Nannapuneni Narender
-
TS Election 2023: మరోసారి రహస్యంగా భేటీ అయిన ఏడుగురు కార్పొరేటర్లు!
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పు బీఆర్ఎస్ పార్టీలో ముసలం తారస్థాయికి చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తమ పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు పార్టీ మారతారంటూ తనకున్న సామాజిక మాధ్యమాలు, మీడియా సెంటర్ ద్వారా ప్రచారం చేయించి అగ్నికి ఆజ్యం పోస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. నాయకుడంటే అందరినీ కలుపుకొని పోవాలి కానీ తూర్పులో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొందని, అతను చెప్పిందానికి ఊ కొడితేనే సరి.. లేకపోతే పోలీస్స్టేషన్లలో లేనిపోని కేసులు నమోదవుతాయని, పార్టీ కార్యకర్తలని కూడా చూడకుండా పోలీసులతో కొట్టించిన సందర్భాలున్నాయని కొందరు కార్పొరేటర్లు వాపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ ఎంత దుష్ప్రచారం చేసినా.. పార్టీని వీడేదే లేదని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఏ అభ్యర్థిని రంగంలోకి దింపినా.. అతడికంటే నాలుగు రెట్లు ఎక్కువగా కష్టపడి గెలిపించేందుకు కృషి చేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం నగరంలోని ఓ ముఖ్య నేత ఇంట్లో తూర్పు బీఆర్ఎస్ ప్రధాన నాయకత్వంతోపాటు ఏడుగురు కార్పొరేటర్లు సమావేశమయ్యారు. వీరిలో గుండేటి నరేందర్ కుమార్, సయ్యద్ మసూద్, బైరబోయిన దామోదర్, సిద్దం రాజు, బస్వరాజు శ్రీమాన్, ఆకుతోట శిరీశ్, బస్వరాజ్ కుమార్ ఉన్నారు. ఒంటెద్దు పోకడలతో విరక్తి చెందే.. ‘ఎమ్మెల్యే ఎవరైనా ఉదయం లేవగానే సమస్యలతో వచ్చే ప్రజల కోసం గ్రీవెన్స్ నిర్వహిస్తుంటారు. తూర్పులో అలాంటి పరిస్థితి లేదు. ఉదయం 11 గంటలు దాటితే గానీ.. ఇంటి నుంచి బయటికెళ్లని పరిస్థితి ఉంది. ఎవరైనా వచ్చినా గంటల తరబడి వేచి చూసి ఎమ్మెల్యేను కలవకుండా వెళ్లిన సందర్భాలు అనేకం’ అని పలువురు కార్పొరేటర్లు చెబుతున్నారు. కార్పొరేటర్లుగా ప్రజలనుంచి చివా ట్లు చాలా ఎదురయ్యాయని, ఆయన ఒంటెద్దు పోకడలతో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎంపీ పసనూరి దయాకర్ తదితర ముఖ్య నేతలను కూడా పట్టించుకోకుండా అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తూ పార్టీని డిస్టర్బ్ చేస్తున్నార అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో డివిజన్లలో కార్పొరేటర్లకు సమాన స్థాయిలో నలుగురు కార్యకర్తలను పెట్టుకుని, వారికి నెలనెలా జీతాలు ఇస్తూ కార్పొరేటర్లను డమ్మీలు చేసే వ్యవస్థను నెలకొల్పారని వాపోతున్నారు. వారిని దగ్గరకు తీసి మార్కులు కొట్టేదామనుకుంటున్నారు.. తామేదో డబ్బుల కోసం ఆశపడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని, తమ డివిజన్లలో జరిగిన అభివృద్ధి పనుల్లో రావాల్సిన కమీషన్లు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల వద్ద తీసుకున్న ఎమ్మెల్యే.. శుక్రవారం కొందరికి ఇచ్చినట్టుగా తెలిసిందని వీరు అంటున్నారు. కేడాల జనార్దన్ హాజరైన గురు, శుక్రవారం సమావేశాల్లో నరేందర్ అభ్యర్థిత్వం మార్చాలని చెప్పిన రోజే.. అతడి భార్య కేడాల పద్మతోపాటు, పోశాల పద్మ, పల్లం పద్మ, కావేటి కవిత, మరిపల్లి రవి, దిడ్డి కుమారస్వామి ఎమ్మెల్యే నరేందర్‌ను కలిసి తమ పనులు చేసుకున్నారన్న ప్రచారం కోడై కూస్తోంది. వీరిచ్చిన సపోర్ట్‌తోనే ఎమ్మెల్యే అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేదామనుకుంటున్నారని, ఎమ్మె ల్యే గొప్ప నాయకుడు అంటూ వారి వాయిస్‌లు తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. తాము ఉద్య మ సమయాల్లో ఆత్మగౌరవంతో బతికినవాళ్లమని, ప్రశ్నించినా కార్యకర్తలపై సొంత పార్టీ అని చూడకుండా కేసులు పెట్టించి మరీ చిత్రహింసలకు గురి చేశారని అసంతృప్త కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో సైని కుల్లా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో అధిష్టానం పునరాలోచన చేస్తే గెలుపు అవకాశాలు సులభంగా ఉంటాయని నిర్ణయానికి వచ్చారు. వీరి విజ్ఞాపనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అందరినీ కలుపుకొని పోయే నేతను ప్రకటించాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. -
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నెక్స్ట్ లీడర్ ఎవరు..?
వరంగల్ తూర్పు నియోజకవర్గం వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన నన్నపునేని నరేందర్ విజయం సాదించారు. వరంగల్ మేయర్‌గా ఉన్న నరేందర్ 2018లో అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది పి.రవిచంద్రపై 28142 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. తొలిసారి నరేందర్ గెలు పొందారు. ఆయనకు 82461 ఓట్లు రాగా, రవిచంద్రకు 54225 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన కె.సతీష్‌కు సుమారు 4700 ఓట్లు వచ్చాయి. నన్నపునేని నరేందర్ మున్నూరు కాపు వర్గానికి చెందినవారు. 2014లో మాజీ మంత్రి కొండా సురేఖ టిఆర్ఎస్లో చేరి అప్పట్లో మంత్రిగా ఉన్న బసవరాజు సారయ్యను 55085 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. సురేఖ రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఉమ్మడి ఏపిలో 2009 లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత, రోశయ్య మంత్రి వర్గంలో ఉంటూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌కు మద్దతుగా పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్‌లో కొంతకాలం కీలక నేతగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు గాను ఆమెపై అనర్హత వేటు పడిరది. తదుపరి పరకాలకు జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేసి సుమారు 1500 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. తదుపరి తెలంగాణ అంశంలో జగన్ తో వచ్చిన విబేధాల కారణంగా ఆ పార్టీ నుంచి బయటపడి మళ్లీ కాంగ్రెస్ ఐ లో చేరారు. అక్కడ ఇమడలేక 2014 ఎన్నికల ముందు టిఆర్ఎస్లో చేరి వరంగల్ తూర్పు సీటును తీసుకుని గెలుపొందారు. ఒకప్పుడు ఈమెకు టిఆర్ఎస్ నాయకులకు, కెసిఆర్‌కు ఉప్పు, నిప్పుగా ఉండేది. అలాంటిది ఆమె ఈ పార్టీ లోకి వచ్చి గెలుపొందడం విశేషం. గతంలో ఆమె శాయంపేట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కాని ఆ నియోజకవర్గం 2009లో రద్దు అయింది.బసవరాజు సారయ్య మూడుసార్లు ఎన్నికయ్యారు. రజక వర్గానికి చెందిన సారయ్య ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందారు. వరంగల్‌లో ఒకసారి గెలిచిన టి. పురుషోత్తంరావు గతంలోవర్ధన్నపేట నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 1962లో ఇండిపెండెంటుగా గెలిచిన బి. నాగభూషణరావు 1983, 85లలో టిడిపి తరుపున గెలుపొందారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు ఎమ్.ఎస్.రాజలింగం ఇక్కడ ఒకసారి, చిల్లంచెర్లలో మరోసారి గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన మీర్జాబేగ్, మరోసారి హనుమకొండలో నెగ్గారు. పురుషోత్తంరావు గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలోమంత్రిగా ఉండగా, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, రిమోట్ఏరియా అభివృద్ధి కమిటీ ఛ్కెర్మన్ పదవి ఇచ్చారు. వరంగల్ , వరంగల్ తూర్పు నియోజకవర్గాలలో కలిపి ఒకసారి రెడ్డి, ఆరుసార్లు బిసి నేతలు,ఐదుసార్లు బ్రాహ్మణ, ఒకసారి వెలమ,ఒకసారి ముస్లిం,ఒకసారి కమ్మ సామాజికవర్గం నేతలు గెలిచారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కేటీఆర్ అసంతృప్తి.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్
-
కేటీఆర్‌కు నిరసన సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన మంత్రి
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. జిల్లాలోని మానుకోటలో రూ. 50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ప్రారంభించారు. అంతేకాకుండా పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అయితే పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభించేందుకు వెళ్తున్న కేటీఆర్‌తో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా ఆగ్రహంతో ఎమ్మెల్యే చేయిని మంత్రి తీసి పడేశారు. కేటీఆర్ సీరియస్‌గా షాక్ ఇవ్వడంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తోపాటు అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఇక పోడు పట్టాల పంపిణీ సభా వేదికపై కేటీఆర్‌కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పుష్పగుచ్చం ఇచ్చేందుకు ప్రయత్నించగా తిరస్కరించారు. సభాముఖంగా జరిగిన అవమానంతో ఎమ్మెల్యే నరేందర్ వేదికపై చిన్నబోయి కూర్చున్నాడు. అయితే పట్టణంలో పర్యటించిన కేటీఆర్‌కు జర్నలిస్టులతో పాటు పలువురు నిరసన వ్యక్తం చేయడంతో కేటీఆర్ అసహనానికి గురైనట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. చదవండి: ‘పొత్తుల కోసం వెంపర్లాడం.. కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తాం’ -
ఎమ్మెల్యే సతమతం.. కేటీఆర్ మాటల వెనుక మర్మమేంటి?
అనుకున్నది ఒక్కటి. .అయింది మరొక్కటి అన్నట్లుంది వరంగల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే పరిస్థితి. యువరాజు దృష్టిని ఆకర్షించి అభ్యర్థిత్వం ఖరారు చేసుకోవాలనుకున్న ఎమ్మెల్యే ఆశ నీరాశగా మారింది. టికెట్‌పై భరోసా లేక విపక్షాలతో పాటు సపక్ష నేతల విమర్శలు ఎదుర్కునే దుస్థితి ఏర్పడింది. రాజకీయ విమర్శల దాటికి ఎమ్మెల్యే సతమతమవుతూ విందు రాజకీయాలకు తెరలేపారు. వన్ మ్యాన్ షోకే అసలుకే ఎసరొచ్చే పరిస్థితి ఏర్పడడంతో అందరు నా వాళ్ళని నిరూపించుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారట. ఎవరా ఎమ్మెల్యే?.. ఏమిటా కథ! ఎమ్మెల్యేను అయోమయానికి గురిచేస్తున్న గ్రూప్ రాజకీయాలు వరంగల్ తూర్పు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ను గ్రూప్ రాజకీయాలు, విపక్షాల దూకుడు అయోమయానికి గురి చేస్తున్నాయి. గులాబీ గూటిలో గ్రూప్ రాజకీయాలు చాపకింద నీరులా మారి యువరాజు మంత్రి కేటిఆర్ సమక్షంలో బహిర్గతమై రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎమ్మెల్యే నరేందర్ వ్యవహరశైలి, బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలను పసిగట్టిన మంత్రి కేటీఆర్.. టికెట్ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. టచ్‌లో పదిమంది కార్పొరేటర్లు కేసీఆర్ ఆశీర్వాదం ఉంటే.. ప్రజల అండదండలుంటే మరోసారి మంచి మెజారిటీతో గెలిచిరావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని కేటిఆర్ మాట్లాడడం వెనుక ఉన్న అంతర్యం అదేనా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దానికి కొనసాగింపుగా వరంగల్ వేదికగా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పదిమంది అధికారపార్టీ కార్పొరేటర్లు తమతో టచ్‌లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. చదవండి: HYD: మహిళా కార్పొరేటర్‌తో BRS కీలక నేత అసభ్యకర వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ అధిష్టానం ముందే పసిగట్టి అభ్యర్థిత్వం ఖరారు విషయంలో క్లారిటీ ఇవ్వలేదనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణితో పాటు ఎంతో మంది ముఖ్యనేతలకు వరంగల్ నుంచి సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చారంటూ సభా వేదికగా మంత్రి కేటీఆర్ అనడాన్ని బట్టి చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీకి చాలామంది అర్హులున్నారని చెప్పకనే చెప్పినట్లైందన్న టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. అందరినీ కలుపుకునిపోయేవారికి అండదండలుంటాయని, వన్ మ్యాన్ షోకు అస్కారం ఉండదని మంత్రి కేటీఆర్ మాటల వెనుక మర్మమమని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. బుజ్జగింపు పర్వం వరంగల్ తూర్పులో మంత్రి కేటీఆర్ పర్యటన తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇన్నాళ్లూ వన్ మ్యాన్ షోను తలపించిన గులాబీ పార్టీలో అనుకొని విందులు, కళలో కూడా అనుకొని అతిథులకు ఇస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే గతంలో కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే వ్యవహరశైలిపై అసంతప్తితో జట్టుగా ఏర్పడి పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారని పలుమార్లు చర్చల్లోకి వచ్చింది. అయినా అప్పుడూ ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవన్న ప్రచారం ఉంది. తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పదిమంది అధికార పార్టీ కార్పొరేటర్లు తనకు టచ్‌లో ఉన్నారని చెప్పడం, అప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ నుంచి భరోసా రాకపోవడంతో స్థానిక నేతల బుజ్జగింపు పర్వానికి తెరలేపారని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఖరీదైన మందుతో విందు ఓవైపు ఏదిఏమైనా ఇన్నాళ్లూ కనుసైగతో కార్పొరేటర్లను అన్ని విధాలుగా కట్టడి చేసినా సదరు నేత.. ఇప్పుడూ ఆత్మరక్షణలో పడి వారి ప్రసన్నం కోసం దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందరి మద్దతు తనకే ఉందని చెప్పడం ద్వారా అధిష్టానం వద్ద ముఖ్యంగా సీఎం కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేసి తిరిగి టికెట్ తెచ్చుకునే వ్యూహలను అమలు చేస్తున్నారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ బహిరంగసభ విజయవంతం చేశారని మహిళా కార్పొరేటర్ల భర్తలు, కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులకు వరంగల్‌లోని ఓ కన్వెన్షన్ హాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఖరీదైన మందుతో విందు ఇవ్వడం హట్ టాపిక్‌గా మారింది. చదవండి: కేసీఆర్‌కు అంత సీన్ లేదు.. పవార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇద్దరు కార్పొరేటర్ల డుమ్మా అయితే ఎన్నికల వరకు ఎవరూ చేజారకుండా ఉండేందుకే ఈ విందన్న ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఇన్నాళ్లూ గ్రూప్ రాజకీయాలు చేసి కొందరిని పార్టీ నుంచి బయటకు పంపడం ద్వారా తనకు తిరుగులేదనుకున్న ఆ నేతకు ఇప్పుడూ ఎదురుగాలి రావడంతో ఆగమాగం అవుతున్నారన్న చర్చ సాగుతోంది. ఇద్దరు కార్పొరేటర్లు తప్ప మిగతావారందరూ హజరయ్యారని తెలిసింది. అయితే హజరైనవారిలో ఎంతమంది ఆయన వెంట నడుస్తారోనన్న చర్చ కూడా జరుగుతోంది. టికెట్ విషయంలో నో క్లారిటీ వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి, పరకాల, పాలకూర్తి బీఆర్ఎస్ అభ్యర్థులను అక్కడ జరిగిన బహిరంగసభలో జనం సాక్షిగా గెలిపించాలంటూ మంత్రి కేటీఆర్ ప్రకటనలు చేసి వారికి టికెట్ ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. ఇదే తరహాలో వరంగల్ తూర్పులో జరిగిన బీఆర్ఎస్ బహిరంగసభలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో రాజకీయవర్గాల్లో పెద్ద చర్చ సాగుతోంది. ఇంటివాళ్లం కాదా.. మందిమా? ఇదే సమయంలో మందికి టికెట్లు ప్రకటిస్తారు...ఇంటొనికి టికెట్ ప్రకటించాల్సిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే నరేందర్ చేసిన వ్యాఖ్యలు గులాబీ గూటిలో పెద్ద రచ్చకు దారితీశాయి. అంటే మేం పార్టీ వాళ్లం కాదా.. మేం గులాబీ ఇంటివాళ్లం కాదా.. మందిమా.. ఆయనొక్కడే ఇంటివాడా అంటూ టికెట్ దక్కించుకున్న నాయకులు, వారి అనుచరులు లోలోన రగిలిపోతున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యలంతా ఈ వ్యాఖ్యలను అధిష్టానం దష్టికి తీసుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే టికెట్‌పై స్పష్టత లేని ఎమ్మెల్యే నరేందర్‌కు ఈ వ్యాఖ్యలు మరింత ప్రతిబంధకంగా మారాయని గులాబీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల మార్పు 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మారుస్తూ వస్తోంది. 2009లో విద్యాసాగర్ పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కొండా సురేఖ గెలిచారు. అయినా కూడా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నన్నపునేని నరేందర్‌కు అవకాశం ఇవ్వడంతో విజయం సాధించారు. అయితే వరంగల్ తూర్పులో ప్రతిసారి అభ్యర్థి గెలిచినా కూడా మారుస్తూ వస్తున్న గులాబీ పార్టీ ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తుందా అన్న చర్చ మంత్రి కేటీఆర్ పర్యటన తర్వాత జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల పనితీరు బేరీజు వేసుకొని మరోసారి మా ఎమ్మెల్యేను భారీ మెజారిటీతో గెలిపించుకొండి అంటూ చెబుతూ వస్తున్నా.. వరంగల్ తూర్పులో స్పష్టత ఇవ్వకపోవడంపై రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ఇక్కడి నుంచి టికెట్ దక్కించుకునేందుకు ఇతర ముఖ్య నేతలకు ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయనే ఇండికేషన్ రావడంతో లాబీయింగ్ మొదలెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోతే అయితే కేసీఆర్ ఆశీర్వాదం ఉంటేనే అనే మాట కేటీఆర్ నుంచి రావడంతో పెద్దాయన వద్ద తమ బలబలాలు అధినేతకు తెలిసేలా కొందరు పావులు కదుపుతున్నారు. ఒకవేళ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోతే రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, రాజనాల శ్రీహరితో పాటు ఓ బడా వ్యాపారవేత్త పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు ఎటు వైపు దారి తీస్తాయోనని ఓరుగల్లు ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. -
మేం పార్టీ వాళ్లం కాదా.. మేం గులాబీ ఇంటివాళ్లం కాదా.. మందిమా?
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పులో మంత్రి కేటీఆర్ పర్యటన తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇన్నాళ్లు ఇక్కడ వన్‌మ్యాన్ షోను తలపించిన గులాబీ పార్టీలో కలలో కూడా అనుకొని అతిథులకు విందులు ఇస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే వ్యవహారశైలిపై అసంతృప్తితో జట్టుగా ఏర్పడి పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారని పలుమార్లు చర్చల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవన్న ప్రచారం ఉంది. తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పది మంది అధికార పార్టీ కార్పొరేటర్లు తనకు టచ్‌లో ఉన్నారని చెప్పడం, అప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ నుంచి భరోసా రాకపోవడంతో స్థానిక నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు కనుసైగతో కార్పొరేటర్లను అన్ని విధాలుగా కట్టడి చేసిన సదరు నేత.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడి వారి ప్రాపకం కోసం దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ ఉంది. వీరందరి మద్దతు తనకే ఉందని చెప్పడం ద్వారా అధిష్టానం వద్ద ముఖ్యంగా సీఎం వద్ద మార్కులు కొట్టేసి తిరిగి టికెట్ తెచ్చుకునే వ్యూహాలను అమలు చేస్తున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతం చేశారని మహిళా కార్పొరేటర్ల భర్తలు, కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులకు ఆదివారం రాత్రి వరంగల్‌లోని ఓ కన్వెన్షన్ హాల్లో ఖరీదైన మందుతో విందు ఇవ్వడం హట్‌టాపిక్‌గా మారింది. మహిళా కార్పొరేటర్లు కూడా హాజరై భోజనం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వరకు ఎవరూ చేజారకుండా ఉండేందుకే ఈ విందు ఇచ్చారని తెలుస్తోంది. ఏదేమైనా ఇన్నాళ్లు గ్రూప్ రాజకీయాలు చేసి కొందరిని పార్టీ నుంచి బయటకు పంపడం ద్వారా తనకు తిరుగులేదనుకున్న ఆ నేతకు ఇప్పుడు ఎదురుగాలి రావడంతో ఆగమాగం అవుతున్నారన్న చర్చ సాగుతోంది. ఇద్దరు కార్పొరేటర్లు తప్ప మిగతావారంతా హాజరయ్యారని తెలిసింది. అయితే హాజరైనవారిలో ఎంతమంది ఆయన వెంట నడుస్తారోనన్న చర్చ కూడా జరుగుతోంది. మేం మందిమా.. ఇవేం వ్యాఖ్యలు ములుగు, భూపాలపల్లి, వరంగల్ పశ్చిమ, పరకాల బీఆర్ఎస్ అభ్యర్థులను అక్కడ జరిగిన బహిరంగసభల్లో జనం సాక్షిగా గెలిపించాలంటూ మంత్రి కేటీఆర్ ప్రకటనలు చేసి వారికి టికెట్ ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. ఇదే తరహాలో వరంగల్ తూర్పులో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ సాగుతోంది. ఇదే సమయంలో ‘మందికి టికెట్లు ప్రకటిస్తారు.. ఇంటొని టికెట్ ప్రకటించాల్సి న అవసరం లేదు’ అంటూ ఓ చానల్‌తో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నరేందర్ చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీల్లో పెద్ద రచ్చకు దారి తీశాయి. అంటే మేం పార్టీ వాళ్లం కాదా.. మేం గులాబీ ఇంటివాళ్లం కాదా.. మందిమా? ఆయనొక్కడే ఇంటివాడా అంటూ టికెట్‌పై భరోసా ఉన్న నాయకులు రగిలిపోతున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యులు ఈవ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. టికెట్‌పై స్పష్టత లేని ఎమ్మెల్యే నరేందర్‌కు ఈవ్యాఖ్యలు మరింత ప్రతిబంధకంగా మారాయని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
‘డబ్బులు పెట్టి బెదిరించి ఎమ్మెల్సీ అయ్యాడు’
సాక్షి, హైదరాబాద్ : ఆత్మగౌరవం అనే మాటకు అర్హతలేని వారు కొండా దంపతులని టీఆర్ఎస్ నాయకుడు బస్వరాజ్ సారయ్య విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా దంపతులు ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై నియోజకవర్గంలో తిరగలేదన్నారు. కొండా సురేఖ నేతృత్వంలో ఏక్కరు కూడా బాగుపడలేదన్నారు. గతంలో టీడీపీలో ఉండి తుపాకితో కుక్కను కాల్చి సర్పంచ్ అయిన వ్యక్తి కొండా మురళి అని, అలాంటి వారు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని విడ్డూరంగా ఉందన్నారు. ఆత్మగౌరవం అంటే ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా మురళి డబ్బులు పెట్టి, బెదిరించి ఎమ్మెల్సీ అయ్యాడని ఆరోపించారు. కొండా దంపతులకు రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెడితే, కేసీఆర్ పునర్జన్మ ఇచ్చారన్నారు. గతంలో ఈ మాట సురేఖనే అన్నారని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శించడంసబబు కాదన్నారు. తెలంగాణ అని పలికే అర్హత కొండా దంపతులకు లేదన్నారు. కొండా దంపతులను వరంగల్ నుంచి కాదు కదా తెలంగాణ నుంచే తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు, కేటీఆర్ వేరు వేరు గ్రూపులు కాదన్నారు. కాంగ్రెస్‌లోలాగా టీఆర్ఎస్లో ఎలాంటి గ్రూపులు లేవని సారయ్య పేర్కొన్నారు. లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాం : నన్నపునేని నరేందర్ ప్రపంచంలో ఆత్మగౌరవం అనే మాటకు అర్హత లేని వారు ఎవరైనా ఉన్నారంటే అది కొండా దంపతులు మాత్రమేనని వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ ఎద్దేవా చేశారు. దొర పాలన చేసేది సురేఖ కుటుంబమేనని విమర్శించారు. ఈ కాలం పిల్లలకు దొర అంటే మీ భర్తనే చూపించాలని ఎద్దేవా చేశారు. కొండా సురేఖ నాన్న చనిపోతే ఆమె భర్తే రాలేదని, కేసీఆర్ ఎలా వస్తారని ప్రశ్నించారు. తూర్పు నియోజక వర్గంలోని ప్రజలంతా ఆత్మ గౌరవంతోనే బతుకుతున్నారన్నారు. 2019వరకూ కొండా దంపతులు రాజకీయ సమాధి కాబోతున్నారని వ్యాఖ్యానించారు. కొండా దంపతులకు నిజంగా రాజకీయ బలం ఉంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటి చేయాలని సవాల్ చేశారు. టీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలోకి దిగినా కొండా సురేఖపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తప్పు చేసింది.. ఆ నూటైదుమంది కన్నాహీనమా నేను! -
నా జన్మ ధన్యమైంది...
మేడారం: మేడారం సమక్క–సారలమ్మలను వనం నుంచి జనంలోకి తీసుకువచ్చే బృహత్తర ఘట్టంలో అవకాశం లభించడంతో తన జన్మ ధన్యమైందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. మేడారంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమ్మలను తీసుకొచ్చే బృందంలో తనకు చోటు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీనిని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయ ప్రస్థానంలో ఈ స్థాయికి చేరుకుని సేవలు అందించే భాగ్యం కలగడానికి కారణం అమ్మల ఆశీస్సులే అని అన్నారు. మేడారంలో ఉంటూ జాతరలో భక్తులకు సేవలు అందిస్తానని తాను ఊహించలేదన్నారు. మేడారంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లోని పారిశుద్ధ్య కార్మికులు తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. మేడారం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 56 స్వచ్ఛ ఆటోలు, 20 ట్యాంకర్లు, 600మంది పారిశుద్ధ్య కార్మికులు, 30మంది జవాన్లు, ఆరుగురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఒక సూపర్వైజర్తో పాటు ఎంహెచ్ఓలు జాతరలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారని మేయర్ చెప్పారు. ఇక నాలుగు రోజులుగా మేడారంలో సారలమ్మ, సమ్మక్క దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకునేందుకు తన వంతు బాధ్యతలను నిర్వర్తించినట్లు తెలిపారు. ఇక జాతరలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన, వసతులు ఏర్పాటు చేశామన్నారు. మూడు షిఫ్ట్‌ల్లో కార్మికులు జాతరలో పారిశుద్ధ్య సేవలు అందిస్తున్నారని, తాను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. కాగా, గత పాలకుల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మేడారం జాతరలో భక్తులకు ఎన్నో విధాలుగా సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. బంగారు తెలంగాణ సాధించుకున్న భక్తులకు అదే తరహాలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం సేవలు అందిస్తోందని చెప్పారు. -
అసలు నాయినికి టికెట్ వస్తుందా..
న్యూశాయంపేట: కాకతీయ యూనివర్సిటీ భూముల కబ్జాపై ఫైలును తిరగతోడి కలెక్టర్, జేసీ, ఏడీ ల్యాండ్ సర్వే, ఆర్డీఓలతో ప్రత్యేక కమిటీవేసి కబ్జాకోరుల భరతం పడుతామని గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.హన్మకొండ నయింనగర్‌లోని అర్బన్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల కళ్లు కుట్టి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటిఆర్ కార్టూన్ కాదని కడిగిన ముత్యం అని అభివర్ణించారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్పై నాయిని లేని పోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. 2019లో అసలు నాయిని రాజేందర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా లేదా తెలుసుకొని వినయ్‌భాస్కర్ గురించి మాట్లాడాలన్నారు. కుడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజల కష్టాలను తెలుసుకొని ముందుకు సాగుతున్న వినయ్భాష్కర్పై ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ తరపున టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే గెలిస్తే తాను రాజకీయాల్లోంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు. విలేకరుల సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మహ్మద్ అజీజ్‌ఖాన్, తాడు గౌరవ అధ్యక్షుడు గుడిమళ్ల రవికుమార్, కార్పొరేటర్లు వద్దిరాజు గణేష్,వీరగంటి రవిందర్,జోరిక రమేష్, టిఆర్ఎస్వి నేతలు కంచర్ల మనోజ్,ప్రవీణ్,చాగంటి రమేష్, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు. కమిటీని స్వాగతిస్తాం : నాయిని కాకతీయ యూనివర్సిటీ భూముల కుంభకోణంపై వేయబోతున్న కమిటీని స్వాగతిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. కేయూ భూముల కుంభకోణంపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ ప్రకటించడంపై ఆయన స్పందిం చారు. ఈ మేరకు ‘సాక్షి’కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పా రు. కాకతీయ యూనివర్సిటీ భూముల కుంభకోణంపై వేయబోతున్న కమిటీకి స్వాగతిస్తున్నాం. కమిటీలో ఇద్దరు విద్యార్థి సంఘ నాయకులు, ఇద్దరు అధ్యాపకులను సభ్యులుగా చేర్చాలి. విచారణ జరిగేంత వరకు కేయూ ఆర్చి గేటుదగ్గర చెప్పుల దండ ఉంచాలి..దోషులుగా తేలిన వారి మెడలో ఆ దండ వేసి ఊరేగించాలని పేర్కొన్నారు. -
వరంగల్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
హైదరాబాద్ : వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్‌గా నన్నపనేని నరేందర్, డిప్యూటీ మేయర్ గా సిరాజుద్దీన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం 58 డివిజన్ల కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రెసిడింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు గుండు సుధారాణి, దయాకర్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్, ధర్మారెడ్డి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. మేయర్ ఎన్నిక సందర్భంగా తెరాస శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. గ్రేటర్ వరంగల్‌లో 58 డివిజన్లకు గానూ 44 డివిజన్లలో టీఆర్ఎస్ గెలుపొందిన విషయం విదితమే. నరేందర్ 19వ డివిజన్ నుంచి పోటీ చేసి 881 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిరాజుద్దీన్ 41వ డివిజన్ నుంచి బరిలో నిలిచి గెలిచారు.