అనుకున్నది ఒక్కటి. .అయింది మరొక్కటి అన్నట్లుంది వరంగల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే పరిస్థితి. యువరాజు దృష్టిని ఆకర్షించి అభ్యర్థిత్వం ఖరారు చేసుకోవాలనుకున్న ఎమ్మెల్యే ఆశ నీరాశగా మారింది. టికెట్‌పై భరోసా లేక విపక్షాలతో పాటు సపక్ష నేతల విమర్శలు ఎదుర్కునే దుస్థితి ఏర్పడింది. రాజకీయ విమర్శల దాటికి ఎమ్మెల్యే సతమతమవుతూ విందు రాజకీయాలకు తెరలేపారు. వన్ మ్యాన్ షోకే అసలుకే ఎసరొచ్చే పరిస్థితి ఏర్పడడంతో అందరు నా వాళ్ళని నిరూపించుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారట. ఎవరా ఎమ్మెల్యే?.. ఏమిటా కథ!
ఎమ్మెల్యేను అయోమయానికి గురిచేస్తున్న గ్రూప్ రాజకీయాలు
వరంగల్ తూర్పు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ను గ్రూప్ రాజకీయాలు, విపక్షాల దూకుడు అయోమయానికి గురి చేస్తున్నాయి. గులాబీ గూటిలో గ్రూప్ రాజకీయాలు చాపకింద నీరులా మారి యువరాజు మంత్రి కేటిఆర్ సమక్షంలో బహిర్గతమై రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎమ్మెల్యే నరేందర్ వ్యవహరశైలి, బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలను పసిగట్టిన మంత్రి కేటీఆర్.. టికెట్ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
టచ్‌లో పదిమంది కార్పొరేటర్లు
కేసీఆర్ ఆశీర్వాదం ఉంటే.. ప్రజల అండదండలుంటే మరోసారి మంచి మెజారిటీతో గెలిచిరావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని కేటిఆర్ మాట్లాడడం వెనుక ఉన్న అంతర్యం అదేనా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దానికి కొనసాగింపుగా వరంగల్ వేదికగా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పదిమంది అధికారపార్టీ కార్పొరేటర్లు తమతో టచ్‌లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
చదవండి: HYD: మహిళా కార్పొరేటర్‌తో BRS కీలక నేత అసభ్యకర వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ అధిష్టానం ముందే పసిగట్టి అభ్యర్థిత్వం ఖరారు విషయంలో క్లారిటీ ఇవ్వలేదనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణితో పాటు ఎంతో మంది ముఖ్యనేతలకు వరంగల్ నుంచి సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చారంటూ సభా వేదికగా మంత్రి కేటీఆర్ అనడాన్ని బట్టి చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీకి చాలామంది అర్హులున్నారని చెప్పకనే చెప్పినట్లైందన్న టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. అందరినీ కలుపుకునిపోయేవారికి అండదండలుంటాయని, వన్ మ్యాన్ షోకు అస్కారం ఉండదని మంత్రి కేటీఆర్ మాటల వెనుక మర్మమమని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.
బుజ్జగింపు పర్వం
వరంగల్ తూర్పులో మంత్రి కేటీఆర్ పర్యటన తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇన్నాళ్లూ వన్ మ్యాన్ షోను తలపించిన గులాబీ పార్టీలో అనుకొని విందులు, కళలో కూడా అనుకొని అతిథులకు ఇస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే గతంలో కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే వ్యవహరశైలిపై అసంతప్తితో జట్టుగా ఏర్పడి పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారని పలుమార్లు చర్చల్లోకి వచ్చింది.
అయినా అప్పుడూ ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవన్న ప్రచారం ఉంది. తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పదిమంది అధికార పార్టీ కార్పొరేటర్లు తనకు టచ్లో ఉన్నారని చెప్పడం, అప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ నుంచి భరోసా రాకపోవడంతో స్థానిక నేతల బుజ్జగింపు పర్వానికి తెరలేపారని పొలిటికల్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే ఖరీదైన మందుతో విందు
ఓవైపు ఏదిఏమైనా ఇన్నాళ్లూ కనుసైగతో కార్పొరేటర్లను అన్ని విధాలుగా కట్టడి చేసినా సదరు నేత.. ఇప్పుడూ ఆత్మరక్షణలో పడి వారి ప్రసన్నం కోసం దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందరి మద్దతు తనకే ఉందని చెప్పడం ద్వారా అధిష్టానం వద్ద ముఖ్యంగా సీఎం కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేసి తిరిగి టికెట్ తెచ్చుకునే వ్యూహలను అమలు చేస్తున్నారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ బహిరంగసభ విజయవంతం చేశారని మహిళా కార్పొరేటర్ల భర్తలు, కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులకు వరంగల్లోని ఓ కన్వెన్షన్ హాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఖరీదైన మందుతో విందు ఇవ్వడం హట్ టాపిక్‌గా మారింది.
చదవండి: కేసీఆర్‌కు అంత సీన్ లేదు.. పవార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇద్దరు కార్పొరేటర్ల డుమ్మా
అయితే ఎన్నికల వరకు ఎవరూ చేజారకుండా ఉండేందుకే ఈ విందన్న ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఇన్నాళ్లూ గ్రూప్ రాజకీయాలు చేసి కొందరిని పార్టీ నుంచి బయటకు పంపడం ద్వారా తనకు తిరుగులేదనుకున్న ఆ నేతకు ఇప్పుడూ ఎదురుగాలి రావడంతో ఆగమాగం అవుతున్నారన్న చర్చ సాగుతోంది. ఇద్దరు కార్పొరేటర్లు తప్ప మిగతావారందరూ హజరయ్యారని తెలిసింది. అయితే హజరైనవారిలో ఎంతమంది ఆయన వెంట నడుస్తారోనన్న చర్చ కూడా జరుగుతోంది.
టికెట్ విషయంలో నో క్లారిటీ
వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి, పరకాల, పాలకూర్తి బీఆర్ఎస్ అభ్యర్థులను అక్కడ జరిగిన బహిరంగసభలో జనం సాక్షిగా గెలిపించాలంటూ మంత్రి కేటీఆర్ ప్రకటనలు చేసి వారికి టికెట్ ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. ఇదే తరహాలో వరంగల్ తూర్పులో జరిగిన బీఆర్ఎస్ బహిరంగసభలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో రాజకీయవర్గాల్లో పెద్ద చర్చ సాగుతోంది.
ఇంటివాళ్లం కాదా.. మందిమా?
ఇదే సమయంలో మందికి టికెట్లు ప్రకటిస్తారు...ఇంటొనికి టికెట్ ప్రకటించాల్సిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే నరేందర్ చేసిన వ్యాఖ్యలు గులాబీ గూటిలో పెద్ద రచ్చకు దారితీశాయి. అంటే మేం పార్టీ వాళ్లం కాదా.. మేం గులాబీ ఇంటివాళ్లం కాదా.. మందిమా.. ఆయనొక్కడే ఇంటివాడా అంటూ టికెట్ దక్కించుకున్న నాయకులు, వారి అనుచరులు లోలోన రగిలిపోతున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యలంతా ఈ వ్యాఖ్యలను అధిష్టానం దష్టికి తీసుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే టికెట్‌పై స్పష్టత లేని ఎమ్మెల్యే నరేందర్‌కు ఈ వ్యాఖ్యలు మరింత ప్రతిబంధకంగా మారాయని గులాబీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి.
మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల మార్పు
2009 నుంచి ఇప్పటివరకు జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మారుస్తూ వస్తోంది. 2009లో విద్యాసాగర్ పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కొండా సురేఖ గెలిచారు. అయినా కూడా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నన్నపునేని నరేందర్‌కు అవకాశం ఇవ్వడంతో విజయం సాధించారు. అయితే వరంగల్ తూర్పులో ప్రతిసారి అభ్యర్థి గెలిచినా కూడా మారుస్తూ వస్తున్న గులాబీ పార్టీ ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తుందా అన్న చర్చ మంత్రి కేటీఆర్ పర్యటన తర్వాత జోరుగా సాగుతోంది.
ఎందుకంటే ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల పనితీరు బేరీజు వేసుకొని మరోసారి మా ఎమ్మెల్యేను భారీ మెజారిటీతో గెలిపించుకొండి అంటూ చెబుతూ వస్తున్నా.. వరంగల్ తూర్పులో స్పష్టత ఇవ్వకపోవడంపై రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ఇక్కడి నుంచి టికెట్ దక్కించుకునేందుకు ఇతర ముఖ్య నేతలకు ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయనే ఇండికేషన్ రావడంతో లాబీయింగ్ మొదలెట్టారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోతే
అయితే కేసీఆర్ ఆశీర్వాదం ఉంటేనే అనే మాట కేటీఆర్ నుంచి రావడంతో పెద్దాయన వద్ద తమ బలబలాలు అధినేతకు తెలిసేలా కొందరు పావులు కదుపుతున్నారు. ఒకవేళ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోతే రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, రాజనాల శ్రీహరితో పాటు ఓ బడా వ్యాపారవేత్త పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు ఎటు వైపు దారి తీస్తాయోనని ఓరుగల్లు ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment