సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో కన్నెపల్లి ఆలయం వద్ద అధికారులతో మేయర్ నరేందర్
మేడారం: మేడారం సమక్క–సారలమ్మలను వనం నుంచి జనంలోకి తీసుకువచ్చే బృహత్తర ఘట్టంలో అవకాశం లభించడంతో తన జన్మ ధన్యమైందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. మేడారంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమ్మలను తీసుకొచ్చే బృందంలో తనకు చోటు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీనిని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయ ప్రస్థానంలో ఈ స్థాయికి చేరుకుని సేవలు అందించే భాగ్యం కలగడానికి కారణం అమ్మల ఆశీస్సులే అని అన్నారు. మేడారంలో ఉంటూ జాతరలో భక్తులకు సేవలు అందిస్తానని తాను ఊహించలేదన్నారు. మేడారంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లోని పారిశుద్ధ్య కార్మికులు తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు.
మేడారం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 56 స్వచ్ఛ ఆటోలు, 20 ట్యాంకర్లు, 600మంది పారిశుద్ధ్య కార్మికులు, 30మంది జవాన్లు, ఆరుగురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఒక సూపర్‌వైజర్‌తో పాటు ఎంహెచ్‌ఓలు జాతరలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారని మేయర్ చెప్పారు. ఇక నాలుగు రోజులుగా మేడారంలో సారలమ్మ, సమ్మక్క దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకునేందుకు తన వంతు బాధ్యతలను నిర్వర్తించినట్లు తెలిపారు. ఇక జాతరలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన, వసతులు ఏర్పాటు చేశామన్నారు. మూడు షిఫ్ట్‌ల్లో కార్మికులు జాతరలో పారిశుద్ధ్య సేవలు అందిస్తున్నారని, తాను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. కాగా, గత పాలకుల కంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మేడారం జాతరలో భక్తులకు ఎన్నో విధాలుగా సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. బంగారు తెలంగాణ సాధించుకున్న భక్తులకు అదే తరహాలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం సేవలు అందిస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment