సాక్షి, వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇన్నాళ్లు స్తబ్దు గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కొండా సురేఖ తూర్పు నుంచి బరిలోకి దిగుతారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో వరంగల్ తూర్పు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కొండా సురేఖ గెలిచారు.
2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విడుదల చేసిన తొలి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి మారారు. పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వరంగల్ తూర్పులో యాక్టివ్‌గా లేకపోయినా.. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొన్నారు. దీంతో ఇన్నాళ్లూ.. కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే ముఖ్య నాయకుడు వరంగల్ తూర్పులో లేకపోవడంతో హస్తం శ్రేణులు ఉన్నామా.. అంటే ఉన్నాం.. అన్నట్లుగా పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు.
శ్రేణుల్లో జోష్
కొండా కుటుంబం నుంచి ఒక్కరే పోటీ చేస్తారని, అది కూడా కొండా సురేఖ గతంలో పోటీ చేసి గెలిచిన వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉంటారని స్పష్టమైన ప్రకటన రావడంతో.. హస్తం శ్రేణుల్లో జోష్ పెరిగింది. బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా తమ సామాజిక ఓట్లను రాబట్టుకోవడంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయక ఓట్లు అనుకూలంగా మలుచుకుంటే విజయఢంకా మోగించవచ్చన్న ధీమాలో ఉన్నారు.
అయితే ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కూడా బీసీ సామాజిక వర్గం కావడంతో పాటు బీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తనకు కలిసొస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో జనాలను కలుస్తూ పాజిటివ్ వైబ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ నుంచి బయటకు వెళ్లి బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ క్షేత్రస్థాయిలో తిరుగుతున్న ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన సమయంలో, టీఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలో అన్ని డివిజన్ల నేతలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఇలా.. ముగ్గురు నేతలు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వారు కావడంతో ఈ దఫా త్రిముఖ పోరు ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రసవత్తరంగా రాజకీయాలు
ఈనెల తొమ్మిది నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గడప గడపకూ పాదయాత్రతో మళ్లీ ప్రజల నుంచి కొండంత అభిమానాన్ని దక్కించుకోవాలని కొండా సురేఖ ప్రణాళిక రచించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టనున్న ‘హథ్ సే హథ్ జోడో’ పాదయాత్రకు మద్దతుగా తూర్పులో పాదయాత్ర చేస్తామని కొండా మురళి ప్రకటించడంతో తూర్పులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇన్నాళ్లూ అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపే నాయకులు పెద్దగా కాంగ్రెస్‌లో లేకపోవడంతో హస్తం డీలా పడింది.
తూర్పు నియోజకవర్గం అణువణువునా తెలిసిన కొండా సురేఖ పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల మద్దతు కూడగడుతూనే ప్రజా సమస్యల్ని ఎత్తిచూపేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇంకో వైపు ఇతర పార్టీల నుంచి చేరికలుంటాయని కొండా అనుయాయులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో తూర్పులో రాజకీయ వేడి మొదలైందన్న చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కూడా జనహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇతర పార్టీ నేతలను గులాబీ పార్టీలో చేరుస్తూ అభివృద్ధి నినాదంతో ఇప్పటికే జనాల్లో తిరుగుతున్నారు.
ఇక బీజేపీ కూడా ఈసీటుపై గురిపెట్టడంతో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మార్గదర్శకాల ప్రకారం కమలనాథులు ఏకతాటిపైకి వచ్చి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దాదాపు ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకే టికెట్ అవకాశాలు ఉండడంతో ఆయన జనాలతో మమేకమవుతున్నారు. పార్టీలో సభ్యత్వాలు పెంచుతూ ముందుకెళ్తున్నారు. ఈ ముగ్గురు నియోజకవర్గంతో అనుబంధం ఉన్నవాళ్లే కావడంతో వచ్చే ఎన్నికలు రాజకీయాలు రసవత్తరంగా ఉండే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment