Azmeera chandulal
-
తెలంగాణ మాజీ మంత్రి చందూలాల్ కన్నుమూత
ములుగు: మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (67) కన్నుమూశారు. కొంతకాలం కిందట కిడ్నీలు విఫలమవగా, మార్పిడి చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు. అప్పటి నుంచి డయాలసిస్‌పైనే ఆధారపడుతున్నారు. పది రోజుల కిందట వరకు బాగానే ఉన్నప్పటికీ, ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటలకు మృతి చెందారు. ప్రస్తుత ములుగు జిల్లా జగ్గన్నపేటలో 17 ఆగస్టు 1954న జన్మించిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా పలుమార్లు గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాల్లో పదవులు నిర్వర్తించారు. చందూలాల్‌కు భార్య శారద, కుమారుడు ప్రహ్లాద్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సర్పంచ్‌గా మొదలైన ప్రస్థానం జగ్గన్నపేటకు చెందిన చందూలాల్ తొలుత 1981లో సర్పంచ్‌గా గెలిచారు. 1982లో టీడీపీలో చేరిన ఆయన 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 1985లో ఎమ్మెల్యేగా గెలిచి.. అప్పటి ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ మంత్రిగా పనిచేశారు. 1989 ఎన్నికల్లో ఓటమి పాలై, 1994 ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో టీడీపీని వీడి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన చందూలాల్‌కు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కింది. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వయోభారంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాగా, 1996 మధ్యంతర లోక్‌సభ ఎన్నికల్లో, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వరంగల్ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. కాగా చందూలాల్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సంతాపం మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చందూలాల్, ములుగు శాసనసభా స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు వరంగల్ ఎంపీగా గెలుపొందారని, రెండుసార్లు మంత్రిపదవి చేపట్టి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన చందూలాల్ నూతన తెలంగాణ రాష్ట్రంలో తన మంత్రివర్గంలో గిరిజన సంక్షేమం, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. మాజీ మంత్రి చందూలాల్ మరణం పార్టీకి తీరనిలోటని అన్నారు. చందూలాల్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రివర్యులు శ్రీ అజ్మీరా చందూలాల్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/gndjgMVQS3 — Eatala Rajender (@Eatala_Rajender) April 15, 2021 -
ఆవిర్భావ వేడుకలు అదిరిపోవాలి
నాగర్‌కర్నూల్ : రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జూన్ 2న అదిరిపోయేలా నిర్వహించడానికి జిల్లా స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ ఆదేశించారు. రాష్ట్ర అవతర వేడుకలపై శుక్రవారం వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా కలెక్టర్లు, జేసీలు, ఇతర జిల్లా అధికారులతో మాట్లాడారు. గతంలో నిర్వహించిన మాదిరిగానే జిల్లా స్థాయిలో పలు రంగాల్లో విశిష్ట సేవలు ఆందించిన ప్రముఖులకు రూ. 51,116లు నగదు పురస్కారాలు అందించాలని, అమరవీరులకు నివాళులు అర్పించాలని, పెద్ద ఎత్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు చేపాట్టాలని, జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉత్సవాలకు జరిపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనాథ శరణాలయాల్లో విద్యార్థులకు పండ్లు, మిటాయిలు పంపిణీ చేయాలని తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. ఇదివరకే ప్రతిపాధనలు పంపిన 686 మంది వృద్ధ కళాకారులకు 1500 చొప్పున పింఛన్ మంజూరు చేశామని, జిల్లా నుంచి 20 దరఖస్తులు పంపించాలన్నారు. ఈ సందర్భంగా జేసి సురేందర్ కరణ్ జిల్లాకు సంబంధించిన సమాచారం అందించారు. వీసీలో డీఆర్వో మధుసూదన్ నాయక్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఐదు రోజుల పండుగ
ములుగు: జాతర అంటే నా చిన్నతనంలో ఐదు రోజుల మహా పండుగ. జాతర జరిగే ముందు బుధ, గురువారాల్లో తండాల్లోని అన్ని ఇళ్లను శుభ్రం చేసి అమ్మలకు మేడారం పున్నమి పేరుతో కోళ్లను అర్పించే వాళ్లం. అమ్మవార్లకు పెట్టిన బెల్లం ముద్దలు, కొబ్బరి ముక్కలను కలిపి సమ్మక్క–సారలక్క ఫలారముల్లో అంటూ ఇంటి పక్క వారిని ఆహ్వానించి వారికి పంచిపెట్టేవాళ్లం. ప్రస్తుతం జాతర అంటే ఒక రోజు పండుగగా మారింది..ఉదయం వెళ్లి.. సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నారని రాష్ట్ర గిరిజన పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వెల్లడించారు. మంత్రి ఏమంటున్నారో ఆయన మాటల్లోనే.. ఎడ్లబండ్ల ద్వారా వెళ్లేవాళ్లం మేడారం జాతరకు గతంలో ఎడ్లబండ్ల ద్వారా వెళ్లేవాళ్లం. దారి సరిగ్గా లేకపోవడంతో గ్రామం నుంచి 20 వరకు ఎడ్లబండ్లు కలిసి వెళ్లేవి. మా ఊరు ము లుగు మండలం జగ్గన్నపేట పంచాయతీ పరిధిలోని సారంగపల్లి నుంచి రెండు రోజుల పాటు ప్రయాణించి జాతరకు చేరుకునే వాళ్లం. జంపన్నవాగు వద్ద లోతుగా ఇసుక ఎక్కువగా ఉండేది. దీంతో ఎడ్ల బండ్లు అక్కడే విడిచేవాళ్లం. అప్పటి అనుభూతి వేరుగా ఉండేది. ప్రస్తుతం జాతర తీరు మారింది. రహదారి సౌకర్యాలు పెరిగాయి. ఉదయం జాతరకు వెళితే సాయంత్రానికి ఇంటికి చేరుకుంటున్నారు. సమ్మక్క–సారలమ్మను వేడుకుంటే ఇబ్బందులు తొలుగుతాయని మా కుటుంబమంతా నమ్మేది. 38 సెక్టార్లుగా జాతర ప్రభుత్వం తరపున 2016 జాతరలో సుమారు రూ.170 కోట్లను కేటాయించి శాశ్వత ప్రాతిపాదికన రహదారులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, గద్దెల చుట్టూ ఏర్పాటు చేశాం. ఈ సారి జాతరలో రూ 80.55 కోట్లు కేటాయించాం. గతంలో కంటే భిన్నంగా లగ్జరీటెంట్లు, మరుగుదొడ్లు, కార్పెట్ సౌకర్యాలున్నాయి. రూ.2కోట్లతో మ్యూజియం, 10 హరిత కాటేజీలు ఆదివాసీ నృత్యాలు, చిత్ర ప్రదర్శనకు హంపీ థియేటర్‌ను నిర్మిస్తున్నాం. భక్తుల కోసం పర్యాటకశాఖ తరపున మూడు హెలీకాప్టర్లను నడుపనున్నాం. ఈ జాతరకు వన్‌వే కొనసాగుతుంది. సుమారు 12వేల మంది పోలీసులను కేటాయించాం. పోలీసుశాఖ కొత్త టెక్నాలజీతో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, యాప్‌లను వాడుతోంది. అన్ని శాఖలను కలుపుకొని 38 సెక్టార్లను నియమించాం. భక్తులకు సింగరేణీ క్యాలరీస్ నుంచి 10లక్షల వాటర్ బాటిళ్లు, జెన్కో నుంచి 10లక్షల వాటర్ బాటిళ్లు, ఆర్టీసీ నుంచి మరో 5 లక్షల వాటర్ బాటిళ్లను ఉచితంగా అందించనున్నాం. జాతీయ హోదా కల్పిస్తుందని ఆశిస్తున్నా.. 1996లో మేడారానికి రాష్ట్ర పండుగగా గుర్తించిన సమయంలో నేను వరంగల్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా. మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించేంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తాం. కేంద్రాన్ని కోరాం. టీఆర్ఎస్ ఎంపీ పార్లమెంట్లో ప్రస్తావించారు. గత 2016 జాతర నుంచి కేంద్రాన్ని కోరుతున్నా అటు వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. గత రెండు జాతరల నుంచి రాష్ట్రం నుంచి నిధులు కేటాయిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రం జాతీయ హోదా కల్పిస్తుందని ఆశిస్తున్నా. ఆర్టీసీ, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ తరుఫున సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. 4200 బస్సులను ఏర్పాటు చేసి 1100 మంది సిబ్బంది రవాణా శాఖ తరుపున విధులకు నియమించాం. బస్సులు సరిపోకపోతే మరికొన్ని బస్సులను అందుబాటులో ఉంచుతున్నాం. వరంగల్ నుంచి పస్రా మీదుగా ప్రైవేట్ వాహనాల ద్వార వచ్చే భక్తులను చింతల్ క్రాస్ వద్ద దింపి అక్కడి నుంచి 40 ఉచిత షటిల్ బస్సులను నడపనున్నాం. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. సుమారు 35 ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తాం. జాతర పరిసరాల్లో ఈ సారి 100 తాత్కాలిక చెత్త కుండీలను ఏర్పాటు చేసి 3600 మంది కార్మికులను చెత్త సేకరణకు నియమించాం. ఫిబ్రవరి 2న సీఎం, ఉప రాష్ట్రపతి రాక జాతరకు ఫిబ్రవరి 2వ తేదీన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రానున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య, రాష్ట్ర ప్రభుత్వం తరుపున భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఉప రాష్ట్రపతికి కల్లార చూపించనున్నాం. -
'ప్రముఖ బౌద్ధ కేంద్రంగా నాగార్జున సాగర్'
నాగార్జునసాగర్ (నల్లగొండ) ఆసియాఖండంలోనే ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా నాగార్జునసాగర్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రూ.34 కోట్లతో శ్రీపర్వతారామంలో బౌద్ధవనం ప్రాజెక్టు పనులు చేపట్టారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి మరో రూ. 25కోట్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడంలో ఆలస్యమవుతోందన్నారు. యాదగిరిగుట్టకు రోప్‌వే నిర్మించే విషయాన్ని సీఎంతో చర్చించాల్సి ఉందన్నారు. మల్లెపల్లి వద్ద గల టూరిజం హోటల్‌ను రూ.30లక్షలతో ఆధునికీకరించనున్నట్లు తెలిపారు.