ఐలమ్మ.. తెలంగాణ ఐకాన్
పద్మా దేవేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ సాధన ఉద్యమానికి ఒక ఐకాన్‌గా నిలిచారని శాసనసభ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో ఎంతోమంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారన్నారు. త్యాగం, సాహసం,ఓర్పునకు ఆమె మారుపేరన్నారు. ఐలమ్మ ఆశయాలు, ఆదర్శాల కొనసాగించాల్సిన అవసరముందన్నారు. శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర రజక సమాజం, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చిట్యాల(చాకలి) ఐలమ్మ వర్ధంతి సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఐలమ్మ స్ఫూర్తితో ప్రజలం తా ముందుకు నడిచారన్నారు. అమరుల స్ఫూర్తితో ట్యాంక్‌బండ్‌పై స్తూపం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ జడ్జి జె.పి.జీవన్, సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా బుల్లి తెర డెరైక్టర్ నాగబాల సురేశ్‌కుమార్ రూపొందించిన ‘వీరనారి చాకలి ఐలమ్మ’ లఘుచిత్రం సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, రజక సమాజం రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ తదితరులు పాల్గొన్నారు.