతో మేడారం వెళ్లే వాహనాలు.. మేడారం నుంచి తిరుగుప్రయాణమైన ఆర్టీసీ బస్సులు, గట్టమ్మ దర్శనం కోసం నిలిపిన వాహనాలతో ములుగు నుంచి గట్టమ్మ వరకు రెండోసారి ట్రాఫిక్ జామ్ అయింది. మంగళవారం రాత్రి 9 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ములుగు, గట్టమ్మ, మల్లంపల్లి వరకు ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి.
మధ్యాహ్నం వరకు అదే పరిస్థితి..
బుధవారం నుంచి జాతర మొదలవడంతో అన్ని వైపుల నుంచి వాహనాల రద్దీ పెరిగిపోయింది. మంగళవారం సాయంత్రం మేడారం బయల్దేరిన వాహనాలు అప్పటికీ రోడ్లపై ఉన్నాయి. మంచిర్యాల, కరీంనగర్, గోదావరిఖని, భూపాలపల్లి, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు జంగాలపల్లి క్రాస్‌రోడ్డు వరకు వచ్చాయి. ఒక్కసారిగా పెరిగిన వాహనాలతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జాం అయింది. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు ట్రాఫిక్ అదుపులోకి రాలే దు. నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టింది. పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఉదయం 8 వరకు ట్రాఫిక్ క్లియర్ అయింది.
ప్రణాళిక లేమి..
మేడారం జాతరలో ట్రాఫిక్ నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. అయితే.. మేడారం వెళ్లే దారిలో హాల్టింగ్ పాయింట్ల ఏర్పాటు, నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. హాల్టింగ్ పాయింట్లకు సంబంధించి కనీస ప్రచారం నిర్వహించలేదు. వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టలేదు. çహాల్టింగ్ పాయింట్లలో కనీస సౌకర్యాలు లేవు. దీంతో మేడారం వెళ్లే వాహనదారులు మార్గమధ్యలో ఎక్కడా ఆగేందుకు ఆసక్తి చూపలేదు. మంగళవారం సాయంత్రం మేడారానికి పోటెత్తే వాహనాల రద్దీని అంచనా వేయడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. పోలీసుల ప్రణాళిక లేమి కారణంగానే ట్రాఫిక్ కష్టాలు వచ్చాయని భక్తులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment