ములుగు: జాతర అంటే నా చిన్నతనంలో ఐదు రోజుల మహా పండుగ. జాతర జరిగే ముందు బుధ, గురువారాల్లో తండాల్లోని అన్ని ఇళ్లను శుభ్రం చేసి అమ్మలకు మేడారం పున్నమి పేరుతో కోళ్లను అర్పించే వాళ్లం. అమ్మవార్లకు పెట్టిన బెల్లం ముద్దలు, కొబ్బరి ముక్కలను కలిపి సమ్మక్క–సారలక్క ఫలారముల్లో అంటూ ఇంటి పక్క వారిని ఆహ్వానించి వారికి పంచిపెట్టేవాళ్లం. ప్రస్తుతం జాతర అంటే ఒక రోజు పండుగగా మారింది..ఉదయం వెళ్లి.. సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నారని రాష్ట్ర గిరిజన పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వెల్లడించారు. మంత్రి ఏమంటున్నారో ఆయన మాటల్లోనే..
ఎడ్లబండ్ల ద్వారా వెళ్లేవాళ్లం
మేడారం జాతరకు గతంలో ఎడ్లబండ్ల ద్వారా వెళ్లేవాళ్లం. దారి సరిగ్గా లేకపోవడంతో గ్రామం నుంచి 20 వరకు ఎడ్లబండ్లు కలిసి వెళ్లేవి. మా ఊరు ము లుగు మండలం జగ్గన్నపేట పంచాయతీ పరిధిలోని సారంగపల్లి నుంచి రెండు రోజుల పాటు ప్రయాణించి జాతరకు చేరుకునే వాళ్లం. జంపన్నవాగు వద్ద లోతుగా ఇసుక ఎక్కువగా ఉండేది. దీంతో ఎడ్ల బండ్లు అక్కడే విడిచేవాళ్లం. అప్పటి అనుభూతి వేరుగా ఉండేది. ప్రస్తుతం జాతర తీరు మారింది. రహదారి సౌకర్యాలు పెరిగాయి. ఉదయం జాతరకు వెళితే సాయంత్రానికి ఇంటికి చేరుకుంటున్నారు. సమ్మక్క–సారలమ్మను వేడుకుంటే ఇబ్బందులు తొలుగుతాయని మా కుటుంబమంతా నమ్మేది.
38 సెక్టార్లుగా జాతర
ప్రభుత్వం తరపున 2016 జాతరలో సుమారు రూ.170 కోట్లను కేటాయించి శాశ్వత ప్రాతిపాదికన రహదారులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, గద్దెల చుట్టూ ఏర్పాటు చేశాం. ఈ సారి జాతరలో రూ 80.55 కోట్లు కేటాయించాం. గతంలో కంటే భిన్నంగా లగ్జరీటెంట్లు, మరుగుదొడ్లు, కార్పెట్ సౌకర్యాలున్నాయి. రూ.2కోట్లతో మ్యూజియం, 10 హరిత కాటేజీలు ఆదివాసీ నృత్యాలు, చిత్ర ప్రదర్శనకు హంపీ థియేటర్‌ను నిర్మిస్తున్నాం. భక్తుల కోసం పర్యాటకశాఖ తరపున మూడు హెలీకాప్టర్లను నడుపనున్నాం. ఈ జాతరకు వన్‌వే కొనసాగుతుంది. సుమారు 12వేల మంది పోలీసులను కేటాయించాం. పోలీసుశాఖ కొత్త టెక్నాలజీతో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, యాప్‌లను వాడుతోంది. అన్ని శాఖలను కలుపుకొని 38 సెక్టార్లను నియమించాం. భక్తులకు సింగరేణీ క్యాలరీస్ నుంచి 10లక్షల వాటర్ బాటిళ్లు, జెన్‌కో నుంచి 10లక్షల వాటర్ బాటిళ్లు, ఆర్టీసీ నుంచి మరో 5 లక్షల వాటర్ బాటిళ్లను ఉచితంగా అందించనున్నాం.
జాతీయ హోదా కల్పిస్తుందని ఆశిస్తున్నా..
1996లో మేడారానికి రాష్ట్ర పండుగగా గుర్తించిన సమయంలో నేను వరంగల్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా. మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించేంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తాం. కేంద్రాన్ని కోరాం. టీఆర్‌ఎస్ ఎంపీ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. గత 2016 జాతర నుంచి కేంద్రాన్ని కోరుతున్నా అటు వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. గత రెండు జాతరల నుంచి రాష్ట్రం నుంచి నిధులు కేటాయిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రం జాతీయ హోదా కల్పిస్తుందని ఆశిస్తున్నా.
ఆర్టీసీ, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ తరుఫున సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. 4200 బస్సులను ఏర్పాటు చేసి 1100 మంది సిబ్బంది రవాణా శాఖ తరుపున విధులకు నియమించాం. బస్సులు సరిపోకపోతే మరికొన్ని బస్సులను అందుబాటులో ఉంచుతున్నాం. వరంగల్ నుంచి పస్రా మీదుగా ప్రైవేట్ వాహనాల ద్వార వచ్చే భక్తులను చింతల్ క్రాస్ వద్ద దింపి అక్కడి నుంచి 40 ఉచిత షటిల్ బస్సులను నడపనున్నాం. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. సుమారు 35 ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తాం. జాతర పరిసరాల్లో ఈ సారి 100 తాత్కాలిక చెత్త కుండీలను ఏర్పాటు చేసి 3600 మంది కార్మికులను చెత్త సేకరణకు నియమించాం.
ఫిబ్రవరి 2న సీఎం, ఉప రాష్ట్రపతి రాక
జాతరకు ఫిబ్రవరి 2వ తేదీన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రానున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య, రాష్ట్ర ప్రభుత్వం తరుపున భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఉప రాష్ట్రపతికి కల్లార చూపించనున్నాం.
Comments
Please login to add a commentAdd a comment