Warangal East
-
ఎమ్మెల్యే సతమతం.. కేటీఆర్ మాటల వెనుక మర్మమేంటి?
అనుకున్నది ఒక్కటి. .అయింది మరొక్కటి అన్నట్లుంది వరంగల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే పరిస్థితి. యువరాజు దృష్టిని ఆకర్షించి అభ్యర్థిత్వం ఖరారు చేసుకోవాలనుకున్న ఎమ్మెల్యే ఆశ నీరాశగా మారింది. టికెట్‌పై భరోసా లేక విపక్షాలతో పాటు సపక్ష నేతల విమర్శలు ఎదుర్కునే దుస్థితి ఏర్పడింది. రాజకీయ విమర్శల దాటికి ఎమ్మెల్యే సతమతమవుతూ విందు రాజకీయాలకు తెరలేపారు. వన్ మ్యాన్ షోకే అసలుకే ఎసరొచ్చే పరిస్థితి ఏర్పడడంతో అందరు నా వాళ్ళని నిరూపించుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారట. ఎవరా ఎమ్మెల్యే?.. ఏమిటా కథ! ఎమ్మెల్యేను అయోమయానికి గురిచేస్తున్న గ్రూప్ రాజకీయాలు వరంగల్ తూర్పు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ను గ్రూప్ రాజకీయాలు, విపక్షాల దూకుడు అయోమయానికి గురి చేస్తున్నాయి. గులాబీ గూటిలో గ్రూప్ రాజకీయాలు చాపకింద నీరులా మారి యువరాజు మంత్రి కేటిఆర్ సమక్షంలో బహిర్గతమై రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎమ్మెల్యే నరేందర్ వ్యవహరశైలి, బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలను పసిగట్టిన మంత్రి కేటీఆర్.. టికెట్ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. టచ్‌లో పదిమంది కార్పొరేటర్లు కేసీఆర్ ఆశీర్వాదం ఉంటే.. ప్రజల అండదండలుంటే మరోసారి మంచి మెజారిటీతో గెలిచిరావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని కేటిఆర్ మాట్లాడడం వెనుక ఉన్న అంతర్యం అదేనా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దానికి కొనసాగింపుగా వరంగల్ వేదికగా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పదిమంది అధికారపార్టీ కార్పొరేటర్లు తమతో టచ్‌లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. చదవండి: HYD: మహిళా కార్పొరేటర్‌తో BRS కీలక నేత అసభ్యకర వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ అధిష్టానం ముందే పసిగట్టి అభ్యర్థిత్వం ఖరారు విషయంలో క్లారిటీ ఇవ్వలేదనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణితో పాటు ఎంతో మంది ముఖ్యనేతలకు వరంగల్ నుంచి సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చారంటూ సభా వేదికగా మంత్రి కేటీఆర్ అనడాన్ని బట్టి చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీకి చాలామంది అర్హులున్నారని చెప్పకనే చెప్పినట్లైందన్న టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. అందరినీ కలుపుకునిపోయేవారికి అండదండలుంటాయని, వన్ మ్యాన్ షోకు అస్కారం ఉండదని మంత్రి కేటీఆర్ మాటల వెనుక మర్మమమని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. బుజ్జగింపు పర్వం వరంగల్ తూర్పులో మంత్రి కేటీఆర్ పర్యటన తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇన్నాళ్లూ వన్ మ్యాన్ షోను తలపించిన గులాబీ పార్టీలో అనుకొని విందులు, కళలో కూడా అనుకొని అతిథులకు ఇస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే గతంలో కొందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే వ్యవహరశైలిపై అసంతప్తితో జట్టుగా ఏర్పడి పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారని పలుమార్లు చర్చల్లోకి వచ్చింది. అయినా అప్పుడూ ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవన్న ప్రచారం ఉంది. తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పదిమంది అధికార పార్టీ కార్పొరేటర్లు తనకు టచ్‌లో ఉన్నారని చెప్పడం, అప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ నుంచి భరోసా రాకపోవడంతో స్థానిక నేతల బుజ్జగింపు పర్వానికి తెరలేపారని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఖరీదైన మందుతో విందు ఓవైపు ఏదిఏమైనా ఇన్నాళ్లూ కనుసైగతో కార్పొరేటర్లను అన్ని విధాలుగా కట్టడి చేసినా సదరు నేత.. ఇప్పుడూ ఆత్మరక్షణలో పడి వారి ప్రసన్నం కోసం దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందరి మద్దతు తనకే ఉందని చెప్పడం ద్వారా అధిష్టానం వద్ద ముఖ్యంగా సీఎం కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేసి తిరిగి టికెట్ తెచ్చుకునే వ్యూహలను అమలు చేస్తున్నారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ బహిరంగసభ విజయవంతం చేశారని మహిళా కార్పొరేటర్ల భర్తలు, కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులకు వరంగల్‌లోని ఓ కన్వెన్షన్ హాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఖరీదైన మందుతో విందు ఇవ్వడం హట్ టాపిక్‌గా మారింది. చదవండి: కేసీఆర్‌కు అంత సీన్ లేదు.. పవార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇద్దరు కార్పొరేటర్ల డుమ్మా అయితే ఎన్నికల వరకు ఎవరూ చేజారకుండా ఉండేందుకే ఈ విందన్న ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఇన్నాళ్లూ గ్రూప్ రాజకీయాలు చేసి కొందరిని పార్టీ నుంచి బయటకు పంపడం ద్వారా తనకు తిరుగులేదనుకున్న ఆ నేతకు ఇప్పుడూ ఎదురుగాలి రావడంతో ఆగమాగం అవుతున్నారన్న చర్చ సాగుతోంది. ఇద్దరు కార్పొరేటర్లు తప్ప మిగతావారందరూ హజరయ్యారని తెలిసింది. అయితే హజరైనవారిలో ఎంతమంది ఆయన వెంట నడుస్తారోనన్న చర్చ కూడా జరుగుతోంది. టికెట్ విషయంలో నో క్లారిటీ వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి, పరకాల, పాలకూర్తి బీఆర్ఎస్ అభ్యర్థులను అక్కడ జరిగిన బహిరంగసభలో జనం సాక్షిగా గెలిపించాలంటూ మంత్రి కేటీఆర్ ప్రకటనలు చేసి వారికి టికెట్ ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. ఇదే తరహాలో వరంగల్ తూర్పులో జరిగిన బీఆర్ఎస్ బహిరంగసభలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో రాజకీయవర్గాల్లో పెద్ద చర్చ సాగుతోంది. ఇంటివాళ్లం కాదా.. మందిమా? ఇదే సమయంలో మందికి టికెట్లు ప్రకటిస్తారు...ఇంటొనికి టికెట్ ప్రకటించాల్సిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే నరేందర్ చేసిన వ్యాఖ్యలు గులాబీ గూటిలో పెద్ద రచ్చకు దారితీశాయి. అంటే మేం పార్టీ వాళ్లం కాదా.. మేం గులాబీ ఇంటివాళ్లం కాదా.. మందిమా.. ఆయనొక్కడే ఇంటివాడా అంటూ టికెట్ దక్కించుకున్న నాయకులు, వారి అనుచరులు లోలోన రగిలిపోతున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యలంతా ఈ వ్యాఖ్యలను అధిష్టానం దష్టికి తీసుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే టికెట్‌పై స్పష్టత లేని ఎమ్మెల్యే నరేందర్‌కు ఈ వ్యాఖ్యలు మరింత ప్రతిబంధకంగా మారాయని గులాబీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల మార్పు 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మారుస్తూ వస్తోంది. 2009లో విద్యాసాగర్ పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కొండా సురేఖ గెలిచారు. అయినా కూడా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నన్నపునేని నరేందర్‌కు అవకాశం ఇవ్వడంతో విజయం సాధించారు. అయితే వరంగల్ తూర్పులో ప్రతిసారి అభ్యర్థి గెలిచినా కూడా మారుస్తూ వస్తున్న గులాబీ పార్టీ ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తుందా అన్న చర్చ మంత్రి కేటీఆర్ పర్యటన తర్వాత జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల పనితీరు బేరీజు వేసుకొని మరోసారి మా ఎమ్మెల్యేను భారీ మెజారిటీతో గెలిపించుకొండి అంటూ చెబుతూ వస్తున్నా.. వరంగల్ తూర్పులో స్పష్టత ఇవ్వకపోవడంపై రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ఇక్కడి నుంచి టికెట్ దక్కించుకునేందుకు ఇతర ముఖ్య నేతలకు ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయనే ఇండికేషన్ రావడంతో లాబీయింగ్ మొదలెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోతే అయితే కేసీఆర్ ఆశీర్వాదం ఉంటేనే అనే మాట కేటీఆర్ నుంచి రావడంతో పెద్దాయన వద్ద తమ బలబలాలు అధినేతకు తెలిసేలా కొందరు పావులు కదుపుతున్నారు. ఒకవేళ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోతే రాజ్యసభ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, రాజనాల శ్రీహరితో పాటు ఓ బడా వ్యాపారవేత్త పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు ఎటు వైపు దారి తీస్తాయోనని ఓరుగల్లు ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. -
పాదయాత్రతోనే కొండా సురేఖ రీ ఎంట్రీ.. అక్కడి నుంచే పోటీ!
సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇన్నాళ్లు స్తబ్దు గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కొండా సురేఖ తూర్పు నుంచి బరిలోకి దిగుతారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కొండా సురేఖ గెలిచారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ విడుదల చేసిన తొలి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి మారారు. పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వరంగల్ తూర్పులో యాక్టివ్‌గా లేకపోయినా.. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొన్నారు. దీంతో ఇన్నాళ్లూ.. కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే ముఖ్య నాయకుడు వరంగల్ తూర్పులో లేకపోవడంతో హస్తం శ్రేణులు ఉన్నామా.. అంటే ఉన్నాం.. అన్నట్లుగా పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. శ్రేణుల్లో జోష్ కొండా కుటుంబం నుంచి ఒక్కరే పోటీ చేస్తారని, అది కూడా కొండా సురేఖ గతంలో పోటీ చేసి గెలిచిన వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉంటారని స్పష్టమైన ప్రకటన రావడంతో.. హస్తం శ్రేణుల్లో జోష్ పెరిగింది. బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా తమ సామాజిక ఓట్లను రాబట్టుకోవడంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయక ఓట్లు అనుకూలంగా మలుచుకుంటే విజయఢంకా మోగించవచ్చన్న ధీమాలో ఉన్నారు. అయితే ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కూడా బీసీ సామాజిక వర్గం కావడంతో పాటు బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తనకు కలిసొస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో జనాలను కలుస్తూ పాజిటివ్ వైబ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లి బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ క్షేత్రస్థాయిలో తిరుగుతున్న ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన సమయంలో, టీఆర్ఎస్లో ఉన్న సమయంలో అన్ని డివిజన్ల నేతలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఇలా.. ముగ్గురు నేతలు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వారు కావడంతో ఈ దఫా త్రిముఖ పోరు ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రసవత్తరంగా రాజకీయాలు ఈనెల తొమ్మిది నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గడప గడపకూ పాదయాత్రతో మళ్లీ ప్రజల నుంచి కొండంత అభిమానాన్ని దక్కించుకోవాలని కొండా సురేఖ ప్రణాళిక రచించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టనున్న ‘హథ్ సే హథ్ జోడో’ పాదయాత్రకు మద్దతుగా తూర్పులో పాదయాత్ర చేస్తామని కొండా మురళి ప్రకటించడంతో తూర్పులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇన్నాళ్లూ అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపే నాయకులు పెద్దగా కాంగ్రెస్‌లో లేకపోవడంతో హస్తం డీలా పడింది. తూర్పు నియోజకవర్గం అణువణువునా తెలిసిన కొండా సురేఖ పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల మద్దతు కూడగడుతూనే ప్రజా సమస్యల్ని ఎత్తిచూపేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇంకో వైపు ఇతర పార్టీల నుంచి చేరికలుంటాయని కొండా అనుయాయులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో తూర్పులో రాజకీయ వేడి మొదలైందన్న చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కూడా జనహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇతర పార్టీ నేతలను గులాబీ పార్టీలో చేరుస్తూ అభివృద్ధి నినాదంతో ఇప్పటికే జనాల్లో తిరుగుతున్నారు. ఇక బీజేపీ కూడా ఈసీటుపై గురిపెట్టడంతో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మార్గదర్శకాల ప్రకారం కమలనాథులు ఏకతాటిపైకి వచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దాదాపు ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకే టికెట్ అవకాశాలు ఉండడంతో ఆయన జనాలతో మమేకమవుతున్నారు. పార్టీలో సభ్యత్వాలు పెంచుతూ ముందుకెళ్తున్నారు. ఈ ముగ్గురు నియోజకవర్గంతో అనుబంధం ఉన్నవాళ్లే కావడంతో వచ్చే ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా ఉండే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
వరంగల్ తూర్పులో టీఆర్ఎస్కు తప్పని తలనొప్పి.. పాలకుర్తిలో కొండా రెడీ?
ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రస్తుతం టిఆర్ఎస్ కోటగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఒంటెద్దు పోకడతో గులాబీ గూటిలో ముసలం పుట్టి గ్రూప్ రాజకీయాలతో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అధికార పార్టీ లోని గ్రూప్ రాజకీయాలను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మూడున్నరేళ్ళలో మారిన పరిణామాల కారణంగా.. నన్నపనేని నరేందర్ కి పోటీగా బస్వరాజ్ సారయ్య, గుండు సుధారాణి రేస్‌లో వుండే అవకాశం లేకపోలేదు. ఒకరంటే ఒకరికి పడక వర్గపోరు తీవ్రం అవుతుండడంతో టిఆర్ఎస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇటీవల పార్టీని వీడటం మరో ఇబ్బంది. సురేఖకు అదే ప్లస్! కాంగ్రెస్ పార్టీ నుండి ప్రస్తుతానికి కొండా సురేఖ ఒక్కరే పోటీలో కనిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉండడం కొండా సురేఖకి కలిసివచ్చే అంశం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలయింది.వరంగల్ తూర్పుతో పాటు పరకాల, పాలకుర్తి నియోజకవర్గాలు తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కొండా ఫ్యామిలీ కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, టిఆర్ఎస్ లో వర్గ పోరు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 4 వేల ఓట్లకు పరిమితమైన బీజేపీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 45 వేల ఓట్ బ్యాంక్ సాధించుకోగలిగింది. తూర్పు ప్రజలు బీజేపీకి కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి మైనస్ పాయింట్ గా మారింది. అయితే ఇది పూర్తిగా అర్బన్ ప్రాంతం కనుక బీజేపీకి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. రంగంలో కొండా? పాలకుర్తి నియోజకవర్గం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కంచుకోట. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే గా దయాకర్ రావు ను దీవించడం నియోజకవర్గ ప్రజలకు పరిపాటిగా మారింది. విపక్ష అభ్యర్థుల బలహీనతలను అనుకూలంగా మార్చుకుని ఎర్రబెల్లి జయకేతనం ఎగురవేస్తున్నారు. దయాకర్ రావును ఢీకొట్టే సరైన నాయకుడు ఇతర పార్టీల్లో లేకపోవడం ఆయనకు కలిసోస్తుందనే అభిప్రాయం వ్యక్త మవుతుంది. కానీ రాబోయే ఎన్నికల్లో మంత్రికి చుక్కలు చూపేందుకు రాజకీయ ప్రత్యర్ధి కొండా మురళి కాంగ్రెస్‌నుంచి బరిలో దిగుతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ నుండి గత ఎన్నికల్లో పెదగోని సోమయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రబెల్లి సుధాకర్ రావు , యతిరాజారావు కుటుంబం నుండి ఒకరు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎవరు పోటీ చేసినా బీజేపీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. -
వరంగల్ తూర్పులో మారుతున్న రాజకీయ సమీకరణాలు
-
వరంగల్ ఈస్ట్‌పై ఎర్రబెల్లి గురి..!
సాక్షి, వరంగల్ అర్బన్ : వరంగల్ తూర్పు నియోజకర్గ టెకెట్ కేసీఆర్ తనకు కేటాయిస్తారన్న నమ్మకముందని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. హంటర్‌రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి మాజీ మంత్రి బస్వరాజు సారయ్యపై స్వల్ప మెజార్టీతో ఓడియానని తెలిపారు. వరంగల్ తూర్పులో తనకు కార్యకర్తల బలం ఉందని.. టీఆర్ఎస్ తరుఫున పోటీచేస్తే తప్పక గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై తిరుగుబాటు ఎగరవేసిన కొండా దంపతులపై విమర్శల వర్షం కురిపించారు. గతంలో తనకు టికెట్ ఇవ్వకున్నా కేసీఆర్ మాట ప్రకారం నడుచుకుని.. కొండా సురేఖను దగ్గరుండి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని తెలిపారు. అంతేకాకుండా తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి కొండా మురళీధర్ రావుని ఎమ్మెల్సీగా గెలిపించామని వెల్లడించారు. వారు గెలిచిన అనంతరం మూడేళ్లపాటు పార్టీ కార్యకర్తలను, కార్పొరేటర్లను తీవ్రం వేధింపులకు గురిచేశారని అన్నారు. చివరికి టికెట్ రాకపోవడంతో పార్టీపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వరంగల్ తూర్పు టికెట్ తనకు కేటాయించలేదని కొండా దంపతులు టీఆర్ఎస్పై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. -
కొండా సురేఖ గట్టెక్కుంతుందా!
రాజకీయాల్లో నేతలు ఎప్పుడు హీరోలవుతారో.. జీరోలవుతారో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. డిపాజిట్టు రావడం కూడా కష్టమే అనుకున్న వాళ్లు అనూహ్యంగా గెలుపు సాధించడం, సులభంగా గెలుస్తారని ఊహించిన వాళ్లు బొక్కా బొర్లా పటడం ఎన్నోసార్లు మనకు ఎదురైన అనుభవాలే. అంతేకాకుండా స్థానిక రాజకీయాల్లో ప్రభావం చూపుతూ చక్రం తిప్పిన వాళ్లు కనుమరుగై పోవడం రాజకీయాల్లో చూస్తునే ఉంటాం. ఇలాంటి పరిస్థితులన్ని కొండా సురేఖ రాజకీయ జీవితానికి సరిపోయే అంశాలు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రిగా, పార్టీలో ఎదురులేని నాయకురాలిగా కొండా సురేఖ ఏకచత్రాధిపత్యం సాగించారు. మహానేత వైఎస్ఆర్ మన మధ్య నుంచి దూరమయ్యాక మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కొనసాగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తనవంతు పాత్రను పోషించి తెలంగాణ రాష్ట్ర సమితి తీరుపై పదునైన విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎదిరించి తనదైన శైలిలో ఉద్యమంలో పాత్రను పోషించడానికి ప్రయత్నించారు. తర్వాత పరకాల నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన కొండా సురేఖ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. తర్వాత చోటుచేసుకున్న కారణాల వల్ల రాజకీయంగా జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖ ప్రభావం క్రమేపి కనుమరుగైంది. తర్వాత కాంగ్రెస్ కు చేరువైన కొండా సురేఖ... పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, గండ్ర వెంకట రమణారెడ్డిల దాటికి తట్టుకోలేకపోయారు. ఆతర్వాత తెలుగుదేశం, బీజేపీల వైపు చూసినా సరైన స్పందన లభించకపోవడంతో జిల్లాలో తనకు బద్దశత్రువైన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఎవరూ విరుచుకుపడని విధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగిన కొండా సురేఖ ప్రస్తుతం అదేపార్టీ టికెట్ పై పోటీ చేయడం స్థానిక తెలంగాణవాదులకు మింగుడుపడని విషయంగా మారింది. టీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన కొండా దంపతులు.. గత్యంతరం లేని పరిస్థితిలో.. రాజకీయ అస్థిత్వం కోసం తమ రూట్ మార్చుకున్నారు. ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి మంత్రి బస్వరాజ్ సారయ్య తో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే బలమైన సామాజికవర్గం ఉన్న బస్వరాజ్ తో పోటీ కొండాకు కష్టంగానే మారింది. అయితే ఈ నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ఓటర్లు భారీగానే ఉండటం ఆమెకు కొంత అనుకూలించవచ్చు. తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్, కేసీఆర్ విధానాలు ప్రశ్నిస్తూ.. తాము సమైక్యవాదులమే అంటూ కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలను కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్వరాజ్ సారయ్యను ఎదుర్కొంటున్న కొండా సురేఖ..స్థానిక కార్యకర్తల్ని ఆకట్టుకుని.. పొన్నాల, గండ్ర ఎత్తుల్ని తట్టుకుని గట్టేక్కుంతుందా అనే ప్రస్తుతం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.