బతుకుపోరులో గెలిచిన బతుకమ్మ | Today Chakali Ailamma 120 birth anniversary | Sakshi
Sakshi News home page

బతుకుపోరులో గెలిచిన బతుకమ్మ

Published Mon, Oct 19 2015 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

బతుకుపోరులో గెలిచిన బతుకమ్మ

బతుకుపోరులో గెలిచిన బతుకమ్మ

నారీ విజయం
నేను బతుకమ్మను మాట్లాడుతున్న. రంగురంగుల బతుకమ్మను. తీరొక్క పువ్వులను తనువెల్లా ధరించిన అమ్మను. నన్ను తలచుకుంటేనే తెలంగాణ ఆడబిడ్డల మనసు పులకిరిస్తది. సరే, నా గురించి అందరికీ తెలిసిందే కదా. కానీ, నేను చెప్పాలనుకున్నది, నా మనసుల ఉన్నది ఎవరికీ తెల్వదు. ఇయ్యాల ఆ ముచ్చట మీకు చెప్పాలని ఉంది. అచ్చట్లు ముచ్చట్లు కాదు, అది బతుకు ముచ్చట. బతుకుపోరు ముచ్చట. అది 1940ల సంగతి. తెలంగాణల మట్టి మనుషులు ఎట్టిలో మగ్గుతున్న దినాలు. ఒకరోజు మాగెండ మండుతాంది. మిట్టమధ్యాహ్నం.

చుట్టూ చెట్టూ చేమలు, కొండ కోనలు. ఆ కంచెలకెల్లి ఒక నడివయసు ఆడమనిషి నడుసుకంట వస్తాంది. ఒంటి మీద ముతక చీర. నుదుట పెద్ద పైసంత జిట్టి బొట్టు. ఎత్తై మనిషి. ఒత్తై జుట్టు. చేతులకు మట్టిగాజులు. కాళ్లకు కడాలు. సిగలో బంతిపువ్వు తురుముకుంది. వస్తాంది పులిబిడ్డ లెక్క. ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూసి మోదుగుపువ్వులు మురిసిపోతున్నయి. ఒంటరిగా వెళుతున్న ఆమె ధైర్యాన్ని చూసి కామాంచ పువ్వులు రోమాంచితమవుతున్నయి. ఆమె పాదాలను సుతిమెత్తగా తాకుతూ సాగనంపుతున్నయి. తంగేడు పువ్వులు ఒక కొమ్మను అందించినై. ఏమైంది ఈ తల్లికి అని గునుగు పువ్వులు గుసగుసలాడుతున్నయి.

ఎనుగుల్ల పువ్వులు ఏమైందని ఆరా తీస్తున్నయి. అప్పుడు సోంపువ్వులు చెబుతున్నయి వినసొంపుగా ఆమె కన్నీటి వెతను. పోరాట కతను. ఆమె పేరు ఐలమ్మ. అందరూ చాకలి ఐలమ్మ అంటరు. పుట్టింది వరంగల్ జిల్లా రాయపర్తిల చాకలింట. ఓరుగంటి మల్లమ్మ, సాయిలు నాలుగో సంతానం. మెట్టినిల్లు పాలకుర్తిల. చిట్యాల నర్సయ్యతో పదో ఏట ఆమె పెళ్లి అయింది. ఐదుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. బట్టలుతికి చాకిరి చేయడం ఇష్టంలేక రామారం దొర దగ్గర నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకుంది.

ఇంటిల్లిపాది ఒళ్లొంచి పంటలు పండిస్తాంది. ఇంకా బండి మీద కుండలల్ల కల్లు తీసుకపోయి వేరే ఊర్లల్ల అమ్మేది. దొరల గడీల వెట్టి చేయనన్నది. కష్టం చేసి కడుపు నింపుకుంటనని కరాఖండిగా చెప్పింది. అంతే... విన్నూరు దొర కన్నెర్ర జేసిండు. ఆమెకు బతుకుదెరువుగా ఉన్న భూమిని కాజేయాలని కుయుక్తులు పన్నిండు. కౌలుభూమి ఆమెకు దక్కవద్దని కోర్టుల కేసు పెట్టిండు. గూండాలను పెట్టించి భూమిని గుంజుకోవాలని చూసిండు.

ఆమె ఇంటికి నిప్పు పెట్టించిండు. దొర గూండాలు ఆమె ఇంట్ల ఉన్న వడ్లు, కందులు, పెసలు కాలబెట్టిండ్రు. భర్తను, కొడుకులను దొర జైలుపాలు జేసిండు. దొర దాష్టీకానికి ఐలమ్మ భయపడలేదు. ధైర్యాన్ని కూడదీసుకుని ముందుకు సాగింది. దొర సంగతి చెప్పేటందుకు సంగంల చేరింది. ఎర్రజెండాను ఎత్తిపట్టి భూస్వాములకు ఎదురు నిలిచింది. తన భూమిని, పంటలను కాపాడుకునేందుకు వకీళ్లను పెట్టుకుంది. కోర్టుల చుట్టూ తిరుగుతాంది.

కొంగుల సంగం చిట్టి, గుండె నిండా పోరాట స్ఫూర్తి తోడుగా ఒంటరిగానే ఆమె జనగాం, భోనగిరి, హైదరాబాద్ వంటి పట్నాలకు వెళ్తాంది. సంగం నాయకులను కలుసుకుని, వారి సూచనలపై చుట్టుపక్కల ఊళ్లళ్ల సంగాలు పెట్టించింది. ఐలమ్మ తెగువ ఇచ్చిన స్ఫూర్తితో కమ్యూనిస్టు నాయకులు ఊరూరా తిరిగి వెట్టికి, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా సబ్బండ జాతుల కష్టజీవులను ఏకం చేశారు. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజా పోరాటాలు వెల్లువెత్తాయి... ఒక్కసారిగా పూలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ఆనందంతో వాటి కళ్లు చెమర్చాయి. ఐలమ్మకు ఎదురేగి... ‘బతుకమ్మా’ అని దీవించాయి. ఆమె నడిచిన దారి వెంట అండగా నిలిచాయి. తమ పరిమళాలతో ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి. రెట్టించిన ఉత్సాహంతో ఐలమ్మ ముందుకు సాగింది.

ఆమె మెడలో విజయమాలగా మారాలని, ఉద్యమించే అక్కాచెల్లెళ్లకు, అమ్మలకు స్ఫూర్తిగా నిలవాలని, పువ్వులు తీర్మానించుకున్నయి. ఆ పువ్వుల నోములు ఫలించాయి. నా అక్కాచెల్లెళ్లతో నగ్నంగా బతుకమ్మలను ఆడించిన భూస్వాములు, దొరల కోటలు నేలకూలాయి. భైరాన్‌పల్లి, కొడకండ్లలో నరమేధాలు సృష్టించిన రజాకార్లు మట్టికరిచిన్రు. చివరకు కోర్టులో ఐలమ్మ కేసు గెలిచింది. భూమి ఆమె సొంతమైంది. ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి సాయంతో సీనియర్ వకీలు నాగులపల్లి కోదండ రామారావు, జూనియర్ వకీలు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆమె తరఫున వాదించారు. ఆమె పోరాట స్ఫూర్తితో ప్రజలు సాయుధపోరు చేసి నిజాం రాజ్యాన్ని కూల్చేసిన్రు.
 
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బతుకు పోరు అంటే గిదీ అని తెలియజేయడానికి. ఐలమ్మ నిజంగా బతుకమ్మే. పోరాటంలో గెలిచి బతికింది. ఆమె పోరాటం చేసింది నాలుగెకరాల కోసమే కావచ్చు. కానీ, నాలుగు కాలాలపాటు నిలిచే స్ఫూర్తిని, తెగువను, ధీరత్వాన్ని ప్రదర్శించింది ఆమె. బానిస బతుకులు వద్దని, మనిషిగా తలెత్తుకు నిలవాలని చాటింది. ఈ దేశానికి ఆమె జీవితం ఒక సందేశంగా నిలిచింది.
 ఇప్పుడు కూడా పీడనలు, దాష్టీకాలు, దోపిడీలు, అవమానాలు, అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, వివక్ష ఎక్కువై... అత్యధికులైన బహుజనులు అష్టకష్టాలు పడుతున్రు.

సెజ్‌ల పేరిట నయా భూస్వాములు భూములు గుంజుకుంటున్రు. కంపెనీలకు వేలాది ఎకరాలు కట్టబెడుతున్రు. నా చెల్లెళ్లపై అత్యాచారాలు ఎక్కువవుతున్నయి. బడుగు, బలహీన వర్గాల మీద దాడులు పెరుగుతున్నయి. ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్రు. సంచారజాతుల ప్రజలను కనీసం మనుషులుగా కూడా పరిగణించడం లేదు. ఉపాధి అవకాశాలు లేక యువత అలమటిస్తున్నది. నా రైతు బిడ్డలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్రు. సరైన తిండిలేక నా పిల్లలు బక్కచిక్కిపోతున్రు. నేను గంగ ఒడిలో అంతర్థానమై, ఐలమ్మనై, మీ బిడ్డనై 1895ల తెలంగాణ మట్టిని తొలుచుకొని వచ్చిన. బతుకుపోరుల సామాన్యులకు స్ఫూర్తినిచ్చేందుకు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాను.
 - నీలం ఉపేంద్ర
(నేడు సద్దుల బతుకమ్మ నాడు వీరనారి ఐలమ్మ 120వ జయంతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement