
సాక్షి, న్యూఢిల్లీ: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం తెలిపారు. జాతర విశిష్టతను అన్ని గిరిజన ప్రాంతాల ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహిస్తామన్నారు. మేడారం జాతరకు జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల నుంచి గిరిజనులు లక్షల సంఖ్యలో హాజరవుతారు. దేశ వ్యాప్తంగా ప్రచారం కల్పించడంలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర నేతలు సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, లింగయ్య దొర, వినాయక్ నాయక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతర విశిష్టతను తెలిపేలా డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
అంతకుముందు ఉదయం బీజేపీ నేతలు 11 మంది కేంద్ర మంత్రులను కలసి జాతరకు ఆహ్వానించారు. జాతరకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించాలనే ఉద్దేశంతోనే కేంద్ర మంత్రులను ఆహ్వానించినట్టు మురళీధరరావు మీడియాకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో బీజేపీ తరఫున ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. యునెస్కొ గుర్తింపు లభించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు సంబంధించి ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను జాతరకు ఆహ్వానించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment