
ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం: కోట్లాది మంది భక్తులు వచ్చే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఏం పనులు చేశారు.. ఏం విధులు నిర్వర్తిస్తున్నారని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. మేడారంలోని ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్‌లో పది శాఖల సెక్టోరియల్ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షించారు. వనదేవతలను దర్శించుకున్న ఆయన సాయంత్రం అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించి లోపాలను సరిచేయాలన్నారు. ఉదయం ఆయన జంపన్నవాగు నుంచి గద్దెల వరకు కాలినడకన తిరిగి అక్కడ నెలకొన్న సమస్యలు, భక్తులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. మరుగుదొడ్ల వద్ద నీటి సౌకర్యం లేక కంపుకొడుతున్నాయని, వాటి ని క్లీన్ చేయడంతోపాటు నీటి వసతి ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. ఆకస్మికంగా తనిఖీ చేసి మంచిగ లేకుంటే చర్యలు తీసుకుంటానని ఎస్‌ఈ రాంచంద్రు, ఈఈ నిర్మలపై మండిపడ్డారు. స్కావేంజర్లను ఏర్పాటు చేసి క్లీన్ చేయాలన్నారు. కరెంట్ పనులు ఇంకా చేయడం ఏమిటని ఎస్‌ఈ నరేష్‌ను ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాళ కరెంటు పనులు ముగించుకొని తనకు రిపోర్ట్ చెప్పాలన్నారు. రేపటి నుంచి ఐజీ నాగిరెడ్డి, ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇక్కడే ఉంటూ పర్యవేక్షణ చేస్తారని కడియం అన్నారు.
పది కిలోమీటర్ల వరకు భద్రత
పోలీసులు గద్దెల వద్ద విధుల్లో ఉన్నా భక్తుల జేబులను దొంగలు కొట్టడం ఏమిటని డీఎస్పీ రాఘవేంద్రరెడ్డిని ప్రశ్నించారు. విధుల్లో ఉన్న పోలీసులు ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా అన్నారు. గద్దెల వద్ద దొంగలు లోపలికి వచ్చి జేబులు కొడుతున్నారని స్వయంగా భక్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని కడియం అన్నారు. భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, పోలీసుల రక్షణ చర్యలు అంతగా బాగాలేవన్నారు. ఈ నెల 30 నుంచి ఒక్క వాహనం కూడా జంపన్నవాగు, గద్దెల వద్ద కనిపించొద్దని డీఎస్పీని కడియం తీవ్ర స్వరంతో ఆదేశించారు.
అమ్మలకు విశ్రాంతి
భక్తులు వేసే బంగారం, కొబ్బరి ఇతర పదార్థాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి శుభ్రంగా ఉంచాలన్నారు. ఫైర్‌సిబ్బంది గద్దెలను నీటితో శుభ్రం చేయాలన్నారు. అమ్మలకు తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల వరకు విశ్రాంతి అని భక్తులకు చెప్పి ఆ ప్రాంగణమంతా శుభ్రం చేసి ఉంచాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబును ఆదేశించారు.
మురుగు నీరు తొలగించాలి
జంపన్నవాగులో ఉన్న మురికి నీరు ప్రధాన జాతర సమయంలో తొలగించేలా చూడాలని ఇరిగేషన్ ఎస్‌ఈ కృష్ణకుమార్‌ను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ నెల 30 నుంచి భక్తులు తేట నీటిలో స్నానాలు చేసేలా చూడాలన్నారు. వాగులో క్లోరినేషన్ చేయించి భక్తులకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూడాలని ఎస్‌ఈని ఆదేశించారు. మేడారం గద్దెల నుంచి పది కిలోమీటర్ల వరకు ఎక్కడా కూడా దుమ్ముదూళి ఉండొద్దని, రోజూ బ్లీచింగ్ చల్లించాలని, చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని డీపీఓ చంద్రమౌళిని ఆదేశించారు.
ఫిబ్రవరి 2న సీఎం వస్తారు
ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని, ఆయన పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారని తెలిపారు. ఆ సమయంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాగ్రత్తగా పనిచేసి జాతరను సక్సెస్ చేయాలన్నారు. అనంతరం గద్దెల వద్ద ఉన్న మంచెపైకి వెళ్లి అక్కడ భక్తుల దర్శనాలను పరిశీలించారు. సమీక్షలో కలెక్టర్ కర్ణన్, జేసీ అమయ్ కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు, సబ్‌కలెక్టర్ గౌతమ్, ఆర్టీసీ ఆర్‌ఎం సూర్యకిరణ్, సీపీఓ కొమురయ్యతోపాటు అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment