భక్తులను బయటికి పంపుతున్న పోలీసులు, అధికారులు
ములుగు: సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడానికి శుక్రవారం మేడారానికి చేరుకున్న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు దూకుడు ప్రదర్శిం చారు. నిబంధనల పేరుతో సామాన్య భక్తులను ము ప్పుతిప్పలు పెట్టారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు డు, సీఎం కేసీఆర్ మొక్కుల పేరుతో గంటపాటు భక్తులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. అప్పటికే అమ్మలను దర్శించుకోవడానికి క్యూలైన్లలో ఉన్న భక్తులు తాగునీటి సౌకర్యం లేక, ఉక్కపోతతో తంటాలుపడ్డారు. ఉపరాష్ట్రపతి, సీఎంలు దర్శించుకొని తిరుగుపయనమైన తర్వాత పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారు. భక్తులపై అరవడంతోపాటు వారిని నెట్టివేశారు. ముఖ్యంగా ఎగ్జిట్ గేటు వద్ద ఉన్న పోలీసులు తొందరగా ఖాళీ చేయాలంటూ మహిళలు, పురుషులు అని చూడకుండా పరుషభాషను ప్రయోగిస్తూ గేటు అవతలికి చొక్కాపట్టి మరీ లాగేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో సింగరేణి రెస్క్యూటీం, కేయూ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు స్ట్రెచర్ల ద్వారా బాటధితులను హుటాహుటిన టీటీడీ కళ్యాణ మండపంలోని 50పడకల ఆస్పత్రికి తరలించారు.
ప్రముఖుల రాకతో నిలిచిన దర్శనాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అమ్మవార్లకు మొక్కులు సమర్పించే క్రమంలో గద్దెల ప్రాంగణంలో భక్తులు ఎవరు లేకుండా పోలీసులు ఖాళీ చేయించారు. ఓపిక నశించిన భక్తులు క్యూలైన్ల నుంచే కేకలు వేశారు.
పోలీసుల తీరుపై డిప్యూటీ సీఎం అసహనం
కాటారం: మేడారం జాతరలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు పోలీసుల తీరుపై శుక్రవారం ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తిస్తున్న పలువురు పోలీస్ సిబ్బంది భక్తులను అదుపుచేయాల్సింది పోయి గుంపులుగుంపులు గా గద్దెల వద్దకు వెళ్లి బంగారం తీసుకోవడాన్ని వారు గమనించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు పలుమార్లు మైక్‌సెట్‌లో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పోలీస్ సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతోపాటు మంచె వద్దగల ఎమర్జెన్సీ గేట్‌ను తమ కుటుంబ సభ్యుల కోసం ఓ పోలీస్ అధికారి ఓపెన్ చేయించగా ఒకేసారి వందలాది మంది భక్తులు లోపలికి వెళ్లడానికి అక్కడికి చేరుకోవడంతో పెద్దఎత్తున తోపులాట జరిగింది. ఈ ఘటనలపై డిప్యూటీ సీఎం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఓ పోలీస్ ఉన్నతాధికారిని అప్రమత్తం చేసి గేట్ వెంటనే మూసి వేయాలని ఆదేశించారు.
మొన్న కాళిదాసు.. నిన్న కంపాటి.. నేడు సాయి చైతన్య..
ప్రతి మహాజాతర సమయంలో జిల్లా పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. 2014 మహాజాతరలో అప్పటి ఉమ్మడి జిల్లా ఎస్పీ కాళీదాసు ప్రణాళిక లోపంతో వరంగల్ రూరల్ జిల్లా గుడెప్పాడ్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పస్రా వరకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. 2016 జాతరలో ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి మీడియా ప్రతినిధులపై చేయి చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ జాతరలో యువ ట్రైనీ ఐపీఎస్ అధికారి సాయి చైతన్య, మరో ఇద్దరు ట్రైనీ పోలీసు అధికారులు డీఎస్.చౌహాన్, చేతన కలిసి గద్దెల వద్ద వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులకు పాస్‌లు ఉన్నప్పటికీ నెట్టివేయడంతో ముగ్గురు రిపోర్టర్లు పడిపోయారు. దీంతో మీడియా ప్రతినిధులు గద్దెల వద్ద ఉన్న వాచ్ టవర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఐజీ నాగిరెడ్డి వచ్చి మీడియా ప్రతినిధులకు నచ్చజెప్పినా శాంతించలేదు. ప్రతి జాతరలో పోలీసులు ఇదేతీరుగా వ్యవహరిస్తున్నారని ఆయనతో చెప్పారు. పోలీసులు డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేయడాన్ని వనదేవతల దర్శనానికి వచ్చిన సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గమనించారు. ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తే మీడియా ప్రతినిధులు బహిష్కరించే అవకాశాలుండడంతో ఐజీ నాగిరెడ్డి వచ్చి ఇప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చినప్పటికీ మీడియా ప్రతినిధులు గద్దెల వద్ద కవరేజీని బహిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment