సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పులో మంత్రి కేటీఆర్ పర్యటన తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇన్నాళ్లు ఇక్కడ వన్‌మ్యాన్ షోను తలపించిన గులాబీ పార్టీలో కలలో కూడా అనుకొని అతిథులకు విందులు ఇస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే వ్యవహారశైలిపై అసంతృప్తితో జట్టుగా ఏర్పడి పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారని పలుమార్లు చర్చల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవన్న ప్రచారం ఉంది.
తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పది మంది అధికార పార్టీ కార్పొరేటర్లు తనకు టచ్‌లో ఉన్నారని చెప్పడం, అప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ నుంచి భరోసా రాకపోవడంతో స్థానిక నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు కనుసైగతో కార్పొరేటర్లను అన్ని విధాలుగా కట్టడి చేసిన సదరు నేత.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడి వారి ప్రాపకం కోసం దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ ఉంది. వీరందరి మద్దతు తనకే ఉందని చెప్పడం ద్వారా అధిష్టానం వద్ద ముఖ్యంగా సీఎం వద్ద మార్కులు కొట్టేసి తిరిగి టికెట్ తెచ్చుకునే వ్యూహాలను అమలు చేస్తున్నారన్న ప్రచారం వినిపిస్తోంది.
ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్ బహిరంగ సభ విజయవంతం చేశారని మహిళా కార్పొరేటర్ల భర్తలు, కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులకు ఆదివారం రాత్రి వరంగల్‌లోని ఓ కన్వెన్షన్ హాల్‌లో ఖరీదైన మందుతో విందు ఇవ్వడం హట్‌టాపిక్‌గా మారింది. మహిళా కార్పొరేటర్లు కూడా హాజరై భోజనం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వరకు ఎవరూ చేజారకుండా ఉండేందుకే ఈ విందు ఇచ్చారని తెలుస్తోంది.
ఏదేమైనా ఇన్నాళ్లు గ్రూప్ రాజకీయాలు చేసి కొందరిని పార్టీ నుంచి బయటకు పంపడం ద్వారా తనకు తిరుగులేదనుకున్న ఆ నేతకు ఇప్పుడు ఎదురుగాలి రావడంతో ఆగమాగం అవుతున్నారన్న చర్చ సాగుతోంది. ఇద్దరు కార్పొరేటర్‌లు తప్ప మిగతావారంతా హాజరయ్యారని తెలిసింది. అయితే హాజరైనవారిలో ఎంతమంది ఆయన వెంట నడుస్తారోనన్న చర్చ కూడా జరుగుతోంది.
మేం మందిమా.. ఇవేం వ్యాఖ్యలు
ములుగు, భూపాలపల్లి, వరంగల్ పశ్చిమ, పరకాల బీఆర్‌ఎస్ అభ్యర్థులను అక్కడ జరిగిన బహిరంగసభల్లో జనం సాక్షిగా గెలిపించాలంటూ మంత్రి కేటీఆర్ ప్రకటనలు చేసి వారికి టికెట్ ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. ఇదే తరహాలో వరంగల్ తూర్పులో జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ సాగుతోంది.
ఇదే సమయంలో ‘మందికి టికెట్లు ప్రకటిస్తారు.. ఇంటొని టికెట్ ప్రకటించాల్సి న అవసరం లేదు’ అంటూ ఓ చానల్‌తో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నరేందర్ చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీల్లో పెద్ద రచ్చకు దారి తీశాయి. అంటే మేం పార్టీ వాళ్లం కాదా.. మేం గులాబీ ఇంటివాళ్లం కాదా.. మందిమా? ఆయనొక్కడే ఇంటివాడా అంటూ టికెట్‌పై భరోసా ఉన్న నాయకులు రగిలిపోతున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యులు ఈవ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. టికెట్‌పై స్పష్టత లేని ఎమ్మెల్యే నరేందర్‌కు ఈవ్యాఖ్యలు మరింత ప్రతిబంధకంగా మారాయని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment