చిలకలగుట్టపై సమ్మక్క శక్తి | sammakka special story | Sakshi
Sakshi News home page

చిలకలగుట్టపై సమ్మక్క శక్తి

Published Thu, Feb 1 2018 12:22 PM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM

sammakka special story - Sakshi

చిలకలగుట్ట

ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క. కోట్లాది మంది భక్తులు భక్తితో కొలిచే దేవత. చిలకలగుట్టపై కొలువైన సమ్మక్కను జాతర సందర్భంగా గద్దెల మీదకు తీసుకురావడం ఉద్విగ్న ఘట్టం. రెండేళ్లకోసారి సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి కిందకు తీసుకురావడం వెనుక ఉన్న కారణాలు.. గురువారం సమ్మక్క రాకను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. -సాక్షి ప్రతినిధి, వరంగల్‌ 

మేడారంలో ఆలయంలో సమ్మక్క తల్లి వడేరా కుండ రూపంలో కొలువై ఉంటుంది. సమ్మక్క పూజారులు, గ్రామస్తులకు ఈ దేవత దర్శనం ఉంటుంది. అదే.. సమ్మక్క తల్లి గద్దెలపై సకల జనులకు వెదురు రూపంలో దర్శనమిస్తుంది. పూజారులకు సైతం ఎల్లవేళలా అందుబాటులో ఉండని సమ్మక్క రూపం అత్యంత శక్తిభరితం. ఈ శక్తిని అన్ని వేళలా భరించడం సామాన్యులకు కష్టం. అందువల్లే పూజారులు అత్యంత రహస్య పద్ధ్దతుల్లో సమ్మక్కను చిలకలగుట్టపై ఉంచుతారు. ప్రతీ రెండేళ్లకోసారి సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం సందర్భంగా సమ్మక్క శక్తి స్వరూపాన్ని చిలకలగుట్ట నుంచి కిందకు తీసుకొస్తారు. ఇందుకోసం మొత్తం 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

రెండు వారాల ముందుగా..
సమ్మక్క శక్తిని మేలుకొలిపే ప్రక్రియ జాతరకు రెండు వారాల ముందుగా మొదలవుతుంది. గుడిమెలిగె పండగ రోజు సమ్మక్క వడ్డెలు(పూజారులు), ఇంటి ఆడపడుచులు మేడారంలో ఉన్న సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్‌ ఒక్కడే చిలకలగుట్టకు చేరుకుని సమ్మక్కకు ఆదివాసీ పద్ధతుల ప్రకారం శక్తిని మేల్కొలిపే ప్రక్రియ చేపడతారు. అనంతరం మండె మెలిగే రోజు మరోసారి చిలకలగుట్టకు చేరుకుని రహస్య పూజలు నిర్వహిస్తారు. చిలకలగుట్టపై సమ్మక్క ఎక్కడ ఉంటుందనేది ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్‌కు సైతం తెలియదు. చిలకలగుట్ట సగం వరకు ఎక్కిన తర్వాత సమ్మక్క పూనుతుంది. ఆ తర్వాత సమ్మక్క ఆదేశాల ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దీంతో సమ్మక్క.. గుట్ట దిగేందుకు సిద్ధమవుతుంది.

శాంతి ప్రక్రియ 
గద్దెలపైకి గురువారం సాయంత్రం చేరిన సమ్మక్క శుక్రవారం అక్కడే ఉండి జాతర నాలుగో రోజు శనివారం తిరిగి చిలకలగుట్టకు చేరుకుంటుంది. ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్, వడ్డె కొక్కెర కృష్ణయ్య ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జాతర అనంతరం వచ్చే బుధవారం రోజున తిరుగు వారం పండగ జరుపుతారు. ఈ రోజు గద్దెల ప్రాంగణం శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తారు. సిద్ధబోయిన మునీందర్‌ మూడోసారి చిలకలగుట్టకు చేరుకుని శక్తి రూపం ధరించిన సమ్మక్క తల్లిని శాంతపరుస్తారు. మళ్లీ రెండేళ్లకు సమ్మక్కను మేలుకొలుపుతామని మాట ఇచ్చి తిరుగుపయనమవుతారు.

సమ్మక్క గుడి, గద్దెపై ప్రత్యేక  పూజలు 
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని సమ్మక్క గుడిలో సమ్మక్క పూజారులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలకలగుట్ట నుంచి గురువారం సమ్మక్క తల్లిని గద్దెల మీదికి తీసుకురానున్న నేపథ్యంలో సమ్మక్క పూజారులు, వడ్డెలు సంప్రదాయ బద్దంగా సిద్దబోయిన మునేందర్‌ ఇంటి నుంచి ఆడపడుచులు పసుపు, కుంకుమ వడేరాల కుండల్లో గద్దె మీ దకు తీసుకు వచ్చారు. అక్కడ గద్దెపైన అలికి సమ్మక్క ముగ్గులను వేసి పూజ నిర్వహించారు. సమ్మక్క బిడ్డ సారక్క గద్దెపై న కూడా ముగ్గులతో అలంకరించారు. అనంతరం నాగుల వి డిది వద్ద వెళ్లి అక్కడ పూజలు చేసి విశ్రాంతి తీసుకున్నారు. 

శక్తి మేలుకోవడం..
సారలమ్మ గద్దెలపైకి చేరిన(బుధవారం) మరుసటి రోజు(గురువారం) సమ్మక్క పూజారులు, వడ్డెలు సిద్ధబోయిన మునీందర్, సమ్మయ్య, మహేశ్‌(బాల పూజారి), దోబె పగడయ్య కుమారుడు నాగేశ్వర్‌రావు, కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్యతోపాటు మేడారం గ్రామానికి చెందిన ఆదివాసీలు చిలకలగుట్టకు బయల్దేరుతారు. చిలకలగుట్టపైకి ఎక్కి దారిలో అందరూ ఆగిపోతారు. అక్కడి నుంచి సమ్మక్క పూజారులు సిద్ధబోయిన మునీందర్, సమ్మయ్య, మహేష్‌(బాల పూజారి), దోబె నాగేశ్వరరావు..  చిలకలగుట్టపై ఉన్న రహస్య ప్రాంతానికి చేరుకుంటారు.  దోబె నాగేశ్వరావు ధూపం పడతారు. మిగిలినవారు అక్కడ రహస్య క్రతువులు నిర్వహించి సమ్మక్కను కిందకు తీసుకొస్తారు. సమ్మక్క రాక కోసం గుట్టపై ఎదురుచూస్తున్న కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్యతో పాటు మిగిలిన వడ్డేలు, పూజారులు సమ్మక్కకు స్వాగతం పలుకుతారు.  జనసంచారం లేని వనంలో కొలువై ఉండే సమ్మక్క, కాళ్ల తొక్కుళ్లు ఉండే జనంలోకి వస్తుండడంతో.. దీనికి నివారణగా అక్కడ ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మరోసారి రహస్య పద్ధతిలో పూజలు చేస్తారు.

తుపాకులగూడెం సమీపంలో ఉన్న ఇప్పచెట్ల నుంచి సేకరించిన ఇప్ప పువ్వుతో చేసిన సారాను సమ్మక్కకు ఆరగింపు చేస్తారు. ఆ తర్వాత ఆదివాసీ పద్ధతిలో పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెలపైకి చేర్చే బాధ్యతను కొక్కెర కృష్ణయ్యకు సిద్ధబోయిన మునీందర్‌ అప్పగిస్తారు. అప్పటికే పూజా క్రతువు నిర్వహిస్తుండగానే కొక్కెర కృష్ణయ్యను దేవత ఆవహించగా... అచేతన స్థితిలోకి వెళ్తాడు. కొక్కెర కృష్ణయ్యను ఇద్దరు వడ్డెలు పట్టుకుని ముందుకు నడిపిస్తారు. మల్లెల ముత్తయ్య జలకం పట్టితో కృష్ణయ్య పక్కనే ఉంటూ ముందుకు సాగుతారు. దారి మధ్యలో ఎలాంటి దుష్టశక్తుల దృష్టి పడకుండా జలకంలోని నీళ్లు చల్లుతాడు. వసంతరావు, స్వామి, జనార్దన్‌ కొమ్ముబూరలు ఊదుతూ వేగంగా సమ్మక్కను చిలకలగుట్ట నుంచి కింది వైపుకు తీసుకువస్తారు. కొమ్మబూరల శబ్దం వినగానే చిలకలగుట్ట పొదల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమవుతారు.

సమ్మక్క రాకను సూచిస్తూ గాలిలోకి కాల్పులు జరుపుతారు. చిలకలగుట్ట కిందకు చేరిన సమ్మక్కకు ఎదుర్కోళ్ల పూజా మందిరం వద్ద మరోసారి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ పూజలు నిర్వహించకుంటే సమ్మక్క అస్సలు ముందుకు కదలదని చెప్తారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత సమ్మక్కను మేడారం గ్రామం వైపునకు వడివడిగా తీసుకొస్తారు. గ్రామ పొలిమేరలో మేడారానికి చెందిన 11 మంది మహిళలు బిందెలు, కుండల్లో నీళ్లు పట్టుకుని ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. బొడ్రాయికి కోడిపిల్లను తిప్పేస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement