denial
-
గవర్నర్ నిర్ణయంతో బీసీలకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంతో వెనుకబడిన తరగతులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. వెనుకబడిన తరగతుల వారికి బీజేపీ వ్యతిరేకమని గవర్నర్ తాజా నిర్ణయంతో మరోమారు నిరూపితమైందన్నారు. శాసనమండలి ఆవరణలో మంగళవారం జరిగిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్తో కలిసి ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర మంత్రి మండలి ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేసిన ఇద్దరి పేర్లను తిరస్కరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని స్పష్టం చేశారు. దేశంలో భారత రాజ్యాంగానికి బదులు బీజేపీ రాజ్యాంగం నడుస్తుందనే అనుమానం కలిగేలా పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు. -
ముగ్గురు భారత అథ్లెట్లకు చైనా వీసా నిరాకరణ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వుషు పోటీల్లో పాల్గొనాల్సిన 11 మంది సభ్యుల భారత బృందంలో ముగ్గురికి చైనా ప్రభుత్వం వీసా నిరాకరించింది. ఈ ముగ్గురూ అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే. అరుణాచల్‌ప్రదేశ్‌కు సంబంధించి భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వీసా నిరాకరణ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముగ్గురు మహిళా వుషు ప్లేయర్లు నైమన్ వాంగ్సూ, ఒనిలు టెగా, మేపుంగ్ లంగులను భారత అథ్లెట్లుగా గుర్తించేందుకు చైనా నిరాకరించింది. దాంతో శుక్రవారం రాత్రి వీరు మినహా మిగిలిన ముగ్గురు ఆసియా క్రీడల కోసం చైనా బయల్దేరి వెళ్లారు. ఈ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసియా క్రీడలకు హాజరయ్యేందుకు చైనాకు వెళ్లాల్సిన ఠాకూర్... తాజా పరిణామాలకు నిరసనగా తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. -
ప్రిగోజిన్ మృతిపై క్రెమ్లిన్ రియాక్షన్..
వాగ్నర్ చీఫ్, తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్‌ను రష్యానే హతమార్చిందని పశ్చిన దేశాల నాయకుల ఆరోపణలపై తాజాగా క్రెమ్లిన్ స్పందించింది. అదంతా పచ్చి అబద్దం అని తెలిపింది. ప్రిగోజిన్ ఖచ్చితంగా చనిపోయాడనే విషయాన్ని తెలపడానికి నిరాకరిచింది. దర్యాప్తు పరీక్షల ఫలితాలు రావాలని స్పష్టం చేసింది. అటు.. ప్రైవేటు విమానం ప్రమాదానికి గురైన సమయంలో వాగ్నర్ చీఫ్ అందులోనే ఉన్నారని రష్యా విమానయాన అథారిటీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పేర్కొంది. విమాన ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుభూతి తెలిపారు. ప్రిగోజిన్, ఆయన సహచరులను పొగుడుతూనే.. కొన్ని తప్పులు కూడా చేశారని అన్నారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మరణంపై పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసినందుకు ప్రతీకారంతోనే అతన్ని అంతం చేశారని ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన రష్యా అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని అన్నారు. దర్యాప్తులోనే అసలైన నిజాలు బయటకొస్తాయని చెప్పారు. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
‘హెచ్1బీ’ తిరస్కరణలో భారతీయులే టాప్
వాషింగ్టన్: ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతీయులు సమర్పించే హెచ్1బీ వీసా దరఖాస్తులనే అమెరికా ఎక్కువగా తిరస్కరిస్తోందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ అనే ఎన్జీవో సంస్థ తెలిపింది. అలాగే రిక్వెస్ట్ ఆఫ్ ఎవిడెన్స్‌ను సమర్పించాలని అమెరికా అధికారులు భారతీయుల్నే ఎక్కువగా కోరుతున్నారని వెల్లడించింది. అమెరికా ఇమిగ్రేషన్ సర్వీస్ వివరాలను విశ్లేషించిన అనంతరం ఈ సంస్థ నివేదిక విడుదల చేసింది. 2017 మూడో, నాలుగో త్రైమాసికంలో భారతీయుల హెచ్1బీ దరఖాస్తుల తిరస్కరణ 42% పెరగ్గా, ఇతర విదేశీయులకు సంబంధించి ఇది 40 శాతంగా ఉందంది. -
‘అగస్టా’ మధ్యవర్తి అప్పగింతకు ఇటలీ నో!
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తిని భారత్‌కు అప్పగించేందుకు ఇటలీ నిరాకరించింది. ఇటలీకి చెందిన కార్లో వాలెంటినో ఫెర్డినాండో గెరోసా (71) అనే వ్యక్తి భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి బంధువులతో భేటీ అయిన తర్వాతనే హెలికాప్టర్ల ప్రమాణాల్లో మార్పులు చేసే కుంభకోణం మొదలైందని ఆరోపణలున్నాయి. ఇప్పటికే కార్లోపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా ఇటలీ పోలీసులు అతణ్ని పట్టుకున్నారు. అయితే భారత్, ఇటలీల మధ్య పరస్పర న్యాయ సహాయ ఒప్పందమేదీ లేనందున భారత అభ్యర్థనను ఇటలీ తిరస్కరించింది. దీంతో ఒప్పందం లేకుండానే కార్లోను భారత్‌కు ఎలా రప్పించాలో వివరిస్తూ సీబీఐ విదేశాంగ మంత్రిత్వ శాఖ సాయం కోరింది. -
తెర వెనుక హైడ్రామా
సాక్షి, చెన్నై: సినీ నటుడు విశాల్ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీచేయకుండా అడ్డుకునేందుకు సినిమా స్టైల్లోనే కుట్ర జరిగినట్లు అనుమానిస్తున్నారు. తెలుగు ప్రజల ఓటు చీలడం ఖాయమన్న సంకేతాలతో అధికార పక్ష అన్నాడీఎంకే వర్గం తెర వెనక రాజకీయం సాగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. విశాల్ పేరును ప్రతిపాదిస్తూ ఆర్కే నగర్‌కు చెందిన పదిమంది సంతకాలు చేశారు. పరిశీలన సమయంలో వారిలో సుమతి, దీపన్‌ల సంతకాలపై అన్నాడీఎంకే పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో తొలుత విశాల్ నామినేషన్ పత్రాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఈలోగా సుమతి, దీపన్లకు వచ్చిన బెదిరింపుల ఆడియో టేపుల్ని విశాల్.. రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో) దృష్టికి తీసుకెళ్లారు. విచారణ ముగియడంతో నామినేషన్‌కు ఆమోదం తెలిపారు. చివరకు 11 గంటల సమయంలో సుమతి, దీపన్‌ల సంతకాలు బోగస్ అని తేల్చి విశాల్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఆర్వో వేలుస్వామి అధికారికంగా ప్రకటించారు. ఇతర స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను పెద్దగా పట్టించుకోని ఆర్వో ఒక్క విశాల్ నామినేషన్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టడాన్ని చూస్తే, తెర వెనుక ఏమేరకు రాజకీయం సాగిందో స్పష్టమవుతోంది. అడ్డుకోవడం అక్రమం: విశాల్ తన నామినేషన్ తిరస్కరణకు గురవడంతో విశాల్ ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీల దృష్టికి తీసుకెళ్లారు. సినీ వర్గాలు విశాల్‌కు బాసటగా నిలిచాయి. -
ఫిలింనగర్ క్లబ్‌ను తెరిచేలా ఆదేశాలివ్వలేం
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్ క్లబ్‌ను వెంటనే తెరిచేలా జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌కు చెందిన పోర్టికో కూలి భవన నిర్మాణాలు కార్మికులు ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్చరల్సెంటర్తో పాటు ఫిలింనగర్ క్లబ్‌ను కూడా అధికారులు మూసేశారు. దీనిని సవాలు చేస్తూ కల్చరల్ సెంటర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి వాదనలు వినిపిస్తూ, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే క్లబ్‌కు తాళం వేశారని తెలిపారు. ప్రమాదం జరిగిన చోటుకు క్లబ్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు. అందువల్ల క్లబ్‌ను వెంటనే తెరిచేలా అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
‘వీణవంక’ నిందితులకు బెయిల్ నిరాకరణ
► ఇద్దరు నిందితుల పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, చల్లూరుకు చెందిన ఓ దళిత యువతిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో నిందితులకు హైకోర్టు శుక్రవారం బెయిల్ నిరాకరించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులు ముద్దం అంజయ్య అలియాస్ అంజన్న, ముద్దం రాకేష్‌లు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దాని ప్రభావం దర్యాప్తుపై ఉంటుందన్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తూ నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.