
చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కవిత, బండా ప్రకాశ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంతో వెనుకబడిన తరగతులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. వెనుకబడిన తరగతుల వారికి బీజేపీ వ్యతిరేకమని గవర్నర్ తాజా నిర్ణయంతో మరోమారు నిరూపితమైందన్నారు. శాసనమండలి ఆవరణలో మంగళవారం జరిగిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్‌తో కలిసి ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర మంత్రి మండలి ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేసిన ఇద్దరి పేర్లను తిరస్కరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని స్పష్టం చేశారు. దేశంలో భారత రాజ్యాంగానికి బదులు బీజేపీ రాజ్యాంగం నడుస్తుందనే అనుమానం కలిగేలా పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.