కొండా సురేఖ గట్టెక్కుంతుందా!
కొండా సురేఖ గట్టెక్కుంతుందా!
Published Tue, Apr 22 2014 3:47 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
రాజకీయాల్లో నేతలు ఎప్పుడు హీరోలవుతారో.. జీరోలవుతారో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. డిపాజిట్టు రావడం కూడా కష్టమే అనుకున్న వాళ్లు అనూహ్యంగా గెలుపు సాధించడం, సులభంగా గెలుస్తారని ఊహించిన వాళ్లు బొక్కా బొర్లా పటడం ఎన్నోసార్లు మనకు ఎదురైన అనుభవాలే. అంతేకాకుండా స్థానిక రాజకీయాల్లో ప్రభావం చూపుతూ చక్రం తిప్పిన వాళ్లు కనుమరుగై పోవడం రాజకీయాల్లో చూస్తునే ఉంటాం. ఇలాంటి పరిస్థితులన్ని కొండా సురేఖ రాజకీయ జీవితానికి సరిపోయే అంశాలు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రిగా, పార్టీలో ఎదురులేని నాయకురాలిగా కొండా సురేఖ ఏకచత్రాధిపత్యం సాగించారు.
మహానేత వైఎస్ఆర్ మన మధ్య నుంచి దూరమయ్యాక మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కొనసాగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తనవంతు పాత్రను పోషించి తెలంగాణ రాష్ట్ర సమితి తీరుపై పదునైన విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎదిరించి తనదైన శైలిలో ఉద్యమంలో పాత్రను పోషించడానికి ప్రయత్నించారు. తర్వాత పరకాల నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన కొండా సురేఖ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
తర్వాత చోటుచేసుకున్న కారణాల వల్ల రాజకీయంగా జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖ ప్రభావం క్రమేపి కనుమరుగైంది. తర్వాత కాంగ్రెస్ కు చేరువైన కొండా సురేఖ... పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, గండ్ర వెంకట రమణారెడ్డిల దాటికి తట్టుకోలేకపోయారు. ఆతర్వాత తెలుగుదేశం, బీజేపీల వైపు చూసినా సరైన స్పందన లభించకపోవడంతో జిల్లాలో తనకు బద్దశత్రువైన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఎవరూ విరుచుకుపడని విధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగిన కొండా సురేఖ ప్రస్తుతం అదేపార్టీ టికెట్ పై పోటీ చేయడం స్థానిక తెలంగాణవాదులకు మింగుడుపడని విషయంగా మారింది. టీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన కొండా దంపతులు.. గత్యంతరం లేని పరిస్థితిలో.. రాజకీయ అస్థిత్వం కోసం తమ రూట్ మార్చుకున్నారు.
ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి మంత్రి బస్వరాజ్ సారయ్య తో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే బలమైన సామాజికవర్గం ఉన్న బస్వరాజ్ తో పోటీ కొండాకు కష్టంగానే మారింది. అయితే ఈ నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ఓటర్లు భారీగానే ఉండటం ఆమెకు కొంత అనుకూలించవచ్చు. తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్, కేసీఆర్ విధానాలు ప్రశ్నిస్తూ.. తాము సమైక్యవాదులమే అంటూ కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలను కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్వరాజ్ సారయ్యను ఎదుర్కొంటున్న కొండా సురేఖ..స్థానిక కార్యకర్తల్ని ఆకట్టుకుని.. పొన్నాల, గండ్ర ఎత్తుల్ని తట్టుకుని గట్టేక్కుంతుందా అనే ప్రస్తుతం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
Advertisement
Advertisement